Delhi Floods : యమునా నది శాంతిస్తోంది, కానీ ఢిల్లీ అవస్థలకు ఇంకా ఉపశమనం లేదు
ABN , First Publish Date - 2023-07-15T10:15:27+05:30 IST
హిమాచల్ ప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలతో ఉగ్ర రూపం దాల్చిన యమునా నది శనివారం ఉదయం నుంచి క్రమంగా శాంతిస్తోంది. పాత రైల్వే వంతెన వద్ద నీటి ప్రవాహం నెమ్మదిగా తగ్గుతోంది. అయితే ఈ నదిలో నీటి మట్టం శనివారం ఉదయం 8 గంటలకు ప్రమాద స్థాయికి మించి, అంటే 207.58 మీటర్లు ఉంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ బురద రాజకీయాలు చేస్తున్నాయి.
న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలతో ఉగ్ర రూపం దాల్చిన యమునా నది శనివారం ఉదయం నుంచి క్రమంగా శాంతిస్తోంది. పాత రైల్వే వంతెన వద్ద నీటి ప్రవాహం నెమ్మదిగా తగ్గుతోంది. అయితే ఈ నదిలో నీటి మట్టం శనివారం ఉదయం 8 గంటలకు ప్రమాద స్థాయికి మించి, అంటే 207.58 మీటర్లు ఉంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ బురద రాజకీయాలు చేస్తున్నాయి.
ఢిల్లీ నగరంలోని ఐటీఓ, శాంతివనం, ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం, తదితర ప్రధాన ప్రాంతాలు జలమయమయ్యాయి. మూడు రోజుల క్రితం యమునా నదిలో నీటి మట్టం 45 ఏళ్లలో అత్యధికంగా నమోదైంది. శనివారం ఉదయం 7 గంటలకు ఈ నీటి మట్టం 207.62 మీటర్లు ఉండేది, ఉదయం ఎనిమిది గంటలకు 207.58 మీటర్లు ఉంది. శుక్రవారం రాత్రి 11 గంటలకు ఇది 207.98 మీటర్లు ఉండేది. నీటి మట్టం క్రమంగా తగ్గుతుండటంతో ఓఖ్లా నీటి శుద్ధి కేంద్రాన్ని మళ్లీ తెరిచి, కార్యకలాపాలు ప్రారంభించారు. దీనిని గురువారం మూసేసిన సంగతి తెలిసిందే.
నగరంలో వరదల వల్ల పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. శ్మశానాలను కూడా మూసేసింది. యమునా నది పరీవాహక ప్రాంతంలో శ్మశానాలు కూడా జలమయమయ్యాయి.
ఓఖ్లా నీటి శుద్ధి కేంద్రంలో కార్యకలాపాలు పునఃప్రారంభమైన తర్వాత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, యమునా నది నీటి మట్టం శనివారం ఉదయానికి 207.7 మీటర్లకు తగ్గితే, వజీరాబాద్, చంద్రవాల్ నీటి శుద్ధి ప్లాంట్లను కూడా తెరుస్తామని చెప్పారు.
ఢిల్లీకి వర్ష సూచన
ఢిల్లీ నగరంలో శనివారం వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తూ, యెల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న కొద్ది రోజులపాటు ఆకాశం మేఘావృతమై, తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది.
బురద రాజకీయాలు
దేశ రాజధాని నగరం వరదలతో అల్లకల్లోలమైన సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. నిరంతరాయంగా 20 గంటలపాటు పని చేసిన తర్వాత ఐటీఓ బ్యారేజిని ఆర్మీ ఇంజినీర్ రెజిమెంట్ తెరచింది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆర్మీ ఇంజినీర్ రెజిమెంట్‌కు ధన్యవాదాలు తెలిపారు. దీనిపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ స్పందిస్తూ, మీరు ఘనతను సొంతం చేసుకోవడం కోసం కేవలం ట్వీట్ మాత్రమే చేశారని దుయ్యబట్టారు. అన్ని పనులను ఆర్మీ ఇంజినీర్ రెజిమెంట్, దాని సిబ్బంది మాత్రమే చేశారని స్పష్టం చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం విడుదల చేసిన వీడియోలో హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. హత్నికుండ్ బ్యారేజి నుంచి నీటిని ఢిల్లీవైపు విడిచిపెట్టారని, ఉత్తరప్రదేశ్ వైపు పొడిగా ఉందని ఆరోపించింది. దీనిపై హర్యానా ప్రభుత్వం స్పందిస్తూ, కేంద్ర జల సంఘం మార్గదర్శకాలనే తాము అనుసరించామని చెప్పింది. 1 లక్ష కన్నా ఎక్కువ క్యూసెక్కుల నీరు ఉన్నపుడు పశ్చిమ యమునలోకి కానీ, తూర్పు యమునలోకి కానీ వదిలిపెట్టకూడదని కేంద్ర జల సంఘం మార్గదర్శకాలు చెప్తున్నాయని తెలిపింది. ఈ కాలువల్లో పెద్ద బండరాళ్లు ఉన్నందువల్ల నీరు ప్రవహించడం కష్టమవుతుందని తెలిపింది. దీనిలో వివాదం ఏదీ లేదని, అనవసరంగా దీనిపై వివాదం సృష్టిస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పింది. దీనిపై అమిత్ మాలవీయ స్పందిస్తూ, హత్నికుండ్ నుంచి ఉత్తర ప్రదేశ్‌కు నీటిని మళ్లించారని, కేవలం సాగునీటి కోసం మాత్రమే ఇలా చేశారని, వరదలను ఆపడానికి కాదని అన్నారు.
బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ, రాజధాని నగరం వరదల్లో చిక్కుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని వ్యవస్థలు 100 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని మాత్రమే తట్టుకోగలిగే విధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పడాన్ని తప్పుబట్టారు. ఇంత వరకు మీరు ఏం చేశారని కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. ఉచిత తాయిలాల రాజకీయాలు చేసినపుడు ఇలాగే జరుగుతుందని, నగరంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి బదులుగా ఉచిత తాయిలాల రాజకీయాలు చేస్తున్నారని, నగరం వరదల్లో చిక్కుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదని దుయ్యబట్టారు.
ఇవి కూడా చదవండి :
BJP state president: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన ప్రకటన.. ఈ నెలాఖరులో ‘డీఎంకే అవినీతి చిట్టా-2’
Price hike : ధరల పెరుగుదలకు కారణం మియా ముస్లింలే : హిమంత బిశ్వ శర్మ