IPL2022: మా నాన్న 2-3 రోజులు ఏమీ తినలేదు: Rinku Singh
ABN , First Publish Date - 2022-05-20T00:31:20+05:30 IST
బుధవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్‌పై మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ యంగ్ బ్యాట్స్‌మెన్ రింకు సింగ్ అదరగొట్టాడు. కళ్లేదుట కొండంత లక్ష్యం ఉండడంతో కోల్‌కతా ఓడిపోయినట్టేనని మ్యాచ్ చూస్తున్నవారు

ముంబై : బుధవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్(Luknow super Gaints)పై మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(Kolkata night riders) యంగ్ బ్యాట్స్‌మెన్ రింకు సింగ్(Rinku Singh) అదరగొట్టాడు. కళ్లెదుట కొండంత లక్ష్యం ఉండడంతో కోల్‌కతా ఓడిపోయినట్టేనని మ్యాచ్ చూస్తున్నవారు ఓ అభిప్రాయానికి వచ్చేసిన సమయంలో రింకు సింగ్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 15 బంతుల్లోనే 40 పరుగులు కొట్టి లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టించాడు. కోల్‌కతా గెలిచేసినట్టే అనిపించేలా చేశాడు. కానీ రింకు సింగ్ ఔటయ్యాక కేవలం 2 పరుగుల తేడాతో లక్నో మ్యాచ్ గెలిచింది. మ్యాచ్ చేజారడంతో ఉద్వేగానికి గురయిన ఈ యంగ్ బ్యాటర్ క్రికెట్ ఫ్యాన్స్ మనసులు గెలుచుకున్నాడు.
రింకు సింగ్ 2018 నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడుతున్నా వెలుగులోకి రాలేదు. జట్టులోనే ఉంటున్నా పెద్దగా అవకాశాలే లభించలేదు. ఈ ఏడాది మాత్రం 7 మ్యాచులు ఆడి 34.80 సగటుతో 174 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేటు 148.71గా ఉంది. లక్నోపై చెలరేగిన ఈ యంగ్‌స్టర్ గత ఐదేళ్లు ఎన్నో కష్టాలను ఓర్చుకున్నానని చెప్పాడు. అవకాశాలు దక్కకపోవడం, గాయాల మధ్య తన ప్రయాణం అంత సులువుగా కొనసాగలేదని గుర్తుచేసుకున్నాడు. గత ఐదేళ్ల తన కెరీర్ ఎంతో సవాళ్లతో కూడుకున్నదని, ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదని చెప్పాడు.
‘‘ గతేడాది నాకు ఎంతో కష్టకాలం. విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ రన్ కోసం ప్రయత్నిస్తుండగా మోకాలు గాయమైంది. ఆ సమయంతో నా దృష్టంతా ఐపీఎల్‌పైనే ఉంది. కానీ మోకాలుకు శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. రికవర్ అవ్వడానికి 6-7 నెలల సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు. క్రికెట్‌కు అంతకాలం దూరంగా ఉండాలంటే బాధగా అనిపించింది. మా నాన్న 2-3 రోజులు ఏమీ తినలేదు. నా ఖర్చులు నేనే సంపాదించుకునేవాడిని. కానీ గాయాలపాలవ్వడంతో ఎంత బాధపడ్డాను’’ అని రింకు సింగ్ గుర్తుచేసుకున్నాడు.
2018 ఐపీఎల్ వేలంలో రింకు సింగ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకుంది. నాలుగేళ్లుగా కేకేఆర్ ఆటగాడిగా ఉన్నా పెద్దగా అవకాశాలు దక్కలేదనే చెప్పాలి. మొదటి ఏడాది అవకాశాలు వచ్చినా రాణించలేకపోయాడు. అయినప్పటికీ కోల్‌కతా నైట్‌రైడర్స్ తనపై ఎంతో నమ్మకం పెట్టుకుందని రింకు చెప్పాడు. ఆ తర్వాతి రెండు సీజన్లలో తిరిగి రిటెయిన్ చేసుకుందని అన్నాడు. కాగా రింకు సింగ్ మాట్లాడిన వీడియోని కేకేఆర్ యాజమాన్యం తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది.