గల్లా పట్టి.. వెనక్కు తోసేసి

ABN , First Publish Date - 2022-11-23T03:42:00+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం రభసకు దారితీసింది.

గల్లా పట్టి.. వెనక్కు తోసేసి

గురుకులాల సమన్వయకర్తపై ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఆగ్రహం

పాఠశాల ప్రారంభానికి ఆహ్వానించి.. జడ్పీ చైర్‌పర్సన్‌తో ఓపెనింగ్‌

‘ఎవరు ప్రారంభిస్తే ఏమిటన్న’ అధికారి వ్యాఖ్యలతో పట్టరాని కోపం

చైర్‌పర్సన్‌తో విభేదాలు.. అవమానంతో మరింతగా మండిపాటు

అధికారి దురుసు ప్రవర్తనతో అనుకోకుండా జరిగిందన్న ఎమ్మెల్యే

గద్వాల, నవంబరు 22: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం రభసకు దారితీసింది. ఈ పాఠశాలల ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా రీజనల్‌ కో ఆర్డినేటర్‌ వెంకట్‌రెడ్డిని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి గల్లా పట్టి తోసేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక నాయకుల వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రం సమీపంలోని దౌదర్‌పల్లిలో మంగళవారం ఉదయం10.30కు పాఠశాల ప్రారంభోత్సవం ఉంటుందని ఎమ్మెల్యే, జడ్పీ చైర్‌పర్సన్‌ సరితకు అధికారులు ఆహ్వానం పంపారు. ఆ సమయంలో రావచ్చా? అని ఎమ్మెల్యే అడగ్గా.. అరగంట ఆగి రావాలని అధికారులు సమాధానమిచ్చారు. అయితే, ఈలోపే వచ్చిన జడ్పీ చైర్‌పర్సన్‌తో పాఠశాల ప్రారంభోత్సవం పూర్తిచేశారు. తర్వా త అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే విషయం తెలుసుకుని.. ‘నన్ను అరగంట ఆగమని ఈలోపే ఎలా ప్రారంభోత్సవం చేస్తారు’ అంటూ ప్రిన్సిపల్‌ అనిలకుమారిని ప్రశ్నించారు. అయితే, ‘ఎవరు ప్రారంభిస్తే ఏమిటంటూ’ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ వెంకట్‌రెడ్డి అన్నట్లు వినిపించడంతో ఎమ్మెల్యే ఆగ్రహం కట్టలు తెగింది. ఆయన గల్లా పట్టుకుని తోసేశారు. కార్యకర్తలు ఆపడంతో శాంతించారు. కాగా, కొంతకాలంగా గద్వాల టీఆర్‌ఎ్‌సలో జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. ప్రొటోకాల్‌, వాగ్వాదాలు పరిపాటిగా మారాయి. ఈ క్రమంలో మంగళవారం నాటి కార్యక్రమంతో విభేదాలు భగ్గుమన్నాయి. తనను పిలిచి మరీ జడ్పీ చైర్‌పర్సన్‌తో పాఠశాల ప్రారంభించడాన్ని ఎమ్మెల్యే అవమానంగా భావించారని చెబుతున్నారు. కాగా, రీజనల్‌ కో ఆర్డినేటర్‌ను తోసేయడం అనుకోని ఘటన అని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని ఎమ్మెల్యే చెప్పారు. క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఉద్యోగులంటే గౌరవం ఉన్నదన్నారు. పలుసార్లు పిలిస్తేనే వస్తానని చెప్పానని, అరగంట ఆగమని.. తాను వచ్చేలోపే ప్రారంభించడంతో కార్యకర్తలు అసహనానికి గురయ్యారని పేర్కొన్నారు. అధికారి తమ కార్యకర్తలను దూషించారని తెలిపారు.

Updated Date - 2022-11-23T03:42:01+05:30 IST