AV Subbareddy Vs Akhila Priya : మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్.. భారీ బందోబస్తు..
ABN , First Publish Date - 2023-05-17T08:41:41+05:30 IST
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె భర్త భార్గవ్ రామ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను (Bhuma Akhila Priya) నంద్యాల పోలీసులు అరెస్ట్ (Arrest) చేశారు. ఆమె భర్త భార్గవ్ రామ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. భూమా అఖిలప్రియ దంపతులను ప్రత్యేక వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మంగళవారం రాత్రి టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో (Naralokesh Yuvagalam Padayatra) టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై.. అఖిల ప్రియ వర్గీయులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. నంద్యాల మండలం కొత్తపల్లి దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడి ఘటనపై నంద్యాల పోలీసులకు ఏవీ సుబ్బారెడ్డి (AV Subbareddy) ఫిర్యాదు చేయగా యాక్షన్ తీసుకున్నారు. అఖిలతో పాటు 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళ ఉదయాన్నే ఆళ్లగడ్డలోని అఖిల ప్రియ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించి అరెస్ట్ చేశారు.
హత్యాయత్నం కేసులు..!
అఖిల ఆదేశాలతోనే ఏవీపై దాడి జరిగిందని అటు నంద్యాల.. ఇటు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఏవీ సుబ్బారెడ్డి, ఆయన వర్గం.. అఖిల ప్రియతో పాటు మరికొందరిపై హత్యయత్నం కేసులు పెట్టారు. దీనిపై స్పందించిన పోలీసులు అసలేం జరిగిందని ఆరాతీసి ఇవాళ ఉదయమే అఖిలను అరెస్ట్ చేశారు. మరోవైపు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా ఏవీ సుబ్బారెడ్డి, అఖిల ప్రియ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. కాగా.. అఖిల-ఏవీ వర్గాల మధ్య ఇప్పటికే పలుమార్లు గొడవలు జరిగాయి.
అసలేం జరిగింది..!?
భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి ఇద్దరూ ప్రాణ స్నేహితులు. భూమా బతికున్నంత వరకూ అన్నీ తానై చూసుకున్న ఏవీ.. ఆయన మరణాంతరం ఒక్కసారిగా విబేధాలొచ్చాయి. నాటి నుంచి తాను రాజకీయాల్లోకి రావాలని ఏవీ ప్లాన్ చేసుకున్నారు. అంతేకాదు.. అయితే నంద్యాల, లేకుంటే ఆళ్లగడ్డ నుంచి పోటీచేయాలని ఏవీ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో అఖిల ప్రియ వర్సెస్ ఏవీగా పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటి వరకూ ఈ రెండు వర్గాల మధ్య ఎన్నిసార్లు గొడవలు జరిగాయో లెక్కలేదు. ఆ మధ్య ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ భర్త నేతృత్వంలో హత్యకు ప్లాన్ చేయడాన్ని కూడా కడప జిల్లా పోలీసులు గుర్తించిన కేసులు పెట్టిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమే అయ్యింది. నాటి నుంచి నేటి వరకూ ఈ రెండు వర్గాల వారు ఎక్కడ ఎదురుపడినా కొట్లాటలు.. ఎప్పుడు మీడియా ముందుకొచ్చిన మాటల తూటాలు పేలుతున్నాయి.
రానున్న ఎన్నికల్లో తనకే కచ్చితంగా టికెట్ వస్తుందన్న ధీమాతో సుబ్బారెడ్డి ఉన్నారు. ఈ విషయాన్ని లోకేష్ పాదయాత్ర ద్వారా అందరికీ తెలియజేయాలని భావించిన ఏవీ సుబ్బారెడ్డి తన బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో ఎవరు ఎవర్ని రెచ్చగొట్టుకున్నారో.. లేకుంటే పనిగట్టుకుని మరీ ఇలా దాడిచేశారో తెలియట్లేదు కానీ.. పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనపై టీడీపీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుంది..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.