IndiGo Flight: విమానంలో ప్యాసింజర్ వీరంగం.. టేకాఫ్ సమయంలో ఏం చేశాడో తెలుసా?
ABN , First Publish Date - 2023-10-02T19:19:57+05:30 IST
విమానం ఎక్కిన తర్వాత కొందరికి అదేం మాయరోగం వస్తుందో ఏమో తెలీదు కానీ.. గాల్లో ఎరిగిన వెంటనే పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తుంటారు. పక్కనే కూర్చున్న మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటమో..
విమానం ఎక్కిన తర్వాత కొందరికి అదేం మాయరోగం వస్తుందో ఏమో తెలీదు కానీ.. గాల్లో ఎరిగిన వెంటనే పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తుంటారు. పక్కనే కూర్చున్న మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటమో, మద్యం అతిగా తాగేసి విమానం సిబ్బందితోనే అసభ్యంగా ప్రవర్తించడమో, బాత్రూమ్‌ల్లో కామక్రీడలకు దిగడం, ఎమర్జెన్సీ డోర్ తీయడానికి ప్రయత్నించడం.. అబ్బో ఇలా చెప్పుకుంటూపోతే పెద్ద లిస్టే వస్తుంది. ఇప్పుడు తాజాగా ఇండిగో సంస్థకు చెందిన విమానంలో ఒక ప్యాసింజర్ వీరంగం సృష్టించాడు. టేకాఫ్ కాబోతున్న సమయంలో అతగాడు ఎమర్జెన్సీ డోర్ తీసేందుకు ట్రై చేశాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
సెప్టెంబర్ 30వ తేదీన రాత్రి 10 గంటలకు ఇండిగోకి చెందిన 6E 6803 అనే ఫ్లైట్ నాగ్‌పూర్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. ఈ విమానంలోకి స్వప్నిల్ హోలీ అనే వ్యక్తి ఎక్కాడు. అతడు ఎమర్జెన్సీ డోర్ పక్కనే ఉన్న సీట్‌లో కూర్చున్నాడు. టేకాఫ్‌కి ముందు ప్రయాణికులకు విమాన సిబ్బంది బ్రీఫింగ్ ఇస్తున్న సమయంలో.. స్వప్నిల్ తన పక్కనే ఉన్న ఎమర్జెన్సీ డోర్‌ని తీయబోయాడు. ఇది గమనించిన సిబ్బంది వెంటనే అతని వద్దకు చేరుకొని, డోర్ తెరవడాన్ని నివారించారు. ఈ క్రమంలో అతడు సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. దీంతో.. సిబ్బంది అతడ్ని కట్టడి చేసి, ఎలాంటి తింగరి పనులు చేయకుండా నిఘా పెట్టారు. అనంతరం.. రాత్రి 11:55 గంటలకు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయ్యాక స్వప్నిల్‌ను పోలీసులకు అప్పగించారు. అక్కడి నుంచి అధికారులు అతడ్ని నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
విమాన సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. స్వప్నిల్‌పై పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 336 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చట్టం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, అరెస్ట్ చేశారు. అక్టోబర్ 1వ తేదీన అతడు బ్యాంకాక్‌కు వెళ్లాల్సి ఉందని తమ విచారణలో తేలినట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే.. స్వప్నిల్ ఎందుకు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు.