Hero Vijay : దళపతి టార్గెట్‌ లోక్‌సభ ఎన్నికలా? అసెంబ్లీనా?

ABN , First Publish Date - 2023-04-23T10:32:42+05:30 IST

సినీ నటుడు విజయ్‌(Vijay is a Tamil film actor) రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఆయనకు చెందిన దళపతి మక్కల్‌ ఇయక్కం ఆధ్వర్యంలో

Hero Vijay : దళపతి టార్గెట్‌ లోక్‌సభ ఎన్నికలా? అసెంబ్లీనా?

చెన్నై, (ఆంధ్రజ్యోతి): తమిళ సినీ నటుడు విజయ్‌(Vijay is a Tamil film actor) రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఆయనకు చెందిన దళపతి మక్కల్‌ ఇయక్కం ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా గుట్టుచప్పుడు కాకుండా సర్వేలు నిర్వహిస్తున్నారు. ఓ వైపు ఈ సర్వేలు ముమ్మరంగా జరుగుతుండగానే మరో వైపు వచ్చే యేడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలా? లేక 2026లో జరిగే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలా? అనే విషయమై ఆయన అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. విజయ్‌ నాయకత్వంలోని దళపతి మక్కల్‌ ఇయక్కం(Dalapati Makkal Iyakkam) రాజకీయ పార్టీగా మారనున్నట్లు కొన్నేళ్ళుగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ విషయమై విజయ్‌ ఎలాంటి ప్రకటన చేయకుండా మౌనం పాటిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్‌ మక్కల్‌ ఇయక్కం అభ్యర్థులు పలుచోట్ల గెలిచినప్పుడే విజయ్‌ రాజకీయ ప్రవేశం ఖాయమని ఆ ఇయక్కం నేతలంతా చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే తమిళ సంవత్సరాది రోజున దళపతి మక్కల్‌ ఇయక్కం ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా రాజ్యాగం నిర్మాత అంబేడ్కర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇయక్కం జిల్లాస్థాయి నాయకులంతా అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అలర్పించారు. అదే సమయంలో మునుపెన్నడూ లేని విధంగా విజయ్‌ మక్కల్‌ ఇయక్కం రాష్ట్రమంతటా ఇఫ్తార్‌ విందులను కూడా ఘనంగా నిర్వహించింది. ఇవన్నీ విజయ్‌ రాజకీయ ప్రవేశానికి ముందస్తు చర్యలని చెబుతున్నారు. ఈ పరిస్థితులలోనే దళపతి మక్కల్‌ ఇయక్కం ఆధ్వర్యంలో జిల్లాల వారీ సర్వేలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయదలచి ఆశావహులకు కొన్ని ప్రశ్నలతో కూడిన దరఖాస్తులను పంపిణీ చేశారు. వాటిలో ఆయా జిల్లాల్లో ఉన్న శాసనసభ, లోక్‌సభ(Legislature, Lok Sabha) నియోజకవర్గాలలో గత మూడు పర్యాయాలు పోటీ చేసి గెలిచిన అభ్యర్థుల వివరాలు, వారు పొందిన ఓట్ల వివరాలను అడుగుతున్నారు. గెలిచిన అభ్యర్థులతో పోటీపడి ఓటమిపాలైన అభ్యర్థులు పొందిన ఓట్ల వివరాలను కూడా తెలపాలని కోరుతున్నారు. ఆశావహులకు నియోజకవర్గాలలో గల పలుకుబడి, ప్రజలుతో వారికి గల పరిచయాలు గురించి కూడా ఆ దరఖాస్తుల ద్వారా సేకరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రమంతటా ఆయా జిల్లాలకు చెందిన ఇయక్కం నిర్వాహకులు ఈ సర్వేలను జరుపుతున్నారు. వచ్చే నెల సర్వేలు పూర్తి చేసి ఆ దరఖాస్తులన్నింటిని విజయ్‌ పరిశీలించనున్నారు. ఆ తర్వాత జిల్లా శాఖ నాయకులతో ఆయన సమావేశమై ఎన్నికల్లో పోటీ చేసే విషయంగా చర్చలు జరుపుతారని ఆ ఇయక్కం నిర్వాహకులు కొందరు చెబుతున్నారు.

nani5.3.jpg

అదే సమయంలో హీరో విజయ్‌(Hero Vijay) తన దళపతి మక్కల్‌ ఇయక్కంను శాసనసభ ఎన్నికల్లోగా రాజకీయ పార్టీగా మార్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన అనుచరులు తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలా? లేక లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయాలనే విషయంపై కూడా ఆలోపునే విజయ్‌ తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికి విజయ్‌ రాజకీయ రంగప్రవేశం తథ్యమని చెప్పారు. ప్రస్తుతం తన మక్కల్‌ ఇయక్కంను గ్రామీణ స్థాయిలోనూ బలోపేతం చేసేందుకు ఆయన చర్యలు చేపడుతున్నారని తెలుస్తోంది.

Updated Date - 2023-04-23T12:33:12+05:30 IST