Fake birth certificate case: అజంఖాన్, ఆయన భార్య, కుమారుడికి 7 ఏళ్ల జైలు
ABN , First Publish Date - 2023-10-18T16:37:46+05:30 IST
నకిలీ బర్త్ సర్టిఫికెట్ కేసులో సమాజ్‌వాదీ పార్టీ నేత అజాం ఖాన్ కు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో అజాంఖాన్, ఆయన భార్య తాంజీమ్ ఫాతిమా, కుమారుడు అబ్దుల్లా ఆజమ్‌లను దోషిగా కోర్టు నిర్ధారించింది. వీరికి ఏడేళ్ల పాటు జైలు శిక్ష, రూ.15,000 జరిమానా విధించింది.
రాంపూర్: నకిలీ బర్త్ సర్టిఫికెట్ (Fake birth certificate) కేసులో సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) నేత అజాం ఖాన్ (Azam Khan)కు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో అజాంఖాన్, ఆయన భార్య తాంజీమ్ ఫాతిమా, కుమారుడు అబ్దుల్లా ఆజమ్‌లను దోషిగా కోర్టు నిర్ధారించింది. వీరికి ఏడేళ్ల పాటు జైలు శిక్ష, రూ.15,000 జరిమానా విధించింది. ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మేజిస్ట్రేట్ షోబిత్ బన్సార్ ఈ తీర్పు వెలువరించారు.
రాంపూర్‌లోని గంజ్ పోలీస్ స్టేషన్‌లో 2019 జనవరి 3న బీజేపీ ఎమ్మెల్యే ఆకాష్ సక్సేనా ఈ కేసు వేశారు. అజాంఖాన్, ఆయన భార్య కలిసి తమ కుమారుడి కోసం లక్నో నుంచి ఒకటి, రాంపూర్ నుంచి మరొకటి నకిలీ బర్త్ సర్టిఫికెట్ తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. రాంపూర్ మున్సిపాలిటీ జారీ చేసిన సర్టిఫికెట్‌లో అబ్దుల్లా ఆజమ్ 1993 జనవరి 1న పుట్టినట్టు ఉండగా, లక్నో నుంచి తీసుకున్న సర్టిఫికెట్‌లో 1990, సెప్టెంబర్ 30న పుట్టినట్టు ఉందని చార్జిషీటులో పేర్కొన్నారు. కాగా, కోర్టు తీర్పు వెలువడగానే అజాంఖాన్, ఆయన భార్య, కుమారుడిని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుని నేరుగా జైలుకు తరలించినట్టు ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది అరుణ్ ప్రకాష్ సక్సేనా తెలిపారు.