అర్ధ సత్యాల అరసం
ABN , First Publish Date - 2023-10-19T01:02:39+05:30 IST
‘ప్రశ్నించే ప్రజల గొంతుక అరసం’ శీర్షికతో ఆ సంస్థ కార్యదర్శి వేల్పుల నారాయణ సెప్టెంబరు 30న రాసిన వ్యాసంలో హైదరాబాద్ దక్కను రాజ్య చరిత్ర నేపథ్యంగా అవాస్తవ అంశాలు...
‘ప్రశ్నించే ప్రజల గొంతుక అరసం’ శీర్షికతో ఆ సంస్థ కార్యదర్శి వేల్పుల నారాయణ సెప్టెంబరు 30న రాసిన వ్యాసంలో హైదరాబాద్ దక్కను రాజ్య చరిత్ర నేపథ్యంగా అవాస్తవ అంశాలు రాశారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాదు నిజాం గురించి వ్యాసంలో చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసన తెలుపుతున్నాం.
1948 ముందు జరిగిన ప్రతి సంఘటననూ నిజాంతో ముడిపెట్టి బద్నామ్ చేయడం ఇలాంటి సంస్థలకు అలవాటుగా మారింది. ఆళ్వారుస్వామి ఏదో సంస్థ పెట్టబోతే అనుమతి ఇవ్వలేదు అనేది సత్య దూరం. ఆ సమయంలోనే దక్కను భూభాగంపై ఎన్నో పౌర సమాజ సంస్థలు ఉనికిలోకి వచ్చాయి. వాటిని అప్పటి ప్రభుత్వం అణచివేసింది అనే దుష్ప్రచారాన్ని కొన్ని అభ్యుదయ, ప్రగతిశీల ముసుగులు వేసుకున్న సంఘాలు చేస్తూ వస్తున్నాయి. అవి అసత్యాలైనప్పటికీ పదే పదే రాస్తున్నారు. నాడు అరసం హైదరాబాద్ దక్కను శాఖ దాదాపు ఉనికిలోనే ఉంది. 1944–46 మధ్య అడవి బాపిరాజు హైదరాబాద్ బ్రాంచీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. వట్టికోట అరసం కేంద్ర కార్యవర్గంలో ఉన్నాడు. భాగ్యరెడ్డి వర్మ నేతృత్వంలో ఆది హిందూ లీగ్ లాంటి సంస్థలు ఒకవైపు ప్రగతిశీల కార్యకలాపాలు చేస్తూనే దళితుల అభ్యున్నతికి, కుల నిర్మూలనకు కృషి చేశాయి. నిజాం ప్రభుత్వాన్ని ఒప్పించి తొలిసారి బల్దియాలో దళితులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇప్పించిన ఉదాహరణ కూడా ఉంది. అంతేకాదు బహుళ భాషల, సంస్కృతుల జీవన సమ్మేళనంగా దక్కనులో ఇతర భాషల ప్రజలు కూడా సంస్థలను స్థాపించారు. ఇక ‘తరతరాల బూజు నైజాం రాజు’ అనే రాత దాశరథి కృష్ణమాచార్యులు 1949లో రాసినది. అప్పటికి నిజాం ప్రభుత్వం లేదు. వాస్తవానికి నైజాం ప్రభుత్వ వ్యతిరేక పోరాటం దాశరథి సోదరులు కూడా ఏనాడూ చెప్పుకోలేదు. అది ఆ తరువాత ప్రచారంలోకి వచ్చిన అంశం. 1920 నుంచే దక్కను ప్రాంతానికి ఇతర తెలుగు ప్రాంతాల నుంచే కాక, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచీ ప్రజలు శాశ్వత స్థిర నివాసం కోసం వలస వచ్చేవారు. ఇతర దేశాల నుంచీ వచ్చిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నిజాం ప్రభుత్వం నిరంకుశమైనది ఐతే స్థిర నివాసం కోసం వలస ఎందుకు వస్తారు? ఉదాహరణకు హైదరాబాద్ బంగ్లా సమితి 1920ల్లోనే ఏర్పాటు అయిన ఒక భాషా, ప్రగతిశీల సంస్థ. ఇలాంటి సంస్థలు ఎన్నో ఉనికిలో ఉన్నాయి. అరసం లాంటి సంస్థల ప్రతినిధులు ప్రచారంలోనే ఉన్న అంశాలనే రాయకుండా, పునః పరిశీలన చేసుకుని రాయాలని కోరుతున్నాం.
ఎస్. రామ్, ఎన్. అజయ్
హైదరాబాద్ డెక్కన్ ఇండిపెండెంట్ రీసెర్చెర్స్ గ్రూప్