Chennai: ఆ విషయంలో డీజీపీ శైలేంద్రబాబు శైలే వేరు!
ABN , First Publish Date - 2023-07-01T11:17:00+05:30 IST
రాష్ట్ర డీజీపీగా డాక్టర్ సి.శైలేంద్రబాబు(Dr. C. Shailendra Babu) పోలీస్ శాఖపై తనదైన ముద్ర వేశారు. 2021 మేలో డీఎంకే ప్రభు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర డీజీపీగా డాక్టర్ సి.శైలేంద్రబాబు(Dr. C. Shailendra Babu) పోలీస్ శాఖపై తనదైన ముద్ర వేశారు. 2021 మేలో డీఎంకే ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి డీజీపీగా వ్యవహరిస్తున్న ఆయన రాష్ట్రవ్యాప్తంగా నేరాలను తగ్గించేందుకు వివిధ చర్యలు చేపట్టారు. అంతేగాక నేరాల అప్రమత్తతపై ఆయన వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అంతేగాక యువతలో క్రీడల పట్ల ఆసక్తి రేకెత్తించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్(IAS, IPS) పరీక్షల అవగాహనపై శైలేంద్రబాబు ప్రారంభించిన వెబ్‌సైట్‌ను 20 లక్షల మంది విద్యార్థులు అనుసరిస్తుండడం విశేషం. ఆయన డీజీపీగా వ్యవహరించిన రెండేళ్లలో 7 వేలమంది పోలీసులు, 5 వేలమంది ప్రజలను తన కార్యాలయంలో నేరుగా కలుసుకున్నారు. ఈ రెండేళ్లలో ఆయన ఒకే ఒక్క రోజు మాత్రమే సెలవు తీసుకున్నారు. ఆ రోజు కూడా ఆయన ప్రభుత్వ కార్యాక్రమాల్లోనే పాల్గొన్నారు. అంతేగాక పోలీస్ స్టేషన్ల పనితీరును పరిశీలించేందుకు ఆయన హఠాత్ తనిఖీలు నిర్వహించారు. పదవీ విరమణ చేసి వెళ్తున్న శైలేంద్రబాబు వాహనాన్ని ఐపీఎస్ ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా తాడుతో లాగుతూ తమ అభిమానం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నూతన డీజీపీ శంకర్ జివాల్ కూడా పాల్గొనడం విశేషం. కన్నియాకుమారి జిల్లాకు చెందిన శైలేంద్రబాబు 1987వ బ్యాచ్‌కు చెందిన వారు. ఆయన్ని టీఎన్‌పీఎ్‌ససీ చైర్మన్‌గా నియమించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ భావిస్తున్నట్లు తెలిసింది.
