వైజాగ్ స్క్వేర్‌పై వ్యతిరేకత?
ABN , First Publish Date - 2023-08-06T01:15:51+05:30 IST
జీవీఎంసీ అధికారులు సిరిపురం కూడలిలో దత్ ఐలాండ్ వద్ద ఏర్పాటుచేసిన ‘వైజాగ్ స్క్వేర్’ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ అధికారులు నివేదిక పంపించినట్టు తెలిసింది.

రోడ్డు మధ్యలో ఆహ్లాదం ఏమిటంటున్న నగర వాసులు
ట్రాఫిక్ సమస్యతోపాటు భవిష్యత్తులో ప్రమాదాలకు ఆస్కారం ఉందని ఆందోళన
ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ అధికారుల నివేదిక
తాము వద్దని చెప్పినా జీవీఎంసీ అధికారులు
వినలేదని పోలీస్ అధికారులు వివరణ
విశాఖపట్నం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ అధికారులు సిరిపురం కూడలిలో దత్ ఐలాండ్ వద్ద ఏర్పాటుచేసిన ‘వైజాగ్ స్క్వేర్’ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ అధికారులు నివేదిక పంపించినట్టు తెలిసింది. రోడ్డు మధ్యలో ఆహ్లాదం కల్పించడం ఏమిటంటూ ప్రజలు నిలదీయడంతోపాటు ప్రమాదాలకు ఆస్కారం ఉందని ఆందోళన వ్యక్తంచేసినట్టు నివేదికలో పేర్కొనట్టు సమాచారం.
దత్ ఐలాండ్ వద్ద జీవీఎంసీ అధికారులు స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ‘వైజాగ్ స్క్వేర్’ పేరుతో ప్రజలకు ఆహ్లాదం కలిగించేందుకంటూ కొన్ని ఏర్పాట్లుచేశారు. రోడ్డుపై అందమైన రంగులు వేసి, ఆకర్షణీయంగా విద్యుత్ దీపాలు, సెల్ఫీ పాయింట్‌లను ఏర్పాటుచేశారు. అక్కడ ప్రజలు సేదతీరేందుకు వీలుగా ‘వేస్ట్ టు వండర్’ పేరుతో వ్యర్థాలతో తయారుచేసిన కుర్చీలు, టేబుళ్లను అందుబాటులో ఉంచారు. సాయంత్రం అటుగా వెళ్లే పాదచారులు, వాహన చోదకులు ‘వైజాగ్ స్క్వేర్’ను చూసి ఆసక్తిగా అక్కడ ఆగుతున్నారు. అయితే వారి వాహనాలను పార్కింగ్ చేసేందుకు చోటు లేకపోవడంతో రోడ్డుపైనే నిలిపివేస్తున్నారు. దీనివల్ల ఆ రోడ్డులో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పైగా టైకూన్ జంక్షన్ వద్ద పోలీసులు డివైడర్లతో రోడ్డును మూసేయడంతో వీఐపీ రోడ్డులో నుంచి వచ్చినవారంతా కమిషనర్ బంగ్లా వైపు వెళ్లాలంటే దత్‌ఐలాండ్ వద్దకు వచ్చి యూటర్న్ తీసుకుని వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య మరింత జఠిలంగా మారింది. దీనికితోడు సంపత్ వినాయగర్ ఆలయం వైపు నుంచి సిరిపురం వచ్చేవారు వాహనాలను వేగంగా నడిపితే దత్‌ఐలాండ్ వద్ద టర్నింగ్ తీసుకునే సమయంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ‘వైజాగ్ స్క్వేర్’ వైపు దూసుకువెళ్లే ప్రమాదం కూడా ఉంది. రెండు రోజుల కిందట అక్కడకు సమీపంలోనే టైకూన్ హోటల్ వద్ద ఒక అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతల వైపు రోడ్డులోకి దూసుకువెళ్లిపోయింది. ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. అలాంటి ఘటనే వైజాగ్ స్క్వేర్ వద్ద జరిగితే పరిస్థితి ఏమిటని నగరవాసులు నిలదీస్తున్నారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడం, పత్రికల్లో ప్రతికూల కథనాలు వస్తుండడంతో ఇంటెలిజెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో ఆరా తీసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ప్రజలంతా వైజాగ్‌స్క్వేర్ ఏర్పాటుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తంచేసినట్టు సమాచారం. ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత ట్రాఫిక్ పోలీస్ అధికారులను ‘వైజాగ్ స్క్వేర్’ పేరుతో రోడ్డు మధ్యలో ఆహ్లాదం ఏమిటని ప్రశ్నించగా, తాము కూడా వద్దని చెప్పామని...కానీ జీవీఎంసీ అధికారులు ప్రత్యేక ఆసక్తితో దీన్ని ఏర్పాటుచేశారని వివరించినట్టు తెలిసింది. దీంతో ఇంటెలిజెన్స్ అధికారులు శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్ అధికారులను కలిసి దీని గురించి వివరాలు రాబట్టినట్టు తెలిసింది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపించినట్టు పోలీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.