Minister Mallareddy: మల్లారెడ్డిపై ఐటీ రైడ్స్.. ఎంత దొరికిందో లెక్క తేల్చిన అధికారులు

ABN , First Publish Date - 2022-11-23T20:50:29+05:30 IST

రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Mallareddy)కి ఆదాయ పన్ను(ఐటీ) శాఖ సెగ తగిలింది. ఐటీ అధికారులు మంగళవారం మల్లారెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లు, సంస్థలపై మెరుపుదాడులు చేశారు.

Minister Mallareddy: మల్లారెడ్డిపై ఐటీ రైడ్స్.. ఎంత దొరికిందో లెక్క తేల్చిన అధికారులు

హైదరాబాద్: రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిపై (Mallareddy) రెండు రోజులుగా కొనసాగుతున్న ఐటీ దాడులకు సంబంధించి అధికారులు కీలక వివరాలు వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం రూ.8.80 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. మంగళవారం జరిపిన సోదాల్లో రూ.4.80 కోట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా దొరికిన మొత్తంలో త్రిశూల్‌రెడ్డి ఇంట్లో రూ.2.80 కోట్లు, మర్రిరాజశేఖర్‌రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, మల్లారెడ్డి బావమరిది కొడుకు సంతోష్‌రెడ్డి ఇంట్లో రూ.4 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. కాగా బుధవారం మల్లారెడ్డి కోడలు, కూతురిని అధికారులు బ్యాంక్‌కు తీసుకెళ్లారు. బాలానగర్ క్రాంతి బ్యాంక్‌లో లాకర్‌ (Locker)ను అధికారులు ఓపెన్ చేయించారు.

కాగా మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఆస్తులపై ఆదాయ పన్ను(ఐటీ) శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లు, సంస్థలపై మెరుపుదాడులు చేశారు. మల్లారెడ్డి కుమారులు మహేందర్‌రెడ్డి, భద్రారెడ్డి (Mahender Reddy Bhadra Reddy), అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డితోపాటు సోదరులు, బంధువులు, సన్నిహితుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఏకంగా 50 బృందాలుగా విడిపోయి మల్లారెడ్డికి చెందిన 14 విద్యాసంస్థల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు. ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీల బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. మల్లారెడ్డి ఇంట్లో 36 గంటలుగా ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.

కాగా మల్లారెడ్డికి 38 ఇంజనీరింగ్‌ కాలేజీలు, నాలుగు మెడికల్‌ కాలేజీలు, యూనివర్సిటీతోపాటు పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్న నేపథ్యంలో.. వాటి కొనుగోలుకు సంబంధించిన వివరాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, బంధువులు గత మూడేళ్లలో కొనుగోలు చేసిన భూములు, ఆస్తులు, వాటికి డబ్బును ఎక్కడెక్కడి నుంచి చెల్లించారు? అన్న విషయాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దేవరయాంజాల్‌, శామీర్‌పేట, జవహర్‌నగర్‌, మేడ్చల్‌, ఘట్‌కేసర్‌, కీసరలో మల్లారెడ్డి కుటుంబానికి లెక్కకు మించిన ఆస్తులు ఉన్నట్లు చెబుతుంటారు. ఇక మల్లారెడ్డి మెడికల్‌ కాలేజీల్లో సీట్ల కేటాయింపులోనూ అవకతవకలు చోటుచేసుకున్నట్లు, చాలా సీట్లను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో మెడికల్‌ కాలేజీల బ్యాంకు లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-11-23T21:05:54+05:30 IST