AP HighCourt: పయ్యావులకు భద్రత కల్పించాల్సిందే.. హైకోర్టు ఆదేశం
ABN, First Publish Date - 2023-02-22T13:39:45+05:30
ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు భద్రత కల్పించాల్సిందేనని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి: ఉరవకొండ ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ (Uravakonda MLA, Public Account Committee Chairman Payyavula Keshav)కు భద్రత కల్పించాల్సిందేనని హైకోర్టు (AP Highcourt)ఆదేశాలు జారీ చేసింది. భద్రతకు సంబంధించి పయ్యావుల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గతంలో విచారణ జరుగగా.. కేశవ్‌కు భద్రత (Security) కల్పించాల్సిన అంశానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని (AP Government) హైకోర్టు ఆదేశించింది. అయితే ఈరోజు జరుగుతున్న విచారణలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో జోక్యం చేసుకున్న హైకోర్టు.. ఉరవకొండలో పరిస్థితలు ఏంటో తెలుసని.. అటువంటప్పుడు కౌంటర్ ఎందుకు దాఖలు చేయాలేదని ప్రశ్నిస్తూ కేశవ్‌కు వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఐదు లేదా ఆరుగురు సెక్యూరిటీ సిబ్బంది పేర్లు ఇవ్వాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది. అందులో ఇద్దరిని సెక్యూరిటీగా నియమించేందుకు తగిన ఆదేశాలు ఇస్తామని న్యాయస్థానం తెలిపింది. అయితే పిటిషనరే పేర్లు ఇవ్వాలని హైకోర్టు సూచించడం పట్ల ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందు భద్రత కల్పించిన వ్యక్తులపై పిటిషనర్‌కు నమ్మకం ఉండాలి కదా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. కేశవ్‌కు తొలుత వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కల్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
కాగా... కేశవ్ (TDP Leader)కు ఎప్పటి నుంచో ఉన్న టూ ప్లస్ టూ భద్రత (Two plus two security)ను ఇటీవల ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ప్రభుత్వంపై కేశవ్ సహేతుకమైన ఆరోపణలు చేయడం... ముఖ్యంగా విద్యుత్ కొనుగోళ్లతో పాటు ఫోన్ టాపింగ్ (Phone Tapping)అంశాలపై ఆరోపణలు చేయడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని రేకెత్తించాయి. ఈ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం (AP Government) పయ్యావులకు సెక్యూరిటీని ఉపసంహకరించుకుంది అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నికలు వస్తున్న తరుణంలో నియోజవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం, మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని పయ్యావుల కేశవ్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో... పయ్యావులకు భద్రత కల్పించాల్సిందే అంటూ హైకోర్టు తేల్చిచెప్పింది. అదేవిధంగా టూ ప్లస్ టూ భద్రతపై విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది.
Updated Date - 2023-02-22T14:08:03+05:30 IST