Borugadda Anil కార్యాలయానికి నిప్పు
ABN, First Publish Date - 2023-02-07T08:54:48+05:30
వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ ఆఫీసును గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. డొంక రోడ్డులో ఉన్న ఆఫీస్‌కు అర్ధరాత్రి సమయంలో నిప్పు పెట్టారు. ఫర్నిచర్ అగ్నికి ఆహుతి అయ్యింది. ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గుంటూరు : వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ (YCP Leader Borugadda Anil) ఆఫీసును గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. డొంక రోడ్డులో ఉన్న ఆఫీస్‌కు అర్ధరాత్రి సమయంలో నిప్పు పెట్టారు. ఫర్నిచర్ అగ్నికి ఆహుతి అయ్యింది. ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) వ్యవహారంలో బోరుగడ్డ అనిల్ బాగా వైరల్ అయ్యారు. కోటంరెడ్డికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. నెల్లూరు వీధుల్లో కోటం రెడ్డిని బండికి కట్టి ఈడ్చుకు వెళతానంటూ సవాల్ విసిరారు. సీఎం జగన్ గురించి ఏమీ మాట్లాడవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వంటి వారి గురించి ఎందుకు మాట్లాడుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోటంరెడ్డి సైతం తాను అనిల్ బెదిరింపులకు భయపడబోనని తేల్చి చెప్పారు. ఆయనను తన కుటుంబ సభ్యుడిగానే పరిగణించామని వెల్లడించారు. సజ్జలే అనిల్ చేత ఆ ఆడియో కాల్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఆడియో కాల్స్ వస్తే.. మీకు వీడియో కాల్స్ వస్తాయని గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఇలా వైసీపీ నేతలు వర్సెస్ కోటంరెడ్డి వ్యవహారం నడుస్తుండగానే బోరుగడ్డ అనిల్ ఆఫీస్‌ను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. మరి ఈ వ్యవహారం రాజకీయంగా మరెంత దుమారం రేపనుందో వేచి చూడాలి.
Updated Date - 2023-02-07T08:54:51+05:30 IST