NPP on UCC: యూసీసీకి ఎన్డీయే భాగస్వామి ఝలక్

ABN , First Publish Date - 2023-07-01T16:25:08+05:30 IST

ఉమ్మడి పౌర స్మృతి ఆలోచనతో మేఘాలయ ముఖ్యమంత్రి, నేషనల్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు కాన్రాడ్ కె.సంగ్మా విభేదించారు. భారతదేశ వాస్తవ ఆలోచనకు యూసీసీ విరుద్ధమని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారతదేశ ఆలోచనా విధానానికి ఉమ్మడి పౌర స్మృతి ఎంతమాత్రం తగదని అన్నారు.

NPP on UCC: యూసీసీకి ఎన్డీయే భాగస్వామి ఝలక్

న్యూఢిల్లీ: ఉమ్మడి పౌర స్మృతి (UCC) ఆలోచనతో మేఘాలయ ముఖ్యమంత్రి, నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) అధ్యక్షుడు కాన్రాడ్ కె.సంగ్మా (Conrad K.Sangma) విభేదించారు. భారతదేశ వాస్తవ ఆలోచనకు యూసీసీ విరుద్ధమని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారతదేశ ఆలోచనా విధానానికి ఉమ్మడి పౌర స్మృతి ఎంతమాత్రం తగదని మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ''మా పార్టీ కోణం నుంచే నేను మాట్లాడుతున్నారు. భారతదేశ వాస్తవ స్ఫూర్తిగా యూసీసీ పూర్తి విరుద్ధం. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, జీవన విధానాలు, మతాలే భారతదేశానికి ఉన్న ప్రధాన బలం'' అని సంగ్మా చెప్పారు.

మేఘాలయాలో మాతృస్వామ్య సమాజం (Matrilineal Society) ఉందని, అదే తమ బలమని సీఎం తెలిపారు. అనాదిగా తాము పాటిస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను మార్చుకోలేమని అన్నారు. ఈశాన్య ప్రాంతం అంతా ఒక అరుదైన సంస్కృతిని కలిగి ఉందనే విషయం ఒక రాజకీయ పార్టీగా తాను చెప్పదలచుకున్నానని, ఏ ఒక్కరూ తమ సంస్కృతి, సంప్రదాయాల జోలికి రావడాన్ని తాము ఇష్టపడమని స్పష్టం చేశారు.

బీజేపీ సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ), నార్త్ఈస్ట్ డెమోక్రాటిక్ అలయెన్స్ (ఎన్‌ఈడీఏ)లో భాగస్వామిగా ఎన్‌పీపీ ఉంది. అధికార మేఘాలయ డెమెక్రాటిక్ అలయెన్స్ (ఎండీఏ)కు ఎన్‌పీపీ సారథ్యం వహిస్తోంది.

Updated Date - 2023-07-01T16:25:08+05:30 IST