BBC Documentary: కేంద్రం నిషేధాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిల్
ABN , First Publish Date - 2023-01-29T18:35:57+05:30 IST
గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీని నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం..
న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ (BBC Documentary)ని నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (PIL) దాఖలైంది. మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ దురుద్దేశపూరితమైనదని, రాజ్యాంగవిరుద్ధమని ఆరోపిస్తూ ఆ డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించింది. ఈ నిర్ణయాన్ని అడ్వకేట్ ఎంఎల్ శర్మ సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 'పిల్' వేశారు. బీబీసీ డాక్యుమెంటరీ పార్ట్-1, పార్ట్-2 రెండింటినీ పరీక్షించాలని, 2002 గుజరాత్ అల్లర్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని సుప్రీంకోర్టును పిటిషనర్ కోరారు.
కేంద్రం తీసుకున్న చర్య రాజ్యాంగపరమైన ప్రశ్నలకు తావిస్తోందని, 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన వార్తలు చూడటం, వాస్తవాలు, రిపోర్టులను తెలుసుకునే హక్కు ఆర్టికల్ 19 (1) (2) కింద పౌరులకు ఉందా లేదా అనేది అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించాలని పిటిషనర్ అన్నారు. మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని చట్టవిరుద్ధం, దుష్ప్రచారం, కుట్రపూరితం, రాజ్యాంగవ్యతిరేకమని పేర్కొంటూ 2023 జనవరి 21న కేంద్ర సమాచార, ప్రసార శాఖ జారీ చేసిన ఉత్తర్వును కొట్టివేయాలని పిటిషనర్ కోరారు. ఆర్టికల్ 19 (1) (2) కింద సంక్రమించిన ప్రాథమిక హక్కు అయిన పత్రికా స్వేచ్ఛకు కేంద్రం కళ్లెం వేయవచ్చా అని ఆయన ప్రశ్నించారు. బీబీసీ డాక్యుమెంటరీ సాక్ష్యాలతో కూడిన 'రికార్డెడ్ ఫ్యాక్ట్' అని, బాధితులకు మరింత న్యాయం జరిగేందుకు ఉపయోగించుకోవచ్చని పిటిషనర్ అన్నారు.
కాగా, వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీ ''India: The Modi Question''కు సంబంధించిన యూట్యూబ్ వీడియోలు, ట్విట్టర్ పోస్టుల లింక్‌లను బ్లాక్ చేయాలంటూ జనవరి 21న కేంద్రం ఆదేశాలిచ్చింది. వలసవాద మనస్తత్వంగా ఈ డాక్యుమెంటరీని భారత ప్రభుత్వం అభివర్ణించింది. దీనిపై యూకేలోనూ ఎంపీలు రెండు వర్గాలుగా చీలిపోయారు. కొందరు డాక్యుమెంటరీని సమర్ధించగా, మరికొందరు మోదీకి మద్దతు పలికారు. దీనిని పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన అంశంగా అమెరికా విదేశాంగ శాఖ అభివర్ణించింది. ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛా పత్రికా ప్రాముఖ్యతను సమర్ధిస్తామని పేర్కొంది. భావ ప్రకటనా స్వేచ్ఛ, మతం, విశ్వాసం వంటి ప్రజాస్వామ్య సూత్రాలు, మానవ హక్కులకు తాము ప్రాధాన్యమిస్తామని తెలిపింది.
'మోదీ క్వశ్చన్' పేరిట బీబీసీ రెండు భాగాలుగా డాక్యుమెంటరీని రూపొందించింది. 59 నిమిషాల నిడివితో రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో రాజకీయాల్లో నరేంద్ర మోదీ తొలి అడుగులు, సాధారణ కార్యకర్త నుంచి గుజరాత్ సీఎంగా ఎదిగిన తీరు చూపించింది. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 2002లో జరిగిన అల్లర్ల గురించి ఈ డాక్యుమెంటరీలో ప్రధానంగా ప్రస్తావించింది. గోద్రా అల్లర్లు, ఆ సమయంలో సీఎం వైఖరి, దాన్ని రాజకీయంగా ఎలా వినియోగించుకున్నారనేది ఇందులో తెలిపింది. గోద్రాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడానికి కారణమైన వాతావరణం ఏర్పడటానికి ప్రత్యక్షంగా మోదీనే కారణమని అప్పట్లో బ్రిటీష్ దౌత్యవేత్త ఒకరు ఇచ్చిన నివేదిక గురించి డాక్యుమెంటరీలో చూపించింది. 2 వేల మందికి పైగా మరణించిన ఈ మారణకాండ పథకం ప్రకారమే జరిగిందని పేర్కొంది. దీనికి సంబంధించిన తొలి ఎపిసోడ్ జనవరి 17న యూకేలో ప్రసారమైంది. కానీ భారత్‌లో దీనిని నిషేధించారు.