Governor - CM: ఒకే విమానంలో గవర్నర్ - సీఎం.. అభివాదమే తప్ప పలకరించుకోని వైనం?!
ABN , Publish Date - Dec 19 , 2023 | 07:58 AM
రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Governor RN Ravi and Chief Minister MK Stalin) ఒకే విమానంలో ప్రయాణించారు.
అడయార్(చెన్నై): రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Governor RN Ravi and Chief Minister MK Stalin) ఒకే విమానంలో ప్రయాణించారు. వారిద్దరూ సోమవారం చెన్నై నుంచి కోయంబత్తూరు(Chennai to Coimbatore)కు బయలుదేరి వెళ్లారు. కోయంబత్తూరులో ‘ప్రజలతో ముఖ్యమంత్రి’ కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం ఉదయం 8.20 గంటలకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్లారు. అలాగే, కోయంబత్తూరు సమీపంలో సోమవారం జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు గవర్నర్ రవి కూడా ఇదే విమానంలో బయలుదేరి వెళ్లారు. ఉదయం 7.50 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం స్టాలిన్.. వీఐపీలు వెళ్లే ప్రవేశమార్గం గేట్ నెం.6 నుంచి లోపలికెళ్లి అక్కడి వీఐపీ లాంజ్‌లో కొంత సమయం వేచిచూసి ఆ తర్వాత 8.20 గంటలకు విమానంలో ఎక్కి 1ఏ సీటులో కూర్చొన్నారు. ఆ తర్వాత 8.05 గంటలకు ఆరో నెంబరు గేట్ ద్వారా విమానాశ్రయంలోకి ప్రవేశించిన గవర్నర్ ఆర్‌ఎన్.రవి.. వీఐపీ లాంజ్‌కు వెళ్ళకుండానే నేరుగా విమానం ఎక్కి 1ఎఫ్ సీటులో కూర్చొన్నారు. విమానంలో ఒక వైపు విండో సీటులో సీఎం, మరోవైపు విండో సీటులో గవర్నర్ కూర్చొని కోవైకు ప్రయాణించారు. వారిద్దరూ లాంఛనంగా అభివాదం చేసుకోవడమే తప్ప, మధ్యలో ఎక్కడా మాట్లాడుకోలేదని తెలిసింది. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులపై రవి, స్టాలిన్ చర్చించుకుని పరిష్కరించుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు సూచించిన విషయం తెలిసిందే. దీనిపై మాట్లాడుకుందాం రమ్మంటూ గవర్నర్ ఆహ్వానించగా, చర్చకు తనకెలాంటి అభ్యంతరం లేదని, అయితే అటువైపు వ్యక్తికి చిత్తశుద్ధి కూడా ఉండాలంటూ స్టాలిన్ ఓ కార్యక్రమంలో నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.