నవ్విపోదురు గాక..
ABN , First Publish Date - 2023-10-13T03:37:38+05:30 IST
‘నవ్విపోదురుగాక.. నాకేంటి సిగ్గు’ అన్నట్లుగా ఉంది సీఎం జగన్ తీరు. ఒకే అబద్ధాన్ని పదేపదే చెబితే.. అదే నిజమని జనం నమ్మేస్తారనుకుంటున్నారో.. ఏమో గానీ.. తన పాలన గురించి,

ఇళ్లకు నిధులిచ్చేది కేంద్రం... శ్రమంతా లబ్ధిదారులది
ఘనత మాత్రం నాదేనంటున్న ముఖ్యమంత్రి జగన్
అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): ‘నవ్విపోదురుగాక.. నాకేంటి సిగ్గు’ అన్నట్లుగా ఉంది సీఎం జగన్ తీరు. ఒకే అబద్ధాన్ని పదేపదే చెబితే.. అదే నిజమని జనం నమ్మేస్తారనుకుంటున్నారో.. ఏమో గానీ.. తన పాలన గురించి, నవరత్నాల అమలు తీరుపై బహిరంగ సభల్లో పచ్చి అబద్ధాలతో ఊకదంపుడు ఉపన్యాసాలను ఊదరగొట్టేస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లా సామర్లకోటలో గురువారం నిర్వహించిన జగనన్న కాలనీల్లో సామూహిక గృహ ప్రవేశాల బహిరంగ సభలోనూ అవే అబద్ధాలను వల్లెవేశారు. రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణానికి రాయితీ సొమ్ము మొత్తం కేంద్రం ఇస్తుంటే ఆ ఘనత అంతా తనదేనని చెప్పుకోవడంతోపాటు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా తన ప్రభుత్వ ఖాతాలోనే వేసేసుకున్నారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 13 వేల పంచాయతీలుంటే.. 17 వేల జగనన్న కాలనీలు వస్తున్నాయి. ఆ కాలనీల్లో కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు అని చెప్పడానికి గర్వపడుతున్నా’ అంటూ పాత పాటే పాడారు. కానీ ఈ నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జగనన్న కాలనీల్లో 5లక్షల ఇళ్లను మాత్రమే నిర్మించగలిగారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన 1.5 లక్షల టిడ్కో ఇళ్లను కూడా ప్రభుత్వ ఖాతాలో వేసుకుని సామూహిక గృహప్రవేశాల పేరుతో ఆర్భాటం చేయడం ద్వారా ప్రజల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేశారు. ఈ గృహ ప్రవేశాలతో ప్రతి పేదవాడి ముఖంలో, ప్రతి అక్కచెల్లమ్మ ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందని సీఎం చెప్పడంతో ఇళ్ల లబ్ధిదారులంతా అవాక్కయ్యారు.
ఇళ్లు నిర్మించుకోకపోతే ఇచ్చిన స్థలాలను ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంటుందంటూ హౌసింగ్ అధికారులు ఒత్తిడి పెంచారు. స్థలాన్ని వెనక్కి తీసేసుకుంటారన్న భయంతో లబ్ధిదారులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి.. అనేక వ్యయప్రయాసలు పడి సొంతంగా ఇళ్లు నిర్మించుకున్నారు. వాటినే ప్రభుత్వం కట్టించినట్లుగా కలరింగ్ ఇస్తూ.. సామూహిక గృహప్రవేశాల పేరుతో హడావుడి చేసి క్రెడిట్ మొత్తాన్నీ తమ ఖాతాలో వేసేసుకున్నారు. మిగిలిన 25లక్షల పైచిలుకు పేదల సొంతింటి కలను ఎప్పుడు నెరవేరుస్తారనేది ప్రభుత్వ పెద్దలే చెప్పాలి.
ఇదేం లెక్క జగన్?
‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద మంజూరు చేసిన ఒక్కొక్క ఇంటికి రూ.2.70 లక్షలు ఇస్తున్నాం. అందులో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు సబ్సిడీగాను, రూ.35 వేలు పావలా వడ్డీకి లబ్ధిదారులకు రుణం ఇప్పిస్తున్నాం. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఇసుక విలువ రూ.15 వేలు.. సిమెంటు, స్టీలు, ఇతర నిర్మాణ సామగ్రి ధరలు తగ్గించి ఇస్తుండటం వల్ల జరిగే మేలు మరో రూ.40వేలు. వెరసి లబ్ధిదారులకు ప్రభుత్వపరంగా రూ.2.70లక్షలు ఇస్తున్నాం’ అంటూ సామర్లకోట బహిరంగసభలో చెప్పిన లెక్క విన్న ఇళ్ల లబ్ధిదారులకు దిమ్మ తిరిగింది. ఎందుకంటే.. పేదల ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే సబ్సిడీ రూ.1,80,000 కాగా, అందులో రూ.1,50,000 కేంద్ర ప్రభుత్వమే పీఎంఏవై(అర్బన్)కింద అందిస్తోంది. మిగిలిన రూ.30,000 సబ్సిడీని రాష్ట్రమే భరించాల్సి ఉండగా.. జగన్ సర్కారు అదీ ఇవ్వకుండా ఉపాధి పథకం కింద కేంద్రం విడుదల చేస్తున్న నిధులనే.. ఇళ్ల లబ్ధిదారులకు చెల్లిస్తోంది. ప్రభుత్వం నుంచి ఒక్క పైసా ఇవ్వకుండా.. పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తోంది. జగన్ ప్రభుత్వం తీరు ‘సొమ్మొకరిది.. పేరొకరిది’ అన్నట్లుగా ఉందంటూ లబ్ధిదారులు విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15వేల పైచిలుకు కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.32వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, దాంతో ఆ ఇంటి స్థలాల విలువ రూ.2.5 లక్షల నుంచి 12లక్షల వరకు పలుకుతోందంటూ జగన్ సామర్లకోట సభలో మరో అబద్దాన్ని అలవోకగా చెప్పేశారు.
వాస్తవానికి జగనన్న కాలనీల పేరుతో వేసిన లే-అవుట్లు ఎక్కువ శాతం ఊళ్లకు దూరంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి. మరికొన్ని శ్మశానాలకు సమీపంలోను, ఇంకొన్ని నివాసయోగ్యంకాని ప్రాంతాల్లోనూ ఉన్నాయి. మరికొన్ని కోర్టు వివాదాల్లో చిక్కుకోవడంతో వాటిలో రూ.లక్షలు పెట్టి ఇళ్లు నిర్మించుకుని కాపురాలు చేయలేమంటూ లబ్ధిదారులు ఇళ్ల పట్టాలను తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇప్పటివరకు లక్ష మందికిపైగా లబ్ధిదారులు ప్రభుత్వానికి ఇళ్ల పట్టాలను తిరిగి ఇచ్చేశారు. ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఎక్కడి పనులు అక్కడే వదిలేసి వెళ్లిపోతున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే.. జగనన్న కాలనీల్లో ఇంటి స్థలం విలువ రూ.12 లక్షలకుపైగా ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందంటూ ఇళ్ల లబ్ధిదారులు నవ్వుకుంటున్నారు.