Nara Bhuvaneshwari: లాయర్ అడిగేంతవరకు ఆ విషయం తెలియదా..?
ABN, First Publish Date - 2023-09-25T22:51:25+05:30
టీడీపీ అంటే ఒక కుటుంబమని, కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వారని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari ) అన్నారు.
రాజమహేంద్రవరం: టీడీపీ అంటే ఒక కుటుంబమని, కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వారని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari ) అన్నారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ..‘‘ టీడీపీ జెండా రెపరెపలాడటం కోసం కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారు. చంద్రబాబు(Chandrababu) అక్రమ అరెస్ట్‌పై నిరసనల్లో పాల్గొన్న మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వం ఉందో అర్థమవుతోంది. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న శాంతియుత నిరసనలను సైతం అనుమతించకుండా ప్రభుత్వం వ్యవహారిస్తున్న అణచివేత ధోరణిని భువనేశ్వరి తీవ్రంగా తప్పుబట్టారు. కార్యకర్తలు మా బిడ్డలతో సమానం.. ఆ బిడ్డలు తల్లిదండ్రుల కోసం నేడు హింసకు గురవుతున్నారు.
వారు అక్రమ కేసులకు గురై జైలుకు వెళ్తున్నారనే బాధను వ్యక్తం చేశారు. పార్టీ జెండా రెపరెపలాడాలని వారి జీవితాలనే ఫణంగా పెట్టారని, మహిళలు అన్న సంగతి కూడా మర్చిపోయి పోలీసులు ఇష్టానుసారంగా లాగిపడేస్తున్నారు. రాష్ట్రంలో నేటి లీడర్ షిప్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ఘటనలే నిదర్శనం. టీడీపీ కార్యకర్తలైన మా బిడ్డలు పార్టీకి వెన్నెముకలాంటి వాళ్లు, వాళ్లే లేకుంటే పార్టీ లేదు. పోలీసులు ఏం చేసినా తమ బిడ్డలు బెదరరని, టీడీపీ కుటుంబానికి పెద్ద అయిన చంద్రబాబు కోసం బిడ్డల్లాంటి కార్యకర్తలు నిరాహార దీక్ష చేస్తుంటే లాఠీలతో కొట్టడం బాధాకరం. వేటికీ బెదరకుండా పోరాటం చేస్తున్న, అండగా నిలుస్తున్న కార్యకర్తలు’’ అందరికీ నారా భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు.
చంద్రబాబును మానసిక క్షోభకు గురిచేయలేరు
‘‘తప్పుడు కేసులతో చంద్రబాబును జైల్లో పెట్టిన ప్రభుత్వం ఆయన భోజనం చేసేందుకు కనీసం టేబుల్ కూడా సమకూర్చలేదు. చంద్రబాబుకు భోజనం చేసేందుకు చిన్నపాటి సౌకర్యం కల్పించలేదు. అడ్వకేట్ లెటర్ పెట్టిన తర్వాత మాత్రమే ఆయనకు టేబుల్ ఏర్పాటు చేశారు. చంద్రబాబును మానసిక క్షోభకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి చిల్లర ఆలోచనలతో చంద్రబాబును ఎవరూ మానసిక క్షోభకు గురిచేయలేరు.చంద్రబాబు ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో ఉన్నారు’’ అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.
Updated Date - 2023-09-25T22:51:25+05:30 IST