IRL : మళ్లీ అదే సీన్
ABN , First Publish Date - 2022-12-11T00:39:43+05:30 IST
హైదరాబాద్ వేదికగా జరిగిన ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) ఆరంభ రౌండ్లో ఎదురైన పరిణామాలే ఆఖరి రౌండ్ తొలి రోజు పోటీల్లోనూ ఆవిష్కృతమయ్యాయి. శనివారం షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఏ రేసూ సమయానుసారం ప్రారంభం
ప్రధాన రేసు నేటికి వాయిదా
తొలి రోజు క్వాలిఫయింగ్ రౌండ్‌తో సరి
ఇండియన్ రేసింగ్ లీగ్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్ వేదికగా జరిగిన ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) ఆరంభ రౌండ్లో ఎదురైన పరిణామాలే ఆఖరి రౌండ్ తొలి రోజు పోటీల్లోనూ ఆవిష్కృతమయ్యాయి. శనివారం షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఏ రేసూ సమయానుసారం ప్రారంభం కాలేదు. ప్రమాణాలకు తగిన విధంగా లేని రేసింగ్ సర్క్యూట్ పుణ్యమా అని క్వాలిఫయింగ్ రేసులకు ముందు జరిగిన ప్రాక్టీసు రేసుల్లోనే డ్రైవర్లు కార్లు నడపడానికి అష్టకష్టాలు పడ్డారు. సాంకేతిక సమస్యలతో కొన్ని కార్లు మధ్యలోని ఆగిపోవడం గమనార్హం. పలు అవాంతరాల తర్వాత ఎట్టకేలకు జరిగిన తొలి క్వాలిఫయింగ్ రౌండ్లో బెంగళూరు స్పీడ్స్టార్స్ డ్రైవర్లు ఒలివర్ వెబ్-అన్షుల్ గాంధీ ద్వయం టాప్‌లో నిలిచింది. ఈ జోడీ క్వాలిఫయింగ్ రేసును 1:15.982 నిమిషాల్లో ముగించింది. గాడ్స్పీడ్ కొచ్చి డ్రైవర్లు నిఖిల్ బొహ్రా-అలిస్టర్ యూంగ్ 2వ స్థానంలో, స్పీడ్ డిమోన్స్ ఢిల్లీ డ్రైవర్లు షాహాన్ అలీ-ఆకాష్ గౌడ 3వ స్థానంలో నిలిచారు. ఇక, 2, 3 రౌండ్లలో విజయం సాధించిన హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ క్వాలిఫయింగ్ రేసులో ఆఖరి స్థానంతో సరిపెట్టుకుంది.
నేటి షెడ్యూల్..: ఉదయం 10.30 గంటలకు క్వాలిఫయింగ్ రేసు-2 జరగనుంది. ఆ తర్వాత 11.45 గంటలకు స్ర్పింట్ రేసు-1 ప్రారంభమవనుంది. మధ్యాహ్నం 1.15 గంటలకు స్ర్పింట్ రేసు-2, 3.45 గంటలకు ఆఖరి స్ర్పింట్ రేసు జరగనుంది. 4.40 గంటలకు విజేతను ప్రకటించనున్నారు.