Son Trapped Under Father's Coffin: దారుణం.. తండ్రి శవ పేటిక కింద ఇరుక్కుపోయిన తనయుడు
ABN , Publish Date - Apr 10 , 2025 | 06:08 PM
అంత్యక్రియల సందర్భంగా జరిగిన ఓ అపశృతి మృతుడి కుటుంబానికి చేదు అనుభవం మిగుల్చింది. తండ్రి శవపేటికను గొయ్యిలోకి చేర్చే సమయంలో పొరపాటున తనయుడు కూడా గొయ్యిలో పడి ఇరుక్కుపోయి గాయాలపాలయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: కుటుంబపెద్ద పోయిన దుఃఖంలో ఉన్న ఓ వ్యక్తికి అంత్యక్రియల్లో షాకింగ్ అనుభవం ఎదురైంది. తండ్రి శవపేటికన గొయ్యిలో పెట్టే క్రమంలో తనయుడు కూడా గొయ్యిలో ప్రమాదవశాత్తూ గొయ్యిలో పడిపోవడంతో కుటుంబసభ్యులు షాకైపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఈ దృశ్యాలను చూసి షాకైపోతున్నారు. ఎంత పని జరిగిందీ అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాలోని ఫిలడెల్ఫియా రాష్ట్రంలో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, బెంజమిన్ ఆల్విస్ అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. గ్రీన్‌మౌంట్ శ్మశానవాటికలో అతడిని శుక్రవారం ఖననం చేసేందుకు కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బెంజమిన్ మృతదేహాన్ని శవపేటికలో పెట్టి కారులో శ్మశానవాటిక వరకూ తీసుకొచ్చారు. ఆ తరువాత నలుగురు శవ పేటికను లోపలికి తీసుకొచ్చారు.
అయితే, శవపేటికను గొయ్యిలోకి చేర్చే సమయంలో వారు నిలబడ్డ బల్లలు కదలడంతో బెంజమిన్ తనయుడితో సహా వారందరూ గొయ్యిలో పడిపోయారు. బెంజమిన్ తనయుడికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. ఇదంతా చూసి బెంజమిన్ కుటుంబసభ్యులు నిర్ఘాంతపోయారు. శవపేటిక కింద ఇరుక్కుపోయిన వారందరి కాళ్లు, చేతులపై గాయాలు అయ్యాయి.
కాగా, శ్మశానవాటిక వారు ఖననం కోసం సరిగ్గా ఏర్పాట్లు చేయకపోవడమే ఇందుకు కారణమని బెంజమిన్ కూతురు ఆరోపించింది. తండ్రి పోయిన దుఃఖంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం మరింత కుంగదీసిందని వ్యాఖ్యానించింది. మృతులను, వారి కుటుంబసభ్యులను అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
‘గొయ్యి చుట్టూ ఏర్పాట్లు చేసిన బల్లలు అప్పటికే కదులుతూ కనిపించాయి. చెక్క తడిసిపోయింది. ఇలాంటి ఏర్పాట్లు ఎవరైనా చేస్తారా. వారు మాకు కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే’’ అని కూతురు ఆవేదన వ్యక్తం చేసింది.
జరిగిన ఘటనను నుంచి తేరుకున్నాక కుటుంబసభ్యులు యథావిధిగా చివరి కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ ఘటనను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేమని ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశానవాటిక వారి తీరు క్షమార్హం కాదని మండిపడ్డారు. మరోవైపు, ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి:
చాట్‌జీపీటీ సలహాలనే వింటున్న బాస్.. అవమానం తట్టుకోలేక ఆ ఉద్యోగి
మొదటిసారి బంగారం కంటున్నారా? తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏవంటే..
తల్లి హృదయం ఎంత గొప్పది.. చిరుత దాడిలో గాయపడ్డా లెక్క చేయక ఈ తల్లి శునకం..