Former CM: అవినీతి, అక్రమాలకు హద్దూపద్దు లేకుండా పోయింది.. మండిపడ్డ మాజీ సీఎం..
ABN , First Publish Date - 2023-08-16T11:44:20+05:30 IST
రాష్ట్రంలో సిద్దరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు హద్దూపద్దు లేకుండా పోయిందని జేడీఎస్
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సిద్దరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు హద్దూపద్దు లేకుండా పోయిందని జేడీఎస్ అగ్రనేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి(Former CM HD Kumaraswamy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగళూరులోని జేడీఎస్ ప్రధాన కార్యాలయంలో పతాకావిష్కరణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అవినీతి సీజన్, చాప్టర్‌ల లెక్కలో సాగుతోందంటూ విరుచుకు పడ్డారు. తాను బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నానంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టిన కుమారస్వామి తాను ఆరున్నర కోట్ల కన్నడిగుల ప్రతినిధినన్నారు. తనది హిట్ అండ్ రన్ పాలసీ కాదని, తన వద్ద ఉన్న పెన్ డ్రైవ్ ఖాళీగా లేదన్నారు. తన సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉందా..? అంటూ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు తనపై నోటికొచ్చినట్టు మాట్లా డుతుండడంతో స్పందించాల్సి వస్తోందన్నారు. కావేరి జలాల వివాదంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూసి స్పందిస్తామన్నారు.
సామాజిక న్యాయం పార్టీ బలమైన సిద్ధాంతమన్నారు. దేశ స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలన్నదే తమ సంకల్పమన్నారు. శాసనసభ ఎన్నికల ఫలితాలతో కుంగిపోలేదని, లోక్‌సభ ఎన్నికల నాటికి మరింత బలోపేతం అవుతామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలనపై నిరంతర పోరాటాన్ని కొనసాగించాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం, బెంగళూరు విభాగం అధ్యక్షుడు హెచ్‌ఎం రమేశ్‌గౌడ, సీనియర్ నేత నారాయణరావు, ఎమ్మెల్సీలు కేఎన్ తిప్పేస్వామి, టీఏ శరవణ తదితరులు పాల్గొన్నారు. ఇదే సందర్భంగా కుమార స్వామి పార్టీ కార్యకర్తలతో సంభాషించారు.