Libido: లైంగిక జీవితం సంతృప్తి చెందాలంటే ఇవే కీలకం!
ABN , First Publish Date - 2023-11-21T11:05:02+05:30 IST
లైంగిక ప్రవర్తన, లైంగిక స్పందన, సెక్స్ ఎడ్యుకేషన్‌లతో మొదట లైంగిక జీవితం ప్రాధాన్యాన్ని ప్రతి మహిళా అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. అలాగే
బంధాన్ని బలపరిచే అంశాల్లో సెక్స్‌ది కచ్చితంగా కీలకమైన పాత్రే! ప్రేమను వ్యక్తపరచడానికి ఉపయోగపడే అత్యుత్తమ సాధనమది. అయితే కొన్ని కారణాల వల్ల అందుకు మనస్కరించకపోవచ్చు. మునుపటి ఉధృతి కుంటుపడవచ్చు. అలాంటప్పుడు స్త్రీపురుషులిద్దరూ తమలో లిబిడో తగ్గడానికి కారణాలను కనిపెట్టి, సరిదిద్దుకుని, తిరిగి లైంగిక జీవిత మధురాలను ఆస్వాదించాలి.
మహిళల్లో...
మరీ ముఖ్యంగా మహిళలు లైంగికాసక్తి తగ్గితే ఆ అంశానికి ప్రాధాన్యం ఇవ్వరు. ఇంటి పనులు, ఆఫీసు పనులతో అలసటకు లోనవడం, వృత్తిగత, వ్యక్తిగత ఒత్తిళ్లు, హార్మోన్ల లోపం, మధుమేహం, అధిక రక్తపోటు, జింక్, విటమిన్ డి లోపం, అస్థవ్యస్త జీవనశైలి... ఇలా మహిళల్లో లిబిడో తగ్గడానికి ఎన్నో కారణాలు. కానీ దృఢమైన అనుబంధానికి కీలకమైన లైంగికాసక్తి లోపాన్ని నిర్లక్ష్యం చేస్తే అనుబంధం బీటలు బారవచ్చు. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినవచ్చు.
ఎలా నిలువరించాలి?
లైంగిక ప్రవర్తన, లైంగిక స్పందన, సెక్స్ ఎడ్యుకేషన్‌లతో మొదట లైంగిక జీవితం ప్రాధాన్యాన్ని ప్రతి మహిళా అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. అలాగే ఆరోగ్యకరమైన లైంగిక జీవితం కోసం భాగస్వామితో మనసు విప్పి మాట్లాడుకోవడం, యోగా, వ్యాయామాల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడం, అరమరికలు లేని నాణ్యమైన సమయాన్ని కలిసి గడపడం లాంటివి చేస్తే, కోల్పోయిన లిబిడో తిరిగి దరి చేరుతుంది.
అలాగే...
మాట్లాడాలి, వినాలి: లైంగికపరమైన ఇష్టాఇష్టాల గురించి దంపతులిద్దరూ మాట్లాడుకోవడం ఎంతో అవసరం. అప్పుడే పరిపూర్ణమైన లైంగికానందం సొంతమవుతుంది. లిబిడో కూడా పెరుగుతుంది.
ఆరోగ్యకమైన అలవాట్లు: పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పక వ్యాయామం చేయడం వల్ల మనసు, శరీరం ఉరకలేస్తూ ఉంటాయి. రొమాంటిక్ ఫీలింగ్స్ పెరుగుతాయి.
ల్యూబ్రికెంట్: శారీరక అసౌకర్యం వల్ల లిబిడో తగ్గితే, అవసరాన్ని బట్టి లూబ్రికెంట్లు వాడుకోవచ్చు.
అధునిక చికిత్సలు
అన్ని ప్రయత్నాలూ విఫలమైన పక్షంలో లిబిడో తగ్గడానికి దారితీసిన భౌతిక సమస్యల మీద దృష్టి పెట్టాలి. ఈస్ట్రోజన్ థెరపీ, ఆండ్రోజన్ థెరపీలతో పాటు ఎఫ్‌డిఎ అంగీకరించిన కొన్ని రకాల మందులు, కొన్ని రకాల వృక్షాధారిత మందులతో లిబిడోను పెంచుకునే వీలుంది. అయితే లిబిడో తగ్గడానికి పరిష్కారం కాని మానసిక, సామాజిక అంశాలు కారణమైతే, ఎంతటి మన్నికైన మందులు కూడా ప్రభావాన్ని చూపించవు. కాబట్టి లిబిడో తగ్గడానికి మూల కారణాన్ని కచ్చితంగా కనిపెట్టడం అత్యవసరం.
సురక్షితమైన మందులున్నాయి
వృక్షాధారిత న్యూట్రాస్యూటికల్స్‌తో దుష్ప్రభావాలు తక్కువ. అయితే రోగి ఆరోగ్య చరిత్ర, శరీర తత్వాల ఆధారంగా ఎలాంటి మందులు సూట్ అవుతాయో సెక్సాలజిస్టులు మాత్రమే నిర్ణయించగలుగుతారు. కాబట్టి లిబిడో పెరుగుదల కోసం వైద్యులను సంప్రదించడం అవసరం.
-డాక్టర్ షర్మిల మజుందార్
సెక్సాలజిస్ట్ అండ్ సైకో అనలిస్ట్
పురుషుల్లో...
కాలం మారింది. దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయనిదే కుటుంబం నడవని పరిస్థితి. పని ఒత్తిడిని ఆఫీసుకే పరిమితం చేయకుండా ఇంటివి వెంట పెట్టుకుని రావడం పరిపాటిగా మారింది. పెండింగ్ పనులు పూర్తి చేసుకోవడంలో గడిపేయడం, స్నేహితులు, సన్నిహితులను కలవడం, ఇంటి పనులు.. వీటితో వారాంతాలను గడిపేస్తూ ఉంటారు. ఇవే కాకుండా వృత్తిపరమైన లక్ష్యాలను చేరుకోవాలనే ఒత్తిడితో నిద్ర తగ్గడం, ఫలితంగా హార్మోన్లు తగ్గడం, ఆఫీసు పనులతో అలసిపోయి ఇంటికి వచ్చిన వెంటనే మంచం మీద వాలిపోవడం లేదా ఒత్తిడి నుంచి బయటపడడం కోసం సోషల్ మీడియా, టివి లాంటి కాలక్షేపాల మీద ఆధారపడడం, మద్యం, ధూమపానంతో కూడిన వారాంతపు పార్టీలు...ఇలా ఇన్ని వ్యాపకాలతో జీవిత భాగస్వామితో అన్యోన్యమైన అనుబంధం కొనసాగించాలనీ, అందుకోసం శారీరక సాన్నిహిత్యం అవసరమనే ఆలోచన మీద నుంచి దృష్టి మరలుతుంది. మరీ ముఖ్యంగా ‘లైంగిక కోరికలు’ కూడా తగ్గుతాయి.
ఆహారమూ కీలకమే!
ఒంటరిగా ఉండే పురుషులు వంట వండుకునే తీరిక లేకపోవడంతో జంక్ లేదా హోటల్ ఆహారాల మీద ఆధారపడుతూ ఉంటారు. ఈ ఆహారపుటలవాట్ల వల్ల పురుషుల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ మోతాదు పెరుగుతుంది. దాంతో పురుష హార్మోన్ టెస్టోస్టెరాన్ తగ్గిపోయి, లైంగిక కోరికలు తగ్గుముఖం పడతాయి.
పిల్లల కోసమే కాదు
పిల్లల కోసమే సెక్స్ అనే అభిప్రాయం సరి కాదు. కానీ ఈ తరహా అభిప్రాయం కొంతమంది పురుషుల్లో పెరిగిపోతోంది. దాంతో భాగస్వామి గర్భం దాల్చిన తర్వాత, క్రమం తప్పకుండా లైంగికంగా కలవవలసిన అవసరం లేదనే అభిప్రాయం పురుషుల్లో కలుగుతోంది. అలాగే ఇద్దరం సమానమే ఆలోచనా విధానం పెరగడం మూలంగా కూడా అభిప్రాయాలు కలవక, తరచూ గొడవలు పడుతూ ఉండడం, ఫలితంగా ఒకరి మీద ఒకరికి ఆకర్షణ తగ్గి లైంగిక కలయికకకు దూరం కావడం కూడా జరుగుతోంది.
పోషకాల లోపం కూడా....
విటమిన్ డి తగ్గడం వల్ల కూడా లిబిడోతో పాటు సెక్సువల్ పెర్‌ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది. అలాగే విటమిన్ బి12 లోపం మాంసాహారం తినని వాళ్లలోనే తలెత్తుతూ ఉంటుంది. కానీ శోషణ శక్తి సన్నగిల్లడం వల్ల ఇటీవలి కాలంలో మాంసాహారుల్లో సైతం ఈ లోపం ఉంటోంది. ఈ లోపం వల్ల కూడా కోరికలు తగ్గిపోతాయి. ఈ పోషక లోపాలు దీర్ఘకాలం పాటు కొనసాగితే, శరీరంలోని సూక్ష్మ రక్తనాళాలు డ్యామేజీ అయిపోయి, స్తంభన సమస్యలు కూడా మొదలవుతాయి.
ఎలా గుర్తించాలి?
సెక్సువల్ ఫ్రీక్వెన్సీ తగ్గడాన్ని ఎవరికి వారు గమనించుకోవాలి. మునుపు ఎంత తరచుగా కలిసేవారు, ఇప్పుడు ఎంత తరచుగా కలుస్తున్నారు అనేది గమనించుకోవాలి. అలాగే ఉదయం స్తంభనలు క్రమేపీ తగ్గుతున్నాయేమో గమనించుకోవాలి. అలాగే ఫీమేల్ పార్ట్‌నర్... తరచూ కలవడం లేదని పరోక్షంగా మాటల ద్వారా వ్యక్తపరుస్తూ ఉన్నా, పరోక్షంగా సూచనలు, కామెంట్లు, హింట్ల ద్వారా లిబిడో తగ్గిందనే విషయాన్ని కనిపెట్టాలి.
ఇలా సరిదిద్దుకోవాలి
సాధారణంగా హార్మోన్, విటమిన్ లోపం వల్లే లిబిడో తగ్గుతుంది కాబట్టి, విటమిన్ లోపాలను సరిదిద్దుకోవడంతో పాటు హార్మోన్ లోపాలను పరీక్షలతో కనిపెట్టి వైద్యుల సూచన మేరకు ఆ లోపాన్ని భర్తీ చేసుకోవాలి. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించాలి. అప్పటికీ సమస్య పరిష్కారం కానప్పుడు వైద్యులను కలిసి అవసరమైన చికిత్సలను ఆశ్రయించాలి. సాధారణంగా కొందరు పురుషులు లైంగిక కోరికలను పెంచుకోవడం కోసం వయాగ్రా మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ ఇది సరి కాదు. దీనికి అలవాటు పడితే వయాగ్రా వేసుకోనిదే లైంగికంగా చురుగ్గా మారలేని పరిస్థితి తలెత్తవచ్చు. ఇలాంటి డిపెండెన్సీ ప్రమాదకరం. కాబట్టి లిబిడో పరంగా సమర్థమైన చికిత్స కోసం వైద్యులనే ఆశ్రయించడం మంచిది.
-డాక్టర్ రాహుల్ రెడ్డి
ఆండ్రాలజిస్ట్, ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్,
జూబ్లీహిల్స్, హైదరాబాద్.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి