చిత్తనూరును ఇథనాల్ కమ్మేస్తున్నది!
ABN , First Publish Date - 2023-10-18T03:52:48+05:30 IST
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఒక గ్రామం పోలేపల్లి. 2002లో అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపిఐఐసి) ఒక మెగా గ్రీన్ పార్కును ఏర్పాటు చేసింది...
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఒక గ్రామం పోలేపల్లి. 2002లో అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపిఐఐసి) ఒక మెగా గ్రీన్ పార్కును ఏర్పాటు చేసింది. నాటి ప్రభుత్వం 2004లో ఆ గ్రీన్ పార్కును ఫార్మాసెజ్‌గా మార్చడానికి నిర్ణయం తీసుకుంది. దాంతో పోలేపల్లి, గుండ్లగడ్డ తండా, ముదిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన 364 కుటుంబాల 309.15 ఎకరాల అసైన్డ్ భూమి, 645.07 ఎకరాల పట్టాభూమి మొత్తం 954.22 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్ ఫార్మా కంపెనీలకు అప్పజెప్పింది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడు పోలేపల్లి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను గమనిస్తే వ్యవసాయం పూర్తిగా దెబ్బతిన్నది. భూగర్భ జలాలు కలుషితమయ్యి సాగునీరు, తాగునీటికి పనికిరాకుండా పోయాయి. స్థానికులకు ఉద్యోగాలు అసలే రాలేదు. సుమారు 15 గ్రామాలు కాలుష్య కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి.
నేడు ఇదే పరిస్థితి ముంగిట మరో గ్రామం నిలిచి ఉన్నది. చిత్తనూరు నారాయణపేట జిల్లా, మరికల్ మండలంలో ఒక గ్రామం. ఇక్కడ ప్రస్తుతం ఏర్పాటు చేసిన జూరాల ఆర్గానిక్ ఫార్మ్స్, ఆగ్రో ఇండస్ట్రీస్ అనే ఇథనాల్ కంపెనీ యజమాని కూడా హెటిరో డ్రగ్స్ ఫార్మా కంపెనీ యజమాని బండి పార్థసారథి రెడ్డి కావడం యాదృచ్ఛికమేమీ కాదు. ఈయన అధికార బీఆర్‌ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ కంపెనీ మరొక భాగస్వామి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కెఎల్ఆర్) ప్రస్తుతం అధికారం కోసం ఆరాటపడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఈ ఇద్దరు ప్రజాప్రతినిధులు ఈ విధంగా ఇథనాల్ కంపెనీ యజమానుల అవతారం ఎత్తారు అనుకుంటే మనం పొరబడినట్లే. బడా పెట్టుబడిదారులు నేడు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల అవతారమెత్తుతున్నారు అనడానికి చిత్తనూరు ఇథనాల్ కంపెనీ యజమానులే నిదర్శనం.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పరిస్థితి ఈవిధంగా ఉంటే బీజేపీ పరిస్థితి అయినా అందుకు భిన్నంగా ఉందా అంటే అదీలేదు. బీజేపీ ఇథనాల్ కంపెనీలను ఇబ్బడి ముబ్బడిగా నెలకొల్పాలని ఆ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇ–20 పేరుతో ఇథనాల్ పాలసీని రూపొందించారు. అంతేకాదు ఇథనాల్ పరిశ్రమలు స్థాపించడానికి ముందు సేకరించవలసిన ప్రజాభిప్రాయంతో పని లేకుండా పర్యావరణ ప్రభావ అంచనా చట్టం – 2006కు 16 జూన్ 2021న చట్ట సవరణ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు హానికారక పరిశ్రమలను నిలువరించే ఆ మాత్రం అవకాశాలను, హక్కులను బీజేపీ ప్రభుత్వం ఈ విధంగా కాలరాసింది.
ఇంతకు ఇథనాల్ వల్ల ఏమిటి నష్టం అని ఎవరైనా అనుకోవచ్చు. ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడానికి వాడే ముడి సరుకులన్నీ ప్రజలు ఆహారం కోసం వినియోగించే బియ్యం, మొక్కజొన్న, చెరుకు తదితర ఆహార ధాన్యాలు కావడమే కాదు, ఆహార పంటల ఉత్పత్తికి ప్రధాన వనరుగా ఉపయోగిస్తున్న సాగు నీరును కూడా వినియోగిస్తారు. ఆ రకంగా చిత్తనూరు ఇథనాల్ కంపెనీ రోజుకు 18 లక్షల కేజీల బియ్యం, 30 లక్షల లీటర్ల నీటిని వినియోగించుకుని 6 లక్షల లీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే ఆ కంపెనీ నుండి 42 లక్షల కేజీల వ్యర్థ పదార్థాలు ఘన, ద్రవ, వాయు రూపంలో బయటకు వస్తాయి. అవన్నీ తప్పకుండగా కంపెనీ కిందనే ఉన్న మన్యవాగులోకి వదిలి వేస్తారనేది జగమెరిగిన సత్యం. కార్బన్‌డయాక్సైడ్ తదితర వాయువులను వాతావరణంలోకి వదులుతారు. ఇథనాల్ కంపెనీ యజమానులు కేంద్ర పర్యావరణ అటవీ శాఖకు పర్యావరణ అనుమతుల (ఈసీ) కోసం పెట్టిన దరఖాస్తులో మేము ఎటువంటి వ్యర్థ పదార్థాలను బయటకి వెదజల్లమని (జీరో లిక్విడ్ డిశ్చార్జ్) పేర్కొన్నారు. ప్రస్తుతం చిత్తనూరు ఇథనాల్ కంపెనీ నిర్మాణం పూర్తయి ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న దశలో ఈ మధ్యనే సెప్టెంబర్ నెలలో ట్రయల్ రన్ చేశారు. ఆ సందర్భంగా మన్యవాగులోకి పెద్ద ఎత్తున వదిలిన విషరసాయన పదార్థాల వల్ల నీళ్లు రంగు మారిపోవడమే కాదు, చేపలు చనిపోయాయి. జింకలు, కుక్కలు తదితర వన్య ప్రాణులు చనిపోయాయి. అంతేకాదు ఆ కంపెనీ వాతావరణంలోకి వదిలిన విషవాయువుల వల్ల విపరీతమైన దుర్వాసన వెల్లువెత్తడంతో చిత్తనూరు, జిన్నారం ప్రజలు ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరిబిక్కిరయ్యారు. చిన్నపిల్లలు, ముసలివాళ్లు అనారోగ్యం పాలయ్యారు. సాగునీరు, తాగునీరు కోసం ఉపయోగిస్తున్న నీటి పంపుల నుంచి రంగు మారిన నీళ్లు వస్తున్నాయని అంటున్నారు. ఈ కలుషితాలన్నీ మన్యవాగు నుండి ఊకచెట్టి వాగులోకి వెళ్లి కలువడం ద్వారా సీతారాంపేట, దమగ్నాపురం, నెల్లికొండి, వడ్డేమాన్, చిన్న చింతకుంట, దుప్పల్లి, గూడూరు, అల్లిపూర్ తదితర గ్రామాల ప్రజలు వినియోగించే తాగు నీటి పంపుల నుంచి కూడా రంగు నీళ్ళు వస్తున్నట్లు గుర్తించారు. వారి పరిసరాల్లో ఉన్న ఊకచెట్టు వాగులో చేపలన్నీ చనిపోయి దుర్వాసన వెదజల్లుతున్న విషయాన్ని గమనించి చాలా ఆందోళన వ్యక్తం చేశారు.
ఒక సంవత్సర కాలంగా చిత్తనూరు ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ నేడు జరుగుతున్న పరిణామాలను ముందే సదస్సులు, సమావేశాలు నిర్వహించి బాబూరావ్ లాంటి శాస్త్రవేత్తల ద్వారా చెప్పించింది. అటువంటి కాలుష్య కారక ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని అనేక పోరాట కార్యక్రమాలను తీసుకున్నది. మక్తల్, నారాయణపేట, దేవరకద్ర నియోజకవర్గాలలోని ఊకచెట్టి వాగు, రామన్ పాడ్ డ్యాం పరిసరాలలోని 54 గ్రామాల గుండా ఫిబ్రవరి 2023లో 11 రోజుల పాటు పాదయాత్ర చేపట్టింది. మరికల్, నర్వ, చిన్నచింతకుంట, ధన్వాడ, ఆత్మకూర్, మక్తల్ మండలాలలో ధర్నాలు చేసింది. హైదరాబాదులో సైతం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి ఇథనాల్ సమస్య తీవ్రతను సభ్య సమాజం దృష్టికి తీసుకువచ్చింది. అంతేకాకుండా జూలై 1, 2023 నుంచి కంపెనీ ఎదురుగా ఏక్లాస్పూర్ గేటు దగ్గర నిరవధిక రిలే ధర్నాలను ప్రారంభించింది. ఆ ధర్నాలు ప్రారంభించబడి 100 రోజులు పూర్తయ్యాయి. అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత గ్రామాల గోడు పట్టించుకోవడంలేదు. ప్రతిపక్ష పార్టీలు సైతం ఇథనాల్ సమస్యపై నోరు మెదపడం లేదు.
చిత్తనూరు మరో పోలేపల్లిగా మారుతుందా, లేక కాపాడుకుంటారా అనే ప్రశ్నలకు బాధిత గ్రామాల ప్రజలే సమాధానాలు వెతకాలి. ఇప్పటికైనా బాధిత ప్రజలు మేల్కొని కంపెనీ యజమానుల అడుగులకు మడుగులొత్తుతున్న పాలకవర్గ పార్టీల అసలు రంగును ప్రశ్నించడమే కాదు, వారి ఆధీనం నుంచి, పాలక పార్టీల భావజాలం నుంచి బయట పడాలి. అంతేకాకుండా తమ తమ గ్రామాలలో ఉన్న సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలపై ఒత్తిడి చేసి ఈ కంపెనీ మాకొద్దని, దానిని రద్దు చేయాలని గ్రామ సభలలో తీర్మానాలు చేయించాలి. రాబోయే ఎన్నికలలో ఇథనాల్ కంపెనీని రద్దు చేస్తామన్న వారికే ఓటు వేస్తాం తప్ప వేరే వారికి వెయ్యం అనే చైతన్యాన్ని కూడా ప్రదర్శించినపుడే చిత్తనూరు మరో పోలేపల్లిగా మారకుండా కాపాడుకునే అవకాశం ఉంది.
బండారి లక్ష్మయ్య
చిత్తనూరు ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ