Share News

Road Accident: ఘోర ప్రమాదం.. బస్సులో మంటలు చెలరేగి 13 మంది మృతి

ABN , Publish Date - Dec 28 , 2023 | 08:07 AM

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ట్రక్కును ప్రైవేట్ బస్సు ఢీ కొన్న ఘటనలో మంటలు చేలరేగి 13 మంది సజీవ దహనం అయ్యారు. మరో 17 మంది గాయపడ్డారు.

Road Accident: ఘోర ప్రమాదం.. బస్సులో మంటలు చెలరేగి 13 మంది మృతి

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ట్రక్కును ప్రైవేట్ బస్సు ఢీ కొన్న ఘటనలో మంటలు చేలరేగి 13 మంది సజీవ దహనం అయ్యారు. మరో 17 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుణ నుంచి ఆరోన్ వెళ్తుండగా రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుణ జిల్లా కలెక్టర్ తరుణ్ రతి ప్రమాదాన్ని ధృవీకరించారు. "ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో పదిహేడు మంది చికిత్స పొందుతున్నారు. వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు. బస్సు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు" అని జిల్లా కలెక్టర్ తెలిపారు. మంటల్లో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని చెప్పారు.


దీంతో చనిపోయిన వారిని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించనున్నారని ఆయన తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించామని, ప్రమాదంపై విచారణ కొనసాగుతోందని కలెక్టర్ చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మంటలు చెలరేగుతున్న సమయంలో వారిలో నలుగురు ఏదో ఒక విధంగా బస్సు నుంచి బయటపడి ఇంటికి చేరుకున్నట్టు చెప్పారు. ఈ విషాదకర ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Updated Date - Dec 28 , 2023 | 08:16 AM