Chandrababu: జగన్‌పై విరుచుకుపడ్డ చంద్రబాబు
ABN , First Publish Date - 2023-02-23T16:38:21+05:30 IST
సీఎం జగన్ (CM Jagan)పై టీడీపీ అధినేత చందబాబు (Chandrababu) విరుచుకుపడ్డారు. ఏపీలో రివర్స్ పాలన కొనసాగుతోందని ఎద్దేవాచేశారు.
గుంటూరు: సీఎం జగన్ (CM Jagan)పై టీడీపీ అధినేత చందబాబు (Chandrababu) విరుచుకుపడ్డారు. ఏపీలో రివర్స్ పాలన కొనసాగుతోందని ఎద్దేవాచేశారు. ప్రజావేదిక తన ఆస్తి కాదని, ప్రజల ఆస్తి... ప్రజల డబ్బుతోనే ప్రజా వేదిక నిర్మించామని తెలిపారు. అంటువంటి ప్రజావేదికను జగన్ కూల్చివేశారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ (NTR) హయాంలోనే పలు సంక్షేమ పథకాలు తెచ్చామని గుర్తుచేశారు. రాష్ట్రంలో వచ్చిన పలువురు సీఎంలు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని, జగన్ వచ్చిన తర్వాత అన్ని పథకాలను నాశనం చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని, ఇంగ్లీష్ చదువు కొత్తగా తెచ్చినట్లు చెబుతున్నారని తప్పుబట్టారు. డీఎస్సీ (DSC) పెట్టలేదు.. ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయలేదని చంద్రబాబు విమర్శించారు.
‘‘జగన్ ఓ ఆర్థిక ఉగ్రవాది. రాష్ట్రంలోని ప్రజలందరూ పేదలయ్యారు. జగన్ మాత్రమే మరింత ధనవంతుడు అవుతున్నారు. పేదల ఆరోగ్యాన్ని కూడా ఫణంగా పెట్టి.. నాసిరకం మద్యం విక్రయాలతో జగన్ దోచుకుంటున్నారు. దేశం మొత్తం జీఎస్టీ (GST) అమలవతున్నా.. ఇక్కడ మాత్రం అమలవదు. బాబాయ్ హత్యలో జగన్ రెడ్డి అడ్డంగా దొరికిపోతాడు. ఏపీ నుంచి పరిశ్రమలు ఎందుకు తరలిపోతున్నాయి. అభివృద్ది జరిగితే సంపద పెరుగుతుంది. అమరావతి (Amaravati) వచ్చింది.. రాష్ట్రం అంతటా భూమి విలువ పెరిగింది. ఇవాళ రాష్ట్రంలో మొత్తం అభివృద్ధి ఆగిపోయింది. కొన్ని లక్షల కోట్ల విలువ చేసే ఆస్తుల విలువ తగ్గిపోయింది. ప్రశ్నించిన వారిపై ఏదో ఒక కేసు పెడుతున్నారు. మీడియాపైనే దాడులకు పాల్పడుతున్నారు. తమకు అనుకూలంగా లేని వారి ఆస్తులపై దాడులు చేస్తున్నారు. దళితులపైన రాష్ట్ర ప్రభుత్వం దాడులకు పాల్పడుతోంది. ఏపీలో శాంతిభద్రతల సమస్యలు నెలకొన్నాయి. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం చేపట్టాం’’ అని చంద్రబాబు వివరించారు.