Sodhi : రాజ్యాంగాన్ని హైజాక్ చేస్తున్న సుప్రీం
ABN , First Publish Date - 2023-01-23T02:54:38+05:30 IST
న్యాయమూర్తుల నియామకంపై కేంద్రప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు నడుమ ఘర్షణ కొనసాగుతూనే ఉంది. కొలీజియం వ్యవస్థపై పదేపదే వ్యాఖ్యలు చేస్తున్న కేంద్ర న్యాయమంత్రి కిరెన్ రిజిజు తాజాగా.. సుప్రీంతీరుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన

ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి సోధీ వ్యాఖ్య..
వీడియో పోస్ట్ చేసిన కేంద్రమంత్రి రిజిజు
జడ్జీల నియామకంపై కొలీజియం లేఖలో
భద్రతా కారణాలు.. కేంద్రం కలవరం
వచ్చే వారం ప్రభుత్వ తుది నిర్ణయం!
న్యూఢిల్లీ, జనవరి 22: న్యాయమూర్తుల నియామకంపై కేంద్రప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు నడుమ ఘర్షణ కొనసాగుతూనే ఉంది. కొలీజియం వ్యవస్థపై పదేపదే వ్యాఖ్యలు చేస్తున్న కేంద్ర న్యాయమంత్రి కిరెన్ రిజిజు తాజాగా.. సుప్రీంతీరుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ సోధీ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల వీడియోను షేర్ చేశారు. దేశంలో చట్టాలు చేసే హక్కు పార్లమెంటుకు మాత్రమే ఉందని.. సుప్రీంకోర్టుకు చట్టాలు చేసే హక్కు లేదని జస్టిస్ సోధీ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘‘పార్లమెంటు మాత్రమే రాజ్యాంగాన్ని సవరించగలదు. కానీ, ఇక్కడ మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని హైజాక్ చేసింది. హైజాక్ చేశాక.. ‘న్యాయమూర్తులను మేమే నియమించుకుంటాం. ప్రభుత్వానికి ఇందులో పాత్ర లేదు’ అని చెబుతోంది.’’ అని వ్యాఖ్యానించారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన రిజిజు.. ‘‘ఇది ఒక జడ్జి మాట. ఎక్కువ మంది ప్రజల అభిప్రాయం కూడా ఇదే. రాజ్యాంగ నియమాలను, ప్రజల తీర్పును తిరస్కరించేవారు మాత్రమే తాము రాజ్యాంగం కంటే అధికులమని భావిస్తారు’’ అని న్యాయవ్యవస్థపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కాగా.. ఢిల్లీ, బాంబే, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులుగా తాము ప్రతిపాదించిన అడ్వొకేట్లను నియమించాల్సిందేనంటూ సుప్రీం కొలీజియం ఇటీవల రాసిన లేఖలో భద్రతాపరమైన కారణాలనూ ప్రస్తావించడంపై కేంద్రం ఆందోళన చెందుతోంది. ఉదాహరణకు.. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రముఖ అడ్వొకేట్ సౌరభ్‌కిర్‌పాల్ పేరును సుప్రీం కొలీజియం ప్రతిపాదించగా, ఆయన తనను తాను స్వలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్నందున అలాంటి కేసుల విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరించే ప్రమాదం ఉందని, ఆయన భాగస్వామి స్విస్ జాతీయుడు అని.. కాబట్టి ఆయన పేరును పునఃపరిశీలించాలని కేంద్రం తిప్పిపంపింది.
దీనికి సుప్రీం.. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారిలో చాలా మంది భాగస్వాములు విదేశీయులు ఉన్నారని, ఇక సౌరభ్ తన లైంగిక ఆసక్తులను దాచుకోకుండా బయటకు ప్రకటించడం ఆయన విశ్వసనీయతను పెంచుతుందే తప్ప తగ్గించదని.. కాబట్టి ఆయన్ను నియమించాల్సిందేనని తన లేఖలో పేర్కొంది. అలాగే ఇతర అడ్వొకేట్ల విషయంలోనూ.. వారు ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల ఆధారంగా కేంద్రం వారి పేర్లను తిరస్కరించగా, రాజ్యాంగం ప్రసాదించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, వాక్స్వాతంత్య్రం ప్రకారం వారికి తమ భావాలు వెల్లడించే హక్కు ఉందంటూ సుప్రీంకోర్టు కేంద్రం అభ్యంతరాలను తోసిపుచ్చింది. నిజానికి ఇలాంటి లేఖల విషయంలోనూ, నిఘావర్గాల నివేదికలపైన గోప్యత పాటించడం దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ సంప్రదాయంగా కొనసాగుతోంది. దాన్ని కాదని.. సుప్రీంకోర్టు తాను రాసిన లేఖను బహిర్గతం చేయడం కేంద్రాన్ని కలవరపెట్టింది. దీంతో.. ఈ వ్యవహారంపై న్యాయవ్యవస్థకు తన అభిప్రాయాన్ని తెలియజేయాలని, అలాగే సుప్రీం కొలీజియం తిప్పిపంపిన ప్రతిపాదిత జడ్జీల విషయంలో వచ్చేవారం చివరికల్లా ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.