KCR BRS: పెద్ద ప్లానే ఇది.. ఏపీలో కేసీఆర్ బీఆర్‌ఎస్ పోటీ చేయాలనుకుంటున్న అసెంబ్లీ సీట్లు ఇవేనట..!
ABN , First Publish Date - 2023-01-07T14:43:42+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం (Telugu States Politics) వేడెక్కింది. రాజకీయ పార్టీల పొత్తులు, సరికొత్త ఎత్తుగడలతో ఉభయ రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ (AP Political Heat) దాదాపు ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్ (KCR BRS) పేరుతో..
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం (Telugu States Politics) వేడెక్కింది. రాజకీయ పార్టీల పొత్తులు, సరికొత్త ఎత్తుగడలతో ఉభయ రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ (AP Political Heat) దాదాపు ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్ (KCR BRS) పేరుతో జాతీయ పార్టీగా ముందుకెళ్లడమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు అధ్యక్షుడిని కూడా ప్రకటించారు. ఏపీ రాజకీయం, సామాజిక వర్గాలను వేరువేరుగా చూడలేమనే విషయాన్ని గుర్తెరిగిన కేసీఆర్ కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్‌కు (Thota Chandrasekhar) ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. జగన్ (YS Jagan) ప్రోద్భలంతోనే బీఆర్‌ఎస్ ఏపీలో (BRS AP Politics) రాజకీయం మొదలుపెట్టిందనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఈ ఊహాగానాల నేపథ్యంలో ఏపీలో బీఆర్‌ఎస్ రాజకీయానికి సంబంధించి తాజాగా మరో ప్రచారం ఊపందుకుంది. ఏపీలో వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్‌ఎస్ ఉవ్విళ్లూరుతుందట. అంతేకాదు.. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగొచ్చనే వాదన బలంగా వినిపిస్తుండటంతో ఇప్పటి నుంచే ఆంధ్రప్రదేశ్‌లో ఏఏ స్థానాల్లో పోటీ చేయాలో కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నారని సమాచారం. ఏపీలో మొత్తం 20 స్థానాల్లో పోటీ చేయాలని బీఆర్‌ఎస్ డిసైడ్ అయిందని టాక్ నడుస్తోంది. వీటిల్లో మెజార్టీ స్థానాలు అసెంబ్లీ సీట్లు కాగా, రెండుమూడు లోక్‌సభ స్థానాల్లో కూడా అభ్యర్థులను నిలపాలని బీఆర్‌ఎస్ భావిస్తుందని తెలిసింది.
మరీ ముఖ్యంగా.. ఏపీ, తెలంగాణ సరిహద్దు జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపితే గెలిచినా, ఓడినా రాజకీయంగా ఎంతోకొంత ప్రయోజనం ఉంటుందనేది కేసీఆర్ స్ట్రాటజీగా తెలుస్తోంది. పైగా.. సరిహద్దు జిల్లాలయితే రాష్ట్ర విభజన సెగ కాస్త తక్కువగా ఉంటుందని అధిష్టానం భావిస్తున్నట్లు బీఆర్‌ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే.. ఏఏ నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలపాలనే విషయమై బీఆర్‌ఎస్ అధిష్టానం కసరత్తు మొదలుపెట్టిందట. ఈ మేరకు ఏపీలోని కొన్ని జిల్లాల్లో బీఆర్‌ఎస్ ఒక సర్వే కూడా నిర్వహించిందని టాక్. ఏపీలోని ఇతర రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నయంగా బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఎంచుకునే అవకాశం ఉందా ?, బీఆర్‌ఎస్‌కు ఓటేసేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారా ? తెలంగాణలో కేసీఆర్ సంక్షేమ పథకాల పట్ల ఏపీ ప్రజలు సానుకూలంగా ఉన్నారా? వంటి ప్రశ్నలను ఆ సర్వే బృందం ప్రజలను అడిగారట. ఈ తరహా సర్వేలే గత నెల కర్ణాటక, మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ చేయించిందని తెలిసింది. కర్ణాటకలో 2023 ఏప్రిల్, మేలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో అక్కడ కూడా కొన్ని స్థానాల్లో పోటీ చేయాలని బీఆర్‌ఎస్ డిసైడ్ అయింది.
ఇక.. ఏపీలో బీఆర్‌ఎస్ పోటీ చేయాలని భావిస్తున్న జిల్లాల విషయానికొస్తే.. సరిహద్దు జిల్లాలే ప్రధానంగా కేసీఆర్ పార్టీ అభ్యర్థులను నిలపనుంది. గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కర్నూలు, కృష్ణ జిల్లాల్లో అభ్యర్థులను బరిలో నిలపాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కృష్ణా జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట స్థానాల్లో బీఆర్‌ఎస్ పోటీ చేయనున్నట్లు తెలిసింది. ఈ రెండు స్థానాల్లోనే ఎందుకంటే.. జగ్గయ్యపేట, నందిగామ ఈ రెండు నియోజకవర్గాలు తెలంగాణలోని కోదాడకు దగ్గరగా ఉంటాయి. నందిగామ, కోదాడ మధ్య దూరం ఇంచుమించు 45 కిలోమీటర్లు కాగా, జగ్గయ్యపేట, కోదాడ మధ్య దూరం కేవలం 23 కిలోమీటర్లు మాత్రమే కావడం గమనార్హం. ఈ రెండు స్థానాల్లో అయితే కోదాడకు రాకపోకల కారణంగా తెలంగాణతో సంబంధాలను కలిగి ఉంటారని, అందువల్ల రాష్ట్ర విభజనకు కారణం కేసీఆర్ అనే వ్యతిరేక భావన తక్కువగా ఉంటుందని బీఆర్‌ఎస్ భావిస్తోంది. గుంటూరు జిల్లాలోని మాచర్ల అసెంబ్లీకి కూడా పోటీ చేయాలని కేసీఆర్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. మాచర్ల కూడా నల్గొండ జిల్లాకు సమీపంలో ఉండే ప్రాంతం.
ఒకటి మాత్రం క్లియర్ ఏంటంటే.. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఏపీలోని కొన్ని స్థానాల్లో అయినా పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ గుంటూరు-2 నుంచి పోటీ చేయాలని, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబును బాపట్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి నిలపాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం. గుంటూరు, విశాఖపట్టణం లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని కూడా కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. ఉండవల్లి అరుణ్ కుమార్, కొణతాల రామకృష్ణ వంటి వారిని కూడా బీఆర్‌ఎస్‌లో చేర్చుకునే ప్రయత్నాలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా చూసుకుంటే.. రాజకీయంగా ఎంతో కొంత ప్రభావం చూపించడానికో లేక ఏదో ఒక పార్టీకి మేలు చేయడానికో, కీడుకో తెలియదు గానీ ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల్లో కొన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ ఫిక్స్ అయి ఆ దిశగా వడివడిగా అడుగులేస్తుందనే విషయం మాత్రం స్పష్టమైంది.