Dwaraka Tirumala : లడ్డూ ప్రసాదాల తయారీలో నిబంధనలకు తూట్లు
ABN , First Publish Date - 2023-09-27T11:22:30+05:30 IST
ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలలో కాంట్రాక్టర్లకు మేలుచేసే పనిలో ఆలయ అధికారుల తీరు పలు విమర్శలకు దారితీస్తోంది. లడ్డూ ప్రసాదాల తయారీలో నిబంధనలకు తూట్లు పొడవడం జరిగింది.
ఏలూరు : ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలలో కాంట్రాక్టర్లకు మేలుచేసే పనిలో ఆలయ అధికారుల తీరు పలు విమర్శలకు దారితీస్తోంది. లడ్డూ ప్రసాదాల తయారీలో నిబంధనలకు తూట్లు పొడవడం జరిగింది. ప్రసాదాల తయారీలో కాంట్రాక్టర్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్న అవేమీ వారికీ తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నారు. లడ్డూల తయారీకి స్వామి సేవకు వచ్చిన వారిని కాంట్రాక్టర్ ఉపయోగిస్తున్నారు. గతంలో కూడా ఇదే విధంగా జీఎస్టీ రూపంలో అదనంగా కాంట్రాక్టు దారుడికి రూ.12 లక్షలు చెల్లించి విమర్శలు పాలయ్యారు. చేతికి హ్యాండ్ గ్లౌజులు, తలకి క్లాత్ టోపీ లేకుండా లడ్డూలు తయారు చేస్తున్నారు. సిబ్బందిని పక్కనపెట్టి సేవకులతో లడ్డూల తయారు చేస్తున్నారు. లడ్డూ తయారీకి సిబ్బందికి జీతాల రూపంలో ప్రతి నెలా దేవస్థానం లక్షలు చెల్లిస్తోంది.
ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలో ప్రతిరోజు స్వామి దర్శనానికి వచ్చిన భక్తుల కోసం లడ్డూలు తయారు చేస్తారు. ఆ లడ్డూల తయారీ, కౌంటర్ల వద్దకు సప్లై బాధ్యత అంతా కాంట్రాక్టరే చూసుకోవాలి. కానీ ఇక్కడ లడ్డూల తయారీలో కాంట్రాక్టర్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. స్వామివారి సేవకు వచ్చిన భక్తులను లడ్డూల ప్యాకింగ్‌లో వినియోగించుచున్నారు. అయితే లడ్డూలు తయారీ, ప్యాకింగ్ చేసే సమయంలోను శుచి, శుభ్రత పాటించాలి. ఈ అన్ని నియమాలు టెండర్ నిబంధనలో ఉన్నాయి. కానీ తయారీలో సిబ్బంది ఇవేమీ పాటించడం లేదు. అలాగే లడ్డు ప్యాకింగ్ సేవ కోసం వచ్చిన భక్తులను వినియోగిస్తూ వారి చేతులకు గ్లౌజులు కానీ, నోటికి మాస్కులు, తలకి క్లాత్ టోపీలు లేకుండానే ప్యాకింగ్ చేస్తున్నారు.
అయితే ప్రసాదాల తయారీ విషయంలో సిబ్బంది వినియోగానికి సంబంధించి కాంట్రాక్టర్‌కు ప్రతి నెల దేవస్థానం లక్షల రూపాయలు కాంట్రాక్టు రూపంలో చెల్లిస్తుంది. అయితే కాంట్రాక్టర్ దర్జాగా స్వామి సేవకు వచ్చిన భక్తులతో ప్రసాదాలు ప్యాకింగ్ చేయించి సగం మంది సిబ్బందితోనే ప్రసాదాలు తయారు చేయించి అదనపు లబ్ధి పొందుతున్నాడు. ఇంత జరుగుతున్న అక్కడే ఉండి ప్రసాదాల తయారీ పర్యవేక్షిస్తున్న ఆలయ అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. ఇప్పటికే దేవస్థానంలో ఎన్నో స్కాములు వెలుగు చూశాయి. స్కాములకు అలవాటు పడిపోయినట్టున్నారో ఏమో తెలియదు కానీ వారి ప్రవర్తన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.