Counseling: ప్రి మెచ్యూర్ ప్రసవంపై డాక్టర్లు ఏమంటున్నారంటే..!
ABN , First Publish Date - 2023-08-03T12:26:54+05:30 IST
డాక్టర్! నాది ప్రి మెచ్యూర్ ప్రసవం. బిడ్డ ఆరోగ్యం మెరుగైన తర్వాత ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చాం. అయితే ప్రి మెచ్యూర్ బేబీస్ భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. వీటిని ముందుగానే కనిపెట్టి, నియంత్రించాలంటే ఏం చేయాలి? ఎలా నడుచుకోవాలి?
డాక్టర్! నాది ప్రి మెచ్యూర్ ప్రసవం. బిడ్డ ఆరోగ్యం మెరుగైన తర్వాత ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చాం. అయితే ప్రి మెచ్యూర్ బేబీస్ భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. వీటిని ముందుగానే కనిపెట్టి, నియంత్రించాలంటే ఏం చేయాలి? ఎలా నడుచుకోవాలి?
- ఓ సోదరి, హైదరాబాద్.
ప్రి మెచ్యూర్ పిల్లలు ఆస్పత్రి నుంచి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయిన తర్వాత క్రమం తప్పకుండా వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వస్తూ ఉండాలి. ‘గండం గడిచి, పిల్లాడి ప్రాణాలు నిలిచాయి... అంతే చాలు!’ అనుకుంటే ప్రమాదమే! ఈ పిల్లలకు వైద్యుల పర్యవేక్షణ ఎంతో అవసరం. వారి ఎదుగుదల, ఇంద్రియాల సామర్ధ్యం, నాడీ మండల పనితీరు, స్పందించే గుణం... ఇలా ఎన్నో అంశాల మీద పర్యవేక్షణ అవసరం. కాబట్టి క్రమం తప్పక పరీక్షలు అవసరమవుతాయి.
వినికిడి సమస్యలు: పుట్టిన వెంటనే పరీక్ష చేసినా, ప్రతి మూడు నెలలకు వినికిడి పరీక్షలు అవసరమవుతాయి. అంతా మామూలుగా ఉంటే ఏడాది వయసుకు వచ్చిన తర్వాత పరీక్ష చేయించాలి.
రెటినోపతీ: ప్రీ మెచ్యూర్ పిల్లలు పుట్టిన వెంటనే అందించే ఆక్సిజన్ పరిమాణం తక్కువైనా, ఎక్కువైనా, లోపించినా కళ్లు దెబ్బతింటాయి. దానివల్ల పెరిగే క్రమంలో రెటినోపతీ తలెత్తవచ్చు. కాబట్టి బిడ్డ పుట్టిన 21 రోజులకే కళ్లు పరీక్ష చేసినా, అప్పటి నుంచి ప్రతి రెండు వారాలకు ఓసారి పరీక్ష చేయిస్తూ ఉండాలి. అలా కన్ను పూర్తిగా కన్ను ఎదిగేవరకూ నాలుగు నెలలకోసారి, ఏడాదికోసారి, రెండేళ్లకు, ఐదేళ్లకు, ఆరేళ్లకు... ఇలా క్రమం తప్పక ఫాలో అప్ చేయిస్తూ ఉండాలి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే కన్ను దెబ్బతిని లేజర్ సర్జరీ, అరుదుగా సర్జరీ కూడా చేయవలసి రావొచ్చు.
నాడీ సంబంధ ఎదుగుదల: మోటార్ (నడక, అవయవాల కదలికలు, సెన్సరీ (స్పర్శ, స్పందించే గుణం) కాగ్నిటివ్ (తెలివితేటలు)... ఈ అంశాల్లో సమస్యలు తలెత్తవచ్చు. ఈ సమస్యలన్నీ మెదడులో ఇన్‌ఫెక్షన్ లేదా రక్తస్రావం అయితే మోటార్ డెవల్‌పమెంట్ సమస్యలు తలెత్తుతాయి. రక్త పరీక్ష కోసం పసికందులకు పదే పదే సూది గుచ్చడం వల్ల కూడా మెదడు మీద ప్రభావం పడి రక్తస్రావం జరగవచ్చు. గర్భిణికి మధుమేహం అదుపు తప్పినా, పోషకాలు తగ్గినా, ఇన్‌ఫెక్షన్లు ఉన్నా నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలో మెదడు ఎదుగుదల తగుమాత్రంగా ఉండకపోవచ్చు. ఈ కారణాల వల్ల మెదడు ఎదుగుదల కుంటుపడి, తెలివితేటల మీద ప్రభావం పడవచ్చు. ఈ నష్టం జరిగిపోయిన తర్వాత సరిదిద్దే చికిత్సలు లేవు, కాబట్టి ఇలా జరగకుండా నియంత్రించుకోవడం ఒక్కటే మార్గం!
న్యూరోడెవల్‌పమెంట్ అసిస్టెడ్ పీడియాట్రీషియన్ అనే ప్రత్యేక వైద్యులు మాత్రమే నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఎదుగుదల లోపాలను కరెక్టుగా గుర్తించగలుగుతారు. కాబట్టి ప్రీ మెచ్యూర్ బేబీ్‌సను వైద్యుల సూచన మేరకు ఈ పిల్లల వైద్యుల చేత క్రమం తప్పక పరీక్షలు చేయుస్తూ ఉండాలి. ఇలా చేయగలిగితే లోపాలను సాధ్యమైనంత ప్రారంభంలోనే గుర్తించి అవసరమైన చికిత్సలతో సరిదిద్దుకోవచ్చు.
-డాక్టర్ ఎ.వెంకటలక్ష్మి
నియోనాటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్, హైదరాబాద్