ఓటరు చైతన్యమే ఆఖరు అవకాశం!

ABN , First Publish Date - 2023-08-30T04:16:18+05:30 IST

తక్కిన రాష్ట్రాలన్నింటి కంటే నేటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పూర్తి భిన్నమైనది. ఏకపక్ష రాష్ట్ర విభజనతో రాష్ట్ర ఆదాయ వనరైన ఉమ్మడి రాజధానిని కోల్పోయాం...

ఓటరు చైతన్యమే ఆఖరు అవకాశం!

తక్కిన రాష్ట్రాలన్నింటి కంటే నేటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పూర్తి భిన్నమైనది. ఏకపక్ష రాష్ట్ర విభజనతో రాష్ట్ర ఆదాయ వనరైన ఉమ్మడి రాజధానిని కోల్పోయాం. విభజన జరిగి పదేళ్ళయినా రాజధాని లేని నగరంగా మిగిలిపోయాం. పదిలక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి కూరుకుపోయాం. వడ్డీల చెల్లింపు, సిబ్బంది జీతాలు... ఇలా అప్పులపై అప్పులు చేస్తూ ఋణగ్రస్త ఆంధ్రప్రదేశ్‌గా మిగిలాం. అధ్వాన్నమైన రోడ్లు, విద్యుత్ కోతలు, పెరిగిన విద్యుత్ ఛార్జీలు, ఇతర రాష్ట్రాలన్నా అత్యధికంగా పెట్రోల్ ధరలు, ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను, చెత్త పన్ను... ఇలా సామాన్య, మధ్యతరగతి ప్రజల బతుకులు రాష్ట్రంలో దుర్భరంగా మారాయి.

ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి రాష్ట్ర రాజకీయ పార్టీల వద్ద ఎజెండా లేదు, రాష్ట్రంపై వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే నైతికస్థైర్యం లేదు. అధికారం కోసం ప్రజలను తప్పుదారి పట్టించే వ్యూహాలు, ఎత్తుగడలతో అధికార ప్రతిపక్షాలు పోటీపడుతున్నాయి. అధికారం కోసం వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులంటూ మూడు విషబీజాలు నాటి ప్రాంతీయ కుల వైషమ్యాలను రెచ్చగొట్టి ప్రజలను విభజించించి వంచిస్తున్నది. పదేళ్ళు గడచినా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన విభజన హామీలు అమలు కాని దుస్థితికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. విభజన హామీలు సాధించకుండా ఎవరు అధికారం చేపట్టినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు.

బోనులో నిలబడవలసిన పార్టీలే మళ్ళీ ఓటర్లను మోసం చేయడానికి ఉద్యుక్తులవుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకం. మన రాష్ట్ర హక్కుల పరిరక్షణకు రాజకీయాలకతీతంగా మేధావులు, ప్రజాసంఘాలు కర్ణాటక ఎన్నికల్లో వలే ఆంధ్ర ఓటర్లను ఎడ్యుకేట్ చేయాలి. భారత రాజ్యాంగం మనకు ప్రతి ఐదేళ్ళకొకసారి ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చింది. ప్రలోభాలకు లోబడి ఈ ఆయుధాన్ని దుర్వినియోగపరచడమే ప్రస్తుత పరిస్థితికి కారణం. ఇప్పటికైనా మేలుకుని రాష్ట్రం గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం.

అవధానుల హరి, తాతా సేవకుమార్,

పన్నాల సత్యనారాయణమూర్తి

(జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో

‘ఓటరు చైతన్య ఉద్యమం’ అంశంపై రేపు ఉదయం 10గంటలకు గుంటూరు బ్రాడిపేటలోని

ఎస్.హెచ్.ఓ మీటింగ్ హాల్లో సమావేశం)

Updated Date - 2023-08-30T04:16:18+05:30 IST