Mallikarjun Kharge: సినిమా వాళ్లు కావాలి, రాష్ట్రపతి వద్దా?... ఖర్గే నిప్పులు..!
ABN , First Publish Date - 2023-09-23T20:31:47+05:30 IST
ఇటీవల జరిగిన నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బీజేపీ ఆహ్వానించకపోవడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు. ఇనాగరేషన్ కార్యక్రమానికి సినిమా నటులను పిలిచి, రాష్ట్రపతిని మినహాయించారని అన్నారు.
జైపూర్: ఇటీవల జరిగిన నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu)ను బీజేపీ ఆహ్వానించకపోవడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తప్పుపట్టారు. ఇనాగరేషన్ కార్యక్రమానికి సినిమా నటులను పిలిచి, రాష్ట్రపతిని మినహాయించారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజస్థాన్‌లో శనివారంనాడు జరిగిన ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ, పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం విషయంలో రాష్ట్రపతికి ఘోర అవమానం జరిగిందన్నారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం వెనుక ఉద్దేశం ఏమిటని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని కమ్యూనిటీలకు చెందిన వారు ఉన్నారని, బీజేపీ మాత్రం ఎవర్నీ దగ్గరకు రానీయదని విమర్శించారు.
రామ్‌నాథ్ కోవింద్ విషయంలోనూ...
కొత్త పార్లమెంటు భవనం శంకుస్థాపన విషయంలో కూడా ఇలాంటిదే జరిగిందని, అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని ఖర్గే గుర్తుచేశారు. ''అస్పృశ్యత'' కారణంగానే ఆయనను ఆహ్వానించలేదని ఆరోపించారు. ఒక 'అస్పృశ్యుని'తో శంకుస్థాపన చేయిస్తే, వాళ్లు దానిని గంగాజలంతో శుద్ధి చేసుకుని ఉండేవాళ్లేమోనని ఆక్షేపించారు. ఇది కుల ఆధారిత వివక్షను చాటుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వెనుక మోదీ ప్రభుత్వ ఉద్దేశాన్ని కూడా ఖర్గే ప్రశ్నించారు. మహిళలకు రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశం బీజేపీకి లేదన్నారు. పలు విపక్ష పార్టీలు 'ఇండియా' కూటమిగా ఏర్పడటంతో ఎన్నికల ముందు మహిళా రిజర్వేషన్ బిల్లు తేవాలనే ఆలోచన చేసిందన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి ముందు జైపూర్‌లోని మానసరోవర్ ప్రాంతంలో కొత్తగా నిర్మించనున్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఖర్గే, రాహుల్ గాంధీ శంకుస్థాపన చేశారు.