BBC Row : బీబీసీపై ఐటీ సర్వేను ప్రస్తావించిన బ్రిటన్ మంత్రి... జైశంకర్ జవాబు ఎలా ఉందంటే...
ABN , First Publish Date - 2023-03-01T16:18:12+05:30 IST
జాతీయ మీడియా కథనాల ప్రకారం, జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు జేమ్స్ క్లెవర్లీ న్యూఢిల్లీకి వచ్చారు.
న్యూఢిల్లీ : బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ సర్వే గురించి ప్రస్తావించిన బ్రిటన్ విదేశాంగ మంత్రికి ఘాటైన సమాధానం లభించింది. ద్వైపాక్షిక సమావేశాల కోసం వచ్చిన బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీ (James Cleverly) ఈ అంశాన్ని ప్రస్తావించినపుడు మన విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) స్పందిస్తూ, భారత దేశ చట్టాలకు అనుగుణంగా నడచుకోవాలని చెప్పారు. ఐటీ అధికారులు గత నెలలో ముంబై, న్యూఢిల్లీలలోని బీబీసీ కార్యాలయాల్లో సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు జేమ్స్ క్లెవర్లీ న్యూఢిల్లీకి వచ్చారు. ఆయన బుధవారం జైశంకర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బీబీసీ న్యూఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో ఐటీ సర్వే గురించి ప్రస్తావించారు. ఈ విషయాన్ని జేమ్స్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే జైశంకర్ దీనికి ఘాటుగా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.
భారత దేశంలో కార్యకలాపాలు నిర్వహించే వ్యాపార సంస్థలు తప్పనిసరిగా సంబంధిత భారతీయ చట్టాలు, నిబంధనలను పాటించాలని జైశంకర్ చెప్పినట్లు తెలుస్తోంది.
2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లు, అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ పనితీరు గురించి వివరించే ఓ డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసింది. దీనిని మన దేశంలో ప్రసారం చేయరాదని ట్విటర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సర్వే జరిగింది. బీబీసీ ఆదాయం భారత దేశంలోని దాని కార్యకలాపాలకు అనుగుణంగా లేదని, కొన్ని పన్నులను చెల్లించడం లేదని ఐటీ శాఖ ఆరోపించింది. ఈ నేపథ్యంలో బీబీసీకి అండగా ఉంటామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే దర్యాప్తుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయబోనని తెలిపింది.
ఆదాయపు పన్ను శాఖ నిర్వహించే సర్వేలో బీజేపీ ప్రమేయం ఉన్నట్లు వచ్చిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ శాఖ స్వతంత్రంగా పని చేస్తోందని తెలిపింది. విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల మాట్లాడుతూ, బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం అవుతున్న సమయం యథాలాపంగా ఎంపిక చేసుకున్నది కాదన్నారు. భారతదేశంతోపాటు అమెరికా, బ్రిటన్లలో కూడా ఎన్నికల సీజన్ ప్రారంభమైందన్నారు.
ఇవి కూడా చదవండి :
Yogi Bulldozer : సీఎం యోగి బుల్డోజర్ ఈసారి ఎవరి ఇంటిని కూల్చిందంటే...!
Supreme Court : అంబానీ కుటుంబ సభ్యులకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత... ఖర్చుల భారం ఎవరు మోయాలంటే...