Yanamala: పోలీసుల ఏకపక్ష వైఖరిని ప్రశ్నించడం నేరమా?..
ABN , First Publish Date - 2023-01-29T07:54:59+05:30 IST
పోలీసుల భద్రతా వైఫల్యాన్ని ప్రశ్నించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై కేసు పెడతారా? అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, శాసనమండలి విపక్షనేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.
అమరావతి: పోలీసుల భద్రతా వైఫల్యాన్ని ప్రశ్నించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu)పై కేసు పెడతారా? అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, శాసనమండలి విపక్షనేత యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) ప్రశ్నించారు. కుప్పంలో జరిగిన సభలో అచ్చెన్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదన్నారు. పోలీసుల ఏకపక్ష వైఖరిని ప్రశ్నించడం నేరమా? అని నిలదీశారు. లోకేష్‌కు భద్రత కల్పించడం పోలీసుల బాధ్యత కాదా?.. ఇటువంటి కేసులు టీడీపీ నేతల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవని, ప్రజా సమ్యలపై తమ పోరాటాన్ని ఆపలేరని యనమల రామకృష్ణుడు అన్నారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలీసుశాఖలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఎస్పీ రిషాంత్‌రెడ్డి అన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అచ్చెన్నపై పోలీసు సంఘం తరపున చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ రిషాంత్‌రెడ్డికి ఫిర్యాదు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తాము 500 మందితో బందోబస్తు నిర్వహించామన్నారు. కుప్పం సభలో అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు పోలీసులను రెచ్చగొట్టేలా, స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. ఎస్పీని కలిసిన వారిలో ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌కుమార్, సెక్రటరీ రామ్మోహన్ రావు, సభ్యులు పాల్గొన్నారు. అలాగే, జిల్లా పోలీసు అధికారుల సంఘం, జిల్లా మాజీ పోలీసు అధికారుల సంఘం నేతలు చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. పోలీసులను కించపరిచేలా మాట్లాడిన అచ్చెన్నాయుడు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. లేదంటే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.