మిగిలిపోయిన వర్ణం
ABN , First Publish Date - 2023-10-27T00:59:54+05:30 IST
మాటలన్నీ ఖాళీ అయ్యాక ప్రదర్శనకు మిగిలున్న మట్టిబొమ్మలా నేను ఒక యుద్ధచిత్రాన్ని గీయడానికి సిద్ధమయ్యాను...
మాటలన్నీ ఖాళీ అయ్యాక
ప్రదర్శనకు మిగిలున్న మట్టిబొమ్మలా
నేను ఒక యుద్ధచిత్రాన్ని గీయడానికి సిద్ధమయ్యాను
బూడిదైన పూలవనంలో
ఒంటరిగా మిగిలిపోయిన ఓ సీతాకోకచిలుకలా
శిథిలాల మధ్య శిలా విగ్రహంలా ఓ చిన్నారి
సమాధానాలు దొరకని సంఘర్షణల మధ్య తానో ప్రశ్నై
తన అస్తిత్వానికి ఆరడుగులు జాడేదని సమాధానమడుగుతుంది
ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య తన నిశ్శబ్దం
ముందు తరాల జాబితాలో తానెక్కడని ప్రపంచాన్ని ప్రశ్నిస్తుంది
ప్రపంచమా..
కన్నీళ్లు రాని దుఃఖం భారమెంతో తెలిస్తే చెప్పు
కాన్వాస్ సైజు పెంచుతాను
మనుషులంతా వేరుపడ్డారు కదా
తన గాయాల రక్తానికి రంగేదో చెప్పండి
బ్రతుకు చిత్రాన్ని చెరిపేయటమే చరిత్ర అనుకుంటున్నారు కదా
జీవితం మీద బూడిద చల్లిన సిద్ధాంతం ఏమిటో గుట్టు విప్పండి.
నవ్వుల్ని శిథిలపరిచి, అమ్మలను సమాధి చేశారు కదా
ఏడుపు ఆపే ఆకలి సూత్రం ఏమిటో సెలవివ్వండి
మసకబారిన ముఖచిత్రాలు, పొగచూరిన బతుకు చిత్రాలలో రంగులన్నీ వెలసిపోయి
నలుపు మాత్రమే మిగిలుంది
అయినా ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది
ప్రపంచాన్ని నమ్మడానికి కారణాలు అడుగుతూ
ఉనికి మీద దెబ్బ కొట్టిన చరిత్ర రహస్యం ఏమిటో చెప్పమంటూ
తప్పిపోయిన తన అమ్మానాన్నలను వెతుక్కుంటూ తాను వెళ్ళిపోయింది
యుద్ధమా...
ఇతిహాస ఇతివృత్తాలను వల్లెవేసే ప్రపంచానికి
శాంతి గీతం పాడేదెలాగో ఎవరూ నేర్పలేదా?
నువ్వు ముగిసాక మిగిలే విషాదం గురించి ప్రపంచానికి ఎవరూ వివరించలేదా?
చివరగా ఒకటి చెప్పు
అసలు నీ రంగేమిటి? నువ్వు ఎవరి తాలూకా?
పి.సుష్మ