అమిత్‌షా... మోదీపై మీకెందుకీ కోపం?
ABN , First Publish Date - 2023-06-13T04:18:28+05:30 IST
ఓ తమిళుడిని ప్రధానిగా చూడాలని వుందంటూ వ్యాఖ్యానించిన కేంద్రమంత్రి అమిత్‌షాకు తమిళనాడు సీఎం స్టాలిన్ చురకలంటించారు. అమిత్‌షా ప్రకటనను స్వాగతిస్తున్నట్లు చెబుతూనే..

చెన్నై, జూన్ 12(ఆంధ్రజ్యోతి): ఓ తమిళుడిని ప్రధానిగా చూడాలని వుందంటూ వ్యాఖ్యానించిన కేంద్రమంత్రి అమిత్‌షాకు తమిళనాడు సీఎం స్టాలిన్ చురకలంటించారు. అమిత్‌షా ప్రకటనను స్వాగతిస్తున్నట్లు చెబుతూనే.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమిళుడిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనుకుంటే తెలంగాణా గవర్నర్ తమిళిసై, లేదా కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్‌కు ఆ అవకాశం కల్పించాలని వ్యంగ్యంగా సూచించారు. అయినా పాపం, ప్రస్తుత ప్రధాని మోదీపై అమిత్‌షాకు ఎందుకింత కోపమో అర్థం కావడం లేదని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఏదేమైనా తమిళుడిని ప్రధానమంత్రిని చేయాలని అమిత్ షా కోరుకోవడం తనకెంతో సంతోషంగా వుందని పేర్కొన్నారు. సేలం జిల్లా మెట్టూరు డ్యామ్ నుండి సోమవారం ఉదయం కావేరి జలాలను విడుదల చేసిన సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. గతంలో రెండుసార్లు తమిళుడికి ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా, డీఎంకే అడ్డుకుందంటూ అమిత్‌షా చేసిన ఆరోపణను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్–డీఎంకే నేతృత్వంలోని గత కేంద్ర ప్రభుత్వంలో భారీగా అవినీతి జరిగిందని అమిత్‌షా చేసిన విమర్శలపై స్పందిస్తూ.. ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన రఫేల్ కుంభకోణం, అదానీ అవినీతి గురించి ముందుగా సమాధానం చెప్పాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.