Bulldozer Mama: జనాన్ని బెదిరిస్తే బుల్డోజర్ తీస్తాం.. కాంగ్రెస్‌కు సీఎం వార్నింగ్
ABN , First Publish Date - 2023-11-10T16:04:44+05:30 IST
ఓటర్లను బెదిరిస్తే మామ బుల్డోజర్ సిద్ధంగా ఉంటుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. అనుప్పూర్ జిల్లా జిజూరిలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ప్రజలు శివరాజ్ సింగ్‌ను 'మామ' అని ఆప్యాయంగా సంబోధిస్తుంటారు.
అనుప్పూర్: ఓటర్లను బెదిరిస్తే మామ బుల్డోజర్ సిద్ధంగా ఉంటుందని మధ్యప్రదేశ్ (Madhya pradesh) ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. అనుప్పూర్ జిల్లా జిజూరిలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ప్రజలు శివరాజ్ సింగ్‌ను 'మామ' అని ఆప్యాయంగా సంబోధిస్తుంటారు.
''ఓట్ల కోసం ప్రజలను కాంగ్రెస్ అభ్యర్థులు బెదిరిస్తున్నట్టు నాకు తెలిసింది. నేను చాలా స్పష్టంగా చెప్పదలచుకున్నాను. మీరు ప్రజలపై వేలెత్తి చూపినా, కన్నెర్ర చేసినా మామ బుల్డోజర్ సిద్ధంగా ఉంటుంది. మీ దౌర్జన్యాలను మేము సహించం, నేలమట్టం చేస్తాం'' అని కాంగ్రెస్‌ను సీఎం హెచ్చరించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 15 నెలల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని అన్ని అభివృద్ధి ప్రాజెక్టులను నిలిపివేసిందని ఆయన విమర్శించారు. తాను ప్రవేశపెట్టిన సంబల్ యోజనకు గండికొట్టి పిల్లల నుంచి సైకిళ్లు లాక్కున్నారని, తీర్ధయాత్రలను ఆపేస్తే తాను తిరిగి ప్రారంభించానని చెప్పారు.
కాగా, 2024 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్ ఎన్నికల పోలింగ్ నవంబర్ 17న ఒకే విడతలో జరుగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి.