AP Special Status : ప్రత్యేక హోదాపై రజత్ సైంధవ పాత్ర!
ABN, First Publish Date - 2023-08-29T03:21:04+05:30
ఔను... నిజం! నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా(special status) రాకుండా అడ్డు చక్రం వేసిన ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ(Rajat Bhargava)! ఒక్కసారి కాదు.. ఆయన ఐదుసార్లు ‘సహాయ నిరాకరణ’ చేశారు. సీమాంధ్ర నేతలు నాడు ఢిల్లీలో ఏం జరుగుతోందో తెలుసుకోలేదు.
రజత్ భార్గవ తీరు వల్లే దక్కని ‘హోదా’
ఒక్కసారి కాదు.. ఐదుసార్లూ డుమ్మా
2014లో హోదాకు కేంద్ర కేబినెట్ ఓకే
నోటిఫికేషన్ విడుదలకు సర్వం సిద్ధం
ప్రణాళికా సంఘం కమిటీలో రజత్
నాడు కేంద్ర ఆర్థిక శాఖలో కొలువు
ఐదు సమావేశాలకు ఆయన డుమ్మా
అనుకూలంగా సంతకం చేయని వైనం
తెలంగాణలో మెహర్బానీ కోసమే!?
ఒక భేటీకి కిందిస్థాయి అధికారి హాజరు
హోదాకు అడ్డుపుల్ల వేసేలా కొర్రీలు
రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొంది, తిరిగి వెనక్కి రాలేనంత దూరం వెళ్లిన తర్వాత ఏపీ నేతలు ‘సమైక్య రాష్ట్రం’ అంటూ సీమాంధ్ర భవిష్యత్తు గురించి మరిచిపోయారు. రాజకీయ నాయకులు ఎవరికివారు ‘రాబోయే ఎన్నికల’పై దృష్టి సారించారు.
అయినా సరే! రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు నాటి యూపీఏ సర్కారు సిద్ధమైంది. కానీ... తెలంగాణలో మెహర్బానీ కోసం ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ ప్రత్యేక హోదాకు సైంధవుడిలా అడ్డునిలిచారు. హోదా ప్రకటించే అధికార ప్రక్రియలో కీలకమైన సమావేశాలకు ఆయన ఐదుసార్లు డుమ్మా కొట్టారు.
ఏపీకి ప్రత్యేక హోదా ప్రతిపాదనకు నాడు కేంద్ర ఆర్థిక శాఖ ఓకే చెప్పింది. కేంద్ర కేబినెట్ కూడా ఆమోదించింది. అప్పటి ప్రణాళికా సంఘం దీనిపై నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేయాల్సి ఉంది. ఇందుకు ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. అప్పట్లో కేంద్ర ఆర్థిక శాఖలో బడ్జెట్ విభాగం జాయింట్ సెక్రటరీగా ఉన్న రజత్ భార్గవ కూడా ఈ కమిటీలో ఉన్నారు. ప్రత్యేక హోదాపై నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి ప్రణాళిక సంఘం ఐదు సమావేశాలు నిర్వహించింది. ఒక్క సమావేశానికి కూడా రజత్ హాజరు కాలేదు. ఒక సమావేశానికి ఆయన బదులుగా వచ్చిన డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారి హోదాకు అడ్డుపుల్ల వేశారు.
(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఔను... నిజం! నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా(special status) రాకుండా అడ్డు చక్రం వేసిన ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ(Rajat Bhargava)! ఒక్కసారి కాదు.. ఆయన ఐదుసార్లు ‘సహాయ నిరాకరణ’ చేశారు. సీమాంధ్ర నేతలు నాడు ఢిల్లీలో ఏం జరుగుతోందో తెలుసుకోలేదు. తెలుసుకోవాలనే ప్రయత్నమూ చేయలేదు. దీంతో... రజత్ భార్గవ కేవలం తన సొంత మెహర్బానీ కోసం ప్రత్యేక హోదాను ‘అధికారిక హోదా’తో అడ్డుకున్నారు. ఏపీకి హోదా ప్రకటించేందుకు ప్రణాళిక సంఘం నిర్వహించిన ఐదు సమావేశాలకూ ఆయన డుమ్మాకొట్టారు. సమావేశానికి రావాలని ఏపీ అధికారులు, ప్రణాళిక సంఘం ఎంత నచ్చచెప్పినా ఆయన పట్టించుకోలేదు. రజత్ భార్గవ స్వప్రయోజనం కోసమే ఇలా వ్యవహరించారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. రాష్ట్ర విభజన సమయంలో రోస్టర్ పాయింట్ల ప్రకారం ఆయనను తెలంగాణకు కేటాయించారు. తెలంగాణకు వెళ్తే ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్నది తానేనని చెప్పుకొని అక్కడ మెహర్బానీ పొందడం కోసమే ఇలా చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హోదాపై ఏం జరిగిందంటే..
2014లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నట్టు పార్లమెంటులో ప్రకటించారు. ఆ తర్వాత ఆ ఏడాది మార్చి మొదటి వారంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రతిపాదనను ఆమోదించారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి ఉంది. అప్పటి రాష్ట్ర ఆర్థిక శాఖ సెక్రటరీ పీవీ రమేశ్, రామకృష్ణారావు, అప్పటి సీఎస్ మొహంతితో కలిసి విభజన సమస్యల పరిష్కారంపై రాష్ట్ర స్థాయిలో కమిటీ వేశారు. వీరు ఛత్తీ్‌సగఢ్, జార్ఖండ్ గురించి అధ్యయనం చేశారు. ఈ రాష్ట్రాల విభజన సమయంలో సమస్యల పరిష్కారం కోసం ఏడాది సమయం ఇచ్చి, ఏడాది తర్వాత అపాయింటెడ్ డే (రాష్ట్ర విభజన అమలులోకి వచ్చే రోజు) ప్రకటించారు. అపాయింటెడ్ డే కంటే ముందు ఏడాది కాలంలో పరిష్కారమైన సమస్యలు తప్ప, అపాయింటెడ్ డే తర్వాత కొత్తగా ఏ సమస్యలూ పరిష్కారం కాలేదని తెలుసుకున్నారు. అపాయింటెడ్ డే ప్రకటించాక సమస్యలను ఎవరూ పట్టించుకోరు. అప్పటికే ఏపీ, తెలంగాణ అపాయింటెడ్ డేకు 82 రోజుల సమయం ఉంది. 2014 మే 16వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నట్టు ఈసీ ప్రకటించింది. కేంద్రంలో ప్రభుత్వం మారితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం చెల్లదు. దీంతో ప్రత్యేక హోదాపై నోటిఫికేషన్ జారీ చేయించుకోవాలని పీవీ రమేశ్ తాపత్రయపడ్డారు. అప్పటి ప్లానింగ్ కమిషన్ సెక్రటరీని కలిసి కేబినెట్ నిర్ణయం ఆధారంగా ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు.
ఐదు సమావేశాలకూ డుమ్మా
ప్రత్యేక హోదాకు నోటిఫికేషన్ విడుదల చేయడం కోసం ప్రణాళికా సంఘం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ప్లానింగ్ కమిషన్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, కేంద్ర ఆర్థిక శాఖలోని బడ్జెట్ విభాగం జాయింట్ సెక్రటరీ, హోం శాఖ జాయింట్ సెక్రటరీ ఉన్నారు. ఈ కమిటీ మొదటిసారి సమావేశం నిర్వహించింది. బడ్జెట్ విభాగం జాయింట్ సెక్రటరీ రజత్ భార్గవ ఆ సమావేశానికి రాలేదు. రెండో సమావేశానికి ఆర్థిక శాఖ నుంచి రజత్ భార్గవకు బదులుగా డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారి వచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయం ప్రస్తావనకు రాగానే... ఈ ప్రతిపాదనను తాము పరిశీలించాలని, ఏవి ఇవ్వగలమో, ఏవి ఇవ్వలేమో పరిశీలించాలని అడ్డుపుల్ల వేశారు. కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించిన తర్వాతనే ఏపీకి ప్రత్యేక హోదా ప్రతిపాదన కేంద్ర కేబినెట్ ముందుకొచ్చిందని, ఇప్పుడు కొత్తగా ఆర్థిక శాఖ పరిశీలించాల్సిన అవసరం ఏంటని ఆ సమావేశంలో పీవీ రమేశ్ వాదించారు. ఆ తర్వాత మరో రెండు సమావేశాలు జరిగాయి. వీటికి కూడా రజత్ భార్గవ హాజరు కాలేదు. 2014 మే 16న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయనగా.. ముందు రోజు అంటే మే 15వ తేదీన ఈ కమిటీ ఐదోసారి సమావేశమైంది. ఈ సమావేశానికి కూడా రజత్ భార్గవ రాకపోగా, వస్తున్నా అంటూ చివరి వరకు మిగిలిన సభ్యులను ఎదురు చూసేలా చేశారు. మే 16న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు వచ్చింది. ఆ తర్వాత హోదా హామీ నెరవేరలేదు. ప్రత్యేక హోదా పోయి, ప్రత్యేక ప్యాకేజీ వచ్చింది. ఆ ప్యాకేజీ కూడా రాష్ట్రానికి పూర్తిగా అందలేదు. చంద్రబాబు అఽధికారంలో ఉన్నప్పుడు అరకొరగానైనా వచ్చిన ప్యాకేజీ, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అసలే రాకుండా పోయింది. రజత్ భార్గవ ప్రస్తుతం ఏపీలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రెవెన్యూతో పాటు ఎక్సైజ్, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, టూరిజం, సాంస్కృతికం, మ్యూజియం, ఆర్కియాలజీ విభాగాలను కూడా నిర్వహిస్తున్నారు.
‘తెలంగాణ’ ఇలా...
విభజన సమయంలో కేంద్ర హోం శాఖలో ఉన్న రాజీవ్ శర్మ ఏపీ, తెలంగాణ మధ్య విభజన పరంగా ఉన్న కీలకాంశాలను హ్యాండిల్ చేశారు. తెలంగాణకు చెందిన అధికారులు రాజీవ్ శర్మ ద్వారా చట్టాలతో సహా తమకు అనుకూల నిర్ణయాలు తీసుకునేలా చేసుకోగలిగారు. దాని ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రాజీవ్ శర్మకు చీఫ్ సెక్రటరీ పదవి ఇచ్చారు. రిటైర్ అయిన తర్వాత ఆయన తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుగా కొనసాగుతున్నారు. తెలంగాణకు సంబంధించినంత వరకు అన్ని కమిటీల్లో రాజీవ్ శర్మ కీలకమైన వ్యక్తి. అందుకు అనుగుణంగా తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించారు. రాజీవ్ శర్మ పుణ్యమాని తెలంగాణ విభజన అంశాల్లో పైచేయి సాధించగా, రజత్ భార్గవ కారణంగా ఏపీకి అన్యాయం జరిగింది.
Updated Date - 2023-08-29T07:04:18+05:30 IST