వాతలు, కోతలపై కన్నెర్ర
ABN , First Publish Date - 2023-05-24T01:48:21+05:30 IST
కరెంటు చార్జీల బాదుడు, అనధికార కోతలపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సబ్‌స్టేషన్ల వద్ద టీడీపీ శ్రేణుల ఆందోళనలు
పలుచోట్ల నిరసన ప్రదర్శనలు, ధర్నాలు
పభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజం
వెంటనే పెంచిన కరెంటు చార్జీలను తగ్గించాలని, కోతలను ఎత్తివేయాలని డిమాండ్
ఒంగోలు మే 23 (ఆంధ్రజ్యోతి) : కరెంటు చార్జీల బాదుడు, అనధికార కోతలపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా పలు మండల కేంద్రాల్లోని విద్యుత్ సబ్‌స్టేషన్ల ఎదుట నిరసనలు, ధర్నాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ చార్జీలు పెరుగుదల, అప్రకటిత కోతలను నిరసిస్తూ టీడీపీ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు మంగళవారం ఆందోళనలు నిర్వహించాయి. కనిగిరిలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట అక్కడ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నేతృత్వంలో పెద్దసంఖ్యలో కార్యకర్తలు ఆందోళన చేశారు. అంతకు ముందు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు కర్నూల్ రోడ్డులోని సబ్‌స్టేషన్ ఎదుట టీడీపీ నగర కమిటీ అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఎర్రగొండపాలెంలో సబ్‌స్టేషన్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో నియోజవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు, జడ్పీ మాజీ చైర్మన్ డాక్టర్ మన్నె రవీంద్ర పాల్గొన్నారు. అలాగే పుల్లలచెరువు, దోర్నాల, త్రిపురాంతకం, గిద్దలూరు, బేస్తవారపేట, కంభం, తాళ్లూరు, ముండ్లమూరు, పామూరు, వెలిగండ్ల, పీసీపల్లి, సీఎస్‌పురం, సింగరాయకొండ తదితర పలు మండలకేంద్రాల్లో సబ్‌స్టేషన్ల ఎదుట టీడీపీ మండల నాయకుల నేతృత్వంలో ధర్నాలు, ర్యాలీలు జరిగాయి. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక విద్యుత్ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టి రకరకాల పేర్లతో భారీగా చార్జీలు పెంచిందని, ప్రజలపై వేలకోట్ల భారాలను మోపిందని ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఆందోళనకు నాయకత్వం వహించిన టీడీపీ నాయకులు విమర్శించారు. మరోవైపు అనధికార విద్యుత్ కోతలు విధించి ప్రజలను ఇబ్బందులు పెడుతోందని ధ్వజమెత్తారు. తక్షణం పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని, అనధికార కోతలు ఎత్తి వేసి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.