టీడీపీ సంబరాలు
ABN , First Publish Date - 2023-11-21T03:32:09+05:30 IST
స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది.
బాణసంచా కాల్చి, స్వీట్లు పంచి హర్షం
ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో వేడుకలు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్) : స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటకలోనూ టీడీపీ నాయకులు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో పార్టీ నాయకులు సోమవారం బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు చినరాజప్ప, ఆనంద్‌బాబు, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, ఇతర నేతలు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లోనూ టీడీపీ నాయకులు స్వీట్లు పంచి, బాణసంచా కాల్చి, డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేశారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరైన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు స్థానిక బస్టాండ్‌లో ప్రయాణికులకు తిరుపతి వెంకన్న లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. విజయనగరం జిల్లాలోని విజయనగరం, నెల్లిమర్ల, బొబ్బిలి, చీపురుపల్లి, రాజాం, ఎస్.కోట, గజపతినగరం నియోజకవర్గాల్లో పార్టీ నేతల ఆధ్వర్యంలో బాణసంచా కాల్చారు. స్వీట్లు పంచిపెట్టి ఆనందాన్ని వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. శ్రీకాకుళంలో ఏడురోడ్ల జంక్షన్ వద్ద మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, నియోజకవర్గ కార్యకర్తలతో కలసి కేక్ కట్‌చేశారు. బెంగళూరులో నివసించే తెలుగుదేశం పార్టీ అభిమానులు, ప్రవాసాంధ్రులు సంబరాలు చేసుకున్నారు. యలహంకలో సోమవారం రాత్రి చేనేత కార్మిక సంఘం నాయకుడు చిన్నప్ప, ఏపీ ఖాదీ బోర్డు మాజీ డైరెక్టర్ పాపన్న ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు.