Education : చదువులో ఆఖరునుంచి ఆరోస్థానం!

ABN , First Publish Date - 2023-08-05T03:18:40+05:30 IST

ప్రభుత్వం విడుదల చేసిన 2021–22 పాఠశాలల పనితీరు గ్రేడింగ్ ప్రకారం–ఆరు కొలమానాల ఆధారంగా– దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో– వెయ్యి పాయింట్లకుగాను

Education : చదువులో ఆఖరునుంచి ఆరోస్థానం!

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2021–22 పాఠశాలల పనితీరు గ్రేడింగ్ ప్రకారం–ఆరు కొలమానాల ఆధారంగా– దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో– వెయ్యి పాయింట్లకుగాను 479.9 పాయింట్లతో తెలంగాణ 31వ స్థానంలో నిలిచింది. అంటే కింది నుంచి ఆరవ స్థానంలో. జిల్లాల వారీగా చూస్తే దేశంలో ఉన్న 738 జిల్లాలలో – తెలంగాణలో ఉన్న 33 జిల్లాలకు 16 జిల్లాలు 500వ స్థానం నుంచి 600 స్థానంలోను, 11 జిల్లాలు 400వ స్థానంలోను, 3 జిల్లాలు 300వ స్థానంలోను, 3 జిల్లాలు 200వ స్థానంలోను నిలిచాయి. సరాసరి చూస్తే మన 33 జిల్లాలు 485వ స్థానంలో ఉన్నట్టు. అంటే దేశంలోని 748 జిల్లాలలో 484 జిల్లాలు మనకన్నా ముందున్నాయి.

రాష్ట్ర తలసరి ఆదాయం మూడు లక్షల రూపాయలకు పైనే ఉన్నా, హైటెక్ సిటీ హంగులు, ఐటీ హబ్బులు, ప్లై ఓవర్లు, నూతన సెక్రటేరియట్, రీజనల్ రింగురోడ్డు, మెట్రో రైళ్లు... వంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా, రాబోయే తరాలకు నాణ్యమైన విద్యను అందించకపోతే రాష్ట్ర పౌరులు గౌరవప్రదమైన జీవనం కొనసాగించలేరు. నాణ్యమైన విద్యే ప్రజల ఆర్థిక పరిపుష్టికి అతిముఖ్యమైన సాధనం. అది అందనప్పుడు ఆ ప్రభావం పడేది విద్యార్థుల మీద మాత్రమే కాదు. ఇది దీర్ఘకాలిక సామాజిక సమస్యలకు దారితీస్తుంది. ఆ వెనుకబాటుతనం తరాలపాటు కొనసాగుతుంది. ఉపాధ్యాయ – విద్యార్థి నిష్పత్తి లేకపోవటం, సరైన వసతులు లేకపోవటం, ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు లేకపోవటం వంటివనేకం నాణ్యమైన విద్య అందకపోవడానికి బలమైన కారణాలుగా ముందుకు వస్తాయి. కానీ ఇవన్నీ ఉన్న పాఠశాల్లో కూడా అభ్యసన ఫలితాలలో పెద్ద తేడా లేదనేది నివేదికల ద్వారా తెలుస్తున్న నిజం. ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్య లేదన్న కారణంగా బోలెడు ఫీజులు భరిస్తూ ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థుల సామర్థ్యాల్లో కూడా పెద్దగా తేడా ఏమీ లేదు. అందువల్ల, సమస్యను ఒక ‘విద్యా సంక్షోభం’గా గుర్తించినప్పుడే పరిష్కారం దొరుకుతుంది.


బడులకు బెంచీలు ఇవ్వడం, సున్నాలు వేయడం, మూత్రశాలలు, ప్రహరీ గోడలు కట్టడం, భోజనం ఏర్పాటు చేయడం, పుస్తకాలు ఉచితంగా పంచడం... ఇవన్నీ అవసరమే. కానీ ఇవి చాలావరకు తలిదండ్రులను సంతోషపెట్టి, కాంట్రాక్టర్లకు లాభాలు చేకూర్చి, స్థానిక నాయకులు ప్రారంభోత్సవాల హడావిడితో వేదికల మీద గొప్పలు చెప్పుకోవడానికే పనికి వస్తున్నాయి. నాణ్యమైన విద్య అందించకపోతే వీటన్నిటి మీద పెట్టిన ఖర్చు అంతా బూడిదలో పోసిన పన్నీరే. అసలే అరకొరగా ఉన్న ఉపాధ్యాయులకు విధులను సక్రమంగా నిర్వహించనివ్వకుండా అనేక బోధనేతర పనులను అప్పజెప్పటం కూడా పిల్లలలో బోధనా సామర్థ్యాలు తగ్గటానికి ముఖ్య కారణం.

ప్రతిసారి విద్యా సంవత్సరం ఆరంభంలో నాణ్యమైన విద్యను అందించేందుకు రకరకాల ఆకర్షణీయమైన పేర్లతో విధానాలు తెస్తున్నారు. ఈ విధానాల రూపకల్పనలో ఉపాధ్యాయుల అనుభవాలను, క్షేత్ర స్థాయిలో వారి సమస్యలను పరిగణనలోకి తీసుకోరని, అసలు వారిని సంప్రదించరని వింటూనే ఉంటాం. పై నుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి అమలు చేయవలసిందే అంటూ ఉపాధ్యాయులపై బలవంతంగా ఈ విధానాలను రుద్దుతారన్న వాదనలు కూడా ఉన్నాయి. కాస్తో కూస్తో చొరవ తీసుకోవాలనుకున్న ఉపాధ్యాయులు సైతం ఇలాంటి వాతావరణం మధ్య ఉత్సాహం చూపించకుండా ఉండిపోయిన సందర్భాలు అనేకం. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యను అందించడానికి తమ పాఠశాల స్థాయిలో తగిన ఆలోచనలను వారే చేసుకొని, తమ ప్రణాళికలను తామే రూపొందించుకునే ప్రక్రియ లేకపోవడం కూడా ఒక అవరోధమే.


ఉపాధ్యాయుల నుంచి జవాబుదారీతనం కోరుకొనేటప్పుడు అందుకు తగినట్టుగా వారికి మద్దతును కూడా అందివ్వకపోతే పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెరగవు. ఉపాధ్యాయులకు కావలసిన సామగ్రిని అందివ్వాలి. పాఠశాల స్థాయిలో ప్రతి విద్యార్థికి సంబంధించి ప్రణాళికలు రచించే వెసులుబాటు ఇవ్వాలి. క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి విద్యాశాఖ అధికారులు వారికి మద్దతుగా నిలవాలి. పర్యవేక్షణ పేరుతో ఉన్నత అధికారులు బెదిరింపులతో వ్యవస్థను నడిపించాలీ అనుకుంటే అదిసాధ్యపడే పని కాదని గమనించాలి. జవాబుదారీతనాన్ని మాత్రం ఉపాధ్యాయుల మీద నెట్టి తగిన మద్దతును ఇవ్వకుంటే ఫలితాలు ఉండవు. అధికారులు ఏమి ఆశిస్తున్నారో అలాంటి నివేదికలు ఇచ్చి ఊరుకుంటారు ఉపాధ్యాయులు. అందుకే విద్యా లక్ష్యాలు నెరవేరడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లోంచి బయటపడి విద్యాభివృద్ధిలో ముందంజ వేయాలంటే ఇప్పుడు రాష్ట్రం ఒక విద్యా సంక్షోభంలో ఉన్నదన్న వాస్తవాన్ని ముందుగా ప్రభుత్వం గుర్తించాలి. ఇది కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయి ఉన్న సమస్య. తాత్కాలిక చర్యలతో ఫలితాలు రావు. ఒక విద్యా ఉద్యమ కార్యాచరణకు పూనుకోవాల్సిన తరుణమిది! రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రజాప్రతినిధులంతా సంక్షోభంలో ఉన్న విద్యా వ్యవస్థ రక్షణకు కదలాలి. చదువులపరంగా దేశంలో దాదాపు చివరి వరుసలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరసలో నిలపడానికి సమిష్టిగా కృషి చేయాలి.

ఉపాధ్యాయుల నుంచి జవాబుదారీతనం కోరుకొనేటప్పుడు అందుకు తగినట్టుగా వారికి మద్దతును కూడా అందివ్వకపోతే పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెరగవు. క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి విద్యాశాఖ అధికారులు వారికి మద్దతుగా నిలవాలి.

ఆర్. వెంకట రెడ్డి

ఎం.వి. ఫౌండేషన్ జాతీయ కన్వీనర్

Updated Date - 2023-08-05T03:29:07+05:30 IST