Srinivasa Rao: రైతులకు జగన్ సాయం ప్రకటించాలి
ABN , First Publish Date - 2023-11-24T16:30:32+05:30 IST
రైతులతో పాటు కౌలు రైతులను ఆదుకునేలా సీఎం జగన్ ( CM Jagan ) సాయం ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ( Srinivasa Rao ) వ్యాఖ్యానించారు.
విజయవాడ: రైతులతో పాటు కౌలు రైతులను ఆదుకునేలా సీఎం జగన్ ( CM Jagan ) సాయం ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ( Srinivasa Rao ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘జగన్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. కులాంతర వివాహాలకు రక్షణ కల్పించడంతో పాటు, కళ్యాణమస్తు రూ.5 లక్షలకు పెంచాలి. దళిత, ఆదివాసీలకు రూ.75 వేల నుంచి 1.20 లక్షలు చేసినట్లు ప్రకటించడం యువతను తప్పుదారిపట్టించడమే. కరువులో చిక్కుకున్న రైతు, కూలీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఏపీలో సుమారు 300కు పైగా మండలాలల్లో తీవ్రమైన కరువు ఏర్పడింది’’ అని శ్రీనివాసరావు తెలిపారు.
పంటల నష్టాన్ని అంచనా వేయడంలో నిర్లక్ష్యం
‘‘వైసీపీ ప్రభుత్వం కేవలం 103 మండలాలను మాత్రమే కరువుగా ప్రకటించింది. వర్షాభావం వల్ల ప్రస్తుత ఖరీఫ్‌లో 85.97లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉండగా 60.22 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు వేశారు. కరువు పరిస్థితుల పట్ల సకాలంలో స్పందించి పంటల నష్టాన్ని అంచనా వేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి సొంత కడప జిల్లాలో 17మండలాలల్లో కరువు పరిస్థితులు ఉంటే ఒక్క మండలాన్ని కూడా ప్రకటించలేదు. ప్రకాశం జిల్లాలో 38 మండలాలకు గానూ 30 మండలాలు తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి, అయినా ఒక్క మండలాన్ని కూడా ప్రకటించలేదు’’ అని శ్రీనివాసరావు పేర్కొన్నారు.