అంగన్వాడీ సమ్మె ఉధృతం
ABN , Publish Date - Dec 14 , 2023 | 03:10 AM
అంగన్వాడీల సమ్మె ఉధృతమైంది. వరుసగా రెండో రోజైన బుధవారమూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయి.
రెండో రోజూ రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన కేంద్రాలు
పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందని పౌష్టికాహారం
జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు, నిరసనలు, దీక్షలు
జగన్ హామీలను అమలు చేయాలని నినాదాలు
టీడీపీ, జనసేన, కాంగ్రె స్, సీపీఐ, బీజేపీ మద్దతు
జగన్‌కు జ్ఞానోదయం కలగాలని పార్వతీపురంలో పూజలు
సమ్మె విరమించాలంటూ జిల్లాల్లోనూ అధికారుల బెదిరింపులు
ఏలూరు జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టిన అధికారులు
ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్
అంగన్వాడీల సమ్మె ఉధృతమైంది. వరుసగా రెండో రోజైన బుధవారమూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. అధికారులు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు వరుసగా రెండోరోజూ పౌష్టికాహారం అందలేదు. జిల్లా, నియోజకవర్గ కేంద్రాలు, ఐసీడీఎస్ కేంద్రాల వద్ద అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, రిలే దీక్షలు కొనసాగించారు. సమాన పనికి సమాన వేతనం అంటూ పాదయాత్ర సమయంలో జగన్ తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పలు జిల్లాల్లో ఆందోళనలకు టీడీపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరుకుల నిల్వ కేంద్రాల్లో అధికంగా గుడ్లు, ఇతర సామగ్రి ఉండిపోవడంతో అవి పాడవుతాయేమోనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె విరమించాలంటూ చాలా జిల్లాల్లో అధికారులు అంగన్‌వాడీలపై బెదిరింపులకు దిగారు. ఏలూరు జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగులగొట్టి కొత్త తాళాలు వేశారు. కొన్నిచోట్ల పాత తాళాలను అలాగే ఉంచి, వాటిపై కొత్త తాళాలు వేశారు. కాగా, సమస్యలు పరిష్కరించకుండా, సమ్మె విరమించాలంటూ ప్రభుత్వం బెదిరిపులకు దిగడంపై అంగన్వాడీలు మండిపడుతున్నారు. చాలీచాలని జీతాలతో గడ్డి తిని బతకాలా? అంటూ అనంతపురం జిల్లా శింగనమల తహసీల్దారు కార్యాలయం వద్ద వరిగడ్డితో అంగన్‌వాడీలు వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద నిరసనకు తెలుగుదేశం, జనసేన, సీఐటీయూ నాయకులు మద్దతు ప్రకటించారు.
నెల్లూరు ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ఆందోళనకు తెలుగు మహిళా నాయకురాళ్లు సంపూర్ణ మద్దతు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఉండిలో ఎమ్మెల్యే రామరాజు, తణుకులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, తాడేపల్లిగూడెంలో టీడీపీ ఇన్‌చార్జి వలవల బాబ్జి సమ్మెలో పాల్గొని మద్దతు ప్రకటించారు. కర్నూలులో సమ్మెకు జనసేన, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి. నంద్యాల జిల్లా కేంద్రంలో అంగన్‌వాడీల దీక్షాశిబిరాన్ని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌లు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఏలూరు జిల్లాలో నిరసన కార్యక్రమాలకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మద్దతు పలికారు. ఏలూరు జిల్లా మండవల్లి మండలం పులపర్రు, మణుగులూరు, కొవ్వాడలంక్ల, కాకతీయ నగర్‌లలో అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టి కొత్త తాళాలు వేయడంతో అంగన్వాడీ కార్యకర్తలు మండవల్లి పోలీసులకు ఫిర్యాదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అదే జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో ఎంపీడీవో కె.విజయ్‌ప్రసాద్ ఆధ్వర్యంలో మహిళా పోలీసుల సంరక్షణలో అంగన్‌వాడీ చిన్నారులకు సమీప పాఠశాలల వద్ద పౌష్టికాహారం అందించారు. అంగన్‌వాడీలు ధర్నా విరమించకపోతే మహిళా పోలీసులు, సచివాలయాల సిబ్బంది పర్యవేక్షణలో కేంద్రాలను తెరిపిస్తామని ఎంపీడీవో హెచ్చరించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో నిరసన శిబిరం వద్ద పోలి పాడ్యమి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి జ్ఞానోదయం కలిగించాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. గంగలో దీపాలు విడిచిపెట్టారు.
ఒళ్లు బలిసి సమ్మె
బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వ్యాఖ్యలు
అంగన్‌వాడీ సిబ్బంది ఒళ్లు బలిసి సమ్మె చేస్తున్నారని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు(వైసీపీ) మండిపడ్డారు. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొట్టక్కి గ్రామంలో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీల సమ్మెను ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. మిచౌంగ్ తుఫాను కారణంగా రాష్ట్రం ఎంతో నష్టపోయిందని, ఇలాంటి సమయంలో అంగన్‌వాడీలు సమ్మె చేయడం సమంజసం కాదన్నారు. మరో మూడు నెలల్లో ఎన్నికలు రానున్న సమయంలో అంగన్‌వాడీలు గొంతెమ్మ కోర్కెలు కోరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం తగదని చెప్పారు. రాష్ట్రంలో ఖజానా పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ జగన్ ప్రభుత్వం అంగన్‌వాడీల వేతనం రూ.10వేలకు పెంచిందన్నారు.