వెట్టి కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కల్పించాలి
ABN , First Publish Date - 2022-11-25T23:20:54+05:30 IST
వెట్టి కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అంద రికీ పూర్థి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు.

- జిల్లా వెట్టికార్మికుల విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్
మహబూబ్ నగర్ (కలెక్టరేట్), నవంబరు 25 : వెట్టి కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అంద రికీ పూర్థి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అప్రమత్తంగా ఉంటే వెట్టి కార్మికులు ఉండరని అభిప్రాయపడ్డారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా వెట్టికార్మికుల విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిది షేర్వాన్ మాట్లాడుతూ మహిళా కార్మికులు పనిచేసేచోటా వైద్యసదుపాయాలు కల్పించాలని, శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు ఇప్పించాలని, వారి పిల్లల కోసం ప్రత్యేకంగా మినీ పాఠశాలలు, అంగన్వాడీలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగా అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, అదనపు ఎస్పీ రాములు, ఆర్డీఓ అనిల్ కుమార్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, డీఆర్డీఓ యాదయ్య, ఎల్‌డీఎం కె. భాస్కర్, తహసీల్దార్ పార్థసారథి, మునిసిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఎన్‌జీవోల ప్రతినిదులు హాజరయ్యారు.
పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
మహబూబ్ నగర్ (కలెక్టరేట్), నవంబరు 25 : జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్‌లో వచ్చే నెలలో నిర్వహించే పోలీసు రిక్రూట్‌మెంట్ పరీక్షలకు అన్ని శాఖల అధికారులు సహకారం అందించాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావు ఆదేశించారు. శుక్రవారం ఆయన తన చాంబరులో ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లుతో కలిసి పోలీస్ రిక్రూట్‌మెంట్ సందర్భంగా ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ యంత్రాంగం తరఫున కులం ధ్రువపత్రాల జారి, స్టేడియం గ్రౌండ్‌లో అవసరమైన ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, టాయిలెట్స్ వంటివి కల్పించాలని డీవైఎస్‌వోను ఆదేశించారు. 60 మంది పీఈటీలను కేటాయించాలని డీఈవో రవీందర్‌ను, ఒక ఆంబులెన్స్‌తో పాటు జనరల్ మెడిసిన్, మహిళా అభ్యర్థుల కోసం గైనకాలజిస్ట్, కార్డియాక్ స్పెషలిస్టులు, అవసరమైన మందులను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి వైద్య, ఆరోగ్య శాఖ డాక్టర్ శశికాంత్‌ను, బారికేడింగ్ ఏర్పాటు చేయాలని పంచాయతీ రాజ్ ఈఈ నరేందర్‌ను ఆదేశించారు. తాగునీరు, టాయిలెట్లు, పరిశుభ్రత కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని మునిసిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్‌ను ఆదేశించారు. విద్యుత్ సరఫరాపై ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఎంవీవీఎస్ మూర్తిని ఆదేశించారు. ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించే పోలీస్ రిక్రూట్‌మెంటుకు సమారు 23,500 మంది హాజరవుతున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, రెవెన్యూ కలెక్టర్ కె. సీతారామారావు, అదనపు ఎస్పీ రాములు, జిల్లా ఫైర్ అధికారి సుధాకర్, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.