సీఎం జగన్‌కు ఓటమి భయం
ABN , First Publish Date - 2023-01-05T00:33:11+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలకు భారీగా తరలివస్తున్న ప్రజలను చూసి, అలాగే లోకేష్ చేపట్టనున్న పాదయాత్రతో సీఎం జగన్‌కు భయం పట్టుకుందని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు.

చంద్రబాబు పర్యటనలకు ప్రజాదరణ
లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకే జీవో నెంబరు 1 జారీ
టీడీపీ నేతల ఆగ్రహం
కోవెలకుంట్ల, జనవరి 4: టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలకు భారీగా తరలివస్తున్న ప్రజలను చూసి, అలాగే లోకేష్ చేపట్టనున్న పాదయాత్రతో సీఎం జగన్‌కు భయం పట్టుకుందని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. బీసీ మాట్లాడుతూ జీవో నెంబర్ 1ను జారీ చేసి ప్రజాస్వామాన్ని ఖూనీ చేశారన్నారు. జీవో జారీ చేసిన రోజు సీఎం జగన్ రాజమండ్రిలో భారీ ర్యాలీ నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇటీవల నందివర్గం గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తే 26 మందిపై అక్రమ కేసులు పెట్టారన్నారు. కోవెలకుంట్ల సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు గువ్వల సుబ్బారెడ్డి, గువ్వల నాగేంద్రరెడ్డిపై పోలీసులతో తప్పుడు కేసులు పెట్టి భయభ్రాతులకు గురి చేయడం దారుణమన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు అమడాల మద్దిలేటి, మాజీ జడ్పీటీసీ బీవీ ప్రసాదరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ నాగేశ్వరరెడ్డి, రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, మల్లికార్జునరెడ్డి, శ్రీకాంత్, అభిరుచి మద్దిలేటి, ధనుంజయుడు, వల్లంపాడు ఉపసర్పంచ్ జగదీశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బనగానపల్లె: కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం అన్యాయమని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. బనగానపల్లెలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ టీడీపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దారుణమన్నారు.
నంద్యాల టౌన్: రాష్ట్రంలో వైసీపీ నిరంకుశత్వ పాలనకు జీవో నెంబర్-1 జారీ చేయడం నిదర్శనమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలోని ఖలీల్ థియెటర్ ఆవరణలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు నోరెత్తకూడదన్న ఉద్దేశ్యంతోనే జీవో నెంబర్ 1ని వైసీపీ ప్రభుత్వం జారీ చేసిందని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై మాట్లాడే గొంతులను అణగదొక్కాలని చూస్తే ప్రజలు తిరగబడడం ఖాయమని అన్నారు. చంద్రబాబు పర్యటనలకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక వైసీపీ కక్ష్యపూరిత విధానాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
డోన్: చంద్రబాబు సభలు, ర్యాలీలను అడ్డుకునే కుట్రతో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన చీకటి జీవోను వెంటనే రద్దు చేయాలని టీడీపీ డోన్ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని ధర్మవరం గ్రామంలో బుధవారం మల్లెలమ్మ జాతరకు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లా డుతూ చంద్రబాబుకు జనం నుంచి వస్తున్న ఆదరణను జీర్ణించుకోలేక వైసీపీ నేతలు కుట్రలకు తెర లేపారన్నారు. సభలు, ర్యాలీలు నిషేధిస్తూ వైసీపీ ప్రభుత్వం చీకటి జీవోను తీసుకురావడం చాలా దుర్మార్గమన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, మాజీ ఎంపీపీ ఆర్‌ఈ రాఘవేంద్ర, విజ యభట్టు, సీఎం శ్రీనివాసులు, గంధం శ్రీనివాసులు, శ్రీనివాసులు యాదవ్, ఎల్లనాగయ్య, వెంకటేశ్వరరెడ్డి, రాఘవరెడ్డి, షేక్షావలి చౌదరి పాల్గొన్నారు.
ఓర్వకల్లు : రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని జడ్పీ మాజీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ అన్నారు. బుధవారం మండలంలోని హుశేనాపురంలో చంద్రబాబు పర్టనను అడ్డుకోవడంపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందుకూరు, గుంటూరులో జరిగిన ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. చంద్రబాబుకు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేకనే చీకటి జీవో తెచ్చారని మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే.. ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సుధాకర్, రామగోవిందు, రాము,నాగరాజు, వేణు, బజారు పాల్గొన్నారు.
మంత్రాలయం: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ను అడ్డుకోవడం సిగ్గు చేటని తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, సాయి శ్రీనివాసరెడ్డిలు అన్నారు. బుధవారం రాత్రి మంత్రాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులతో వారు మాట్లాడారు. చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో పర్యటించినా పోలీసులు వాహనాలను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. సమావేశంలో టీడీపీ నాయకులు పన్నగ నాగశేన, అండే హనుమంతు, సుంకప్ప, ఎస్సీ సెల్ అధికారప్రతినిధి యేబు, నరసింహులు, నాగరాజు, సుధాకర్, పౌలు పాల్గొన్నారు.
ఎమ్మిగనూరు: కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను అడ్డుకోవటం హేయమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి సీఎం జగన్ ఓ నియంతలా వ్యవహరిస్తూ ప్రజలు, ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ తుగ్లక్ విధానాలు, వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబును అడుగడుగునా అడ్డుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు పర్యటనలకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తుండటంతో జీర్ణించుకోలేక జీవో 1ని తెచ్చారన్నారు. జగన్ తీరును ప్రజలు గమనిస్తున్నారని, నియంత పాలనకు ప్రజలే అంతిమ తీర్పు ఇస్తారని అన్నారు
ఆదోని: చంద్రబాబు నాయుడుకు వస్తున్న జనం చూసి జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అన్నారు. బుధవారం ఆయన స్వగృహంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ పాదయాత్ర ఎలాంటి ఆటంకాలు సృష్టించలేదని అన్నారు. చంద్రబాబు కుప్పం నియోజవర్గంలో తిరగడానికి కూడా పోలీసులు అనుమతి తీసుకోవాలా అని మండిపడ్డారు. రాత్రికి రాత్రి బ్రిటీష్ కాలం నాటి జీవోలను తెరపైకి తేవడాన్ని చూస్తుంటే జగన్‌కు ఇంటికి పోయే రోజులు దగ్గర పడ్డాయని అర్థమవుతోందని అన్నారు.