Smriti Irani: పిరియడ్ లీవ్‌ని వ్యతిరేకించిన స్మృతి ఇరానీ.. మద్దతు తెలిపిన కంగనా రనౌత్
ABN , Publish Date - Dec 14 , 2023 | 07:59 PM
మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనను వ్యతిరేకించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సినీ నటి కంగనా రనౌత్ మద్దతు తెలిపింది. మహిళలు ఎప్పుడూ పని చేస్తూనే ఉంటారని.. తమ కుటుంబం, కమ్యునిటీ, దేశం పట్ల...
Kangana Ranaut Supports Smriti Irani: మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనను వ్యతిరేకించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సినీ నటి కంగనా రనౌత్ మద్దతు తెలిపింది. మహిళలు ఎప్పుడూ పని చేస్తూనే ఉంటారని.. తమ కుటుంబం, కమ్యునిటీ, దేశం పట్ల వారి నిబద్ధతకు ఏదీ అడ్డురాలేదని ఆమె పేర్కొంది. అసలు మానవజాతి చరిత్రలో పనిచేయనంటూ ఒక్క మహిళ కూడా లేదని చెప్పింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో స్మృతి ఇరాని ‘నెలసరి సెలవుల’పై చేసిన వ్యాఖ్యల్ని షేర్ చేస్తూ.. ఆమె మద్దతుగా కంగనా ఇలా రాసుకొచ్చింది.
‘‘వర్కింగ్ విమెన్ ఒక మిత్ లాంటిది. మానవజాతి చరిత్రలో పని చేయని ఒక్క మహిళ కూడా లేదు. వ్యవసాయం దగ్గర నుంచి ఇంటి పనులు చూసుకోవడం, పిల్లల్ని పెంచడం వరకు.. మహిళలు ఎల్లప్పుడూ పని చేస్తూనే ఉన్నారు. తమ కుటుంబం, కమ్యునిటీ, దేశం పట్ల వారి నిబద్ధతకు ఏదీ అడ్డురాలేదు. కొన్ని నిర్దిష్టమైన వైద్య పరిస్థితుల్లో మినహాయించి.. మహిళలకు నెలసరి కోసం ‘పెయిడ్ లీవ్స్’ అవసరం లేదు. పిరియడ్స్ అనేది ఒక సహజ ప్రక్రియ మాత్రమేనని దయచేసి అర్థం చేసుకోండి. ఇదేమీ అనారోగ్యమో, వైక్యలమో కాదు’’ అని కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చెప్పుకొచ్చింది. కాగా.. కరెంట్ ఎఫైర్స్‌పై కంగనా ఇలా స్పందించడం ఇదే మొదటిసారి కాదు. బాక్సాఫీస్ కలెక్షన్ల దగ్గర నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని వరదలు, భారతదేశం మార్పుపై కూడా కంగనా తనదైన అభిప్రాయాల్ని పంచుకుంది.
అసలు స్మృతి ఇరానీ ఏం చెప్పారు?
‘‘మహిళకు నెలసరి అనేది వైకల్యం కాదు. అదొక సహజ ప్రక్రియ మాత్రమే. ఈ నెలసరి సెలవులు పని ప్రదేశంలో వివక్షకు దారితీయొచ్చు’ అని రాజ్యసభలో ఎంపీ మనోజ్ కుమార్ ఝా అడిగిన ప్రశ్నకు స్మృతి ఇరానీ సమాధానం ఇచ్చారు. ‘పిరియడ్ లీవ్’ అంశంపై సోమవారం పార్లమెంట్‌లో ఒక నివేదిక ప్రవేశ పెట్టారు. దానిని ఆరోగ్యశాఖ ఇంకా సమీక్షించాల్సి ఉంది. ఈ క్రమంలోనే స్మృతి ఇరాని ఇలా స్పందించారు. ఇదే టైంలో.. నెలసరి సమయంలో పాటించాల్సిన శుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ ముసాయిదా తీర్మానాన్ని రూపొందించిందని ఆమె ప్రకటించారు. దీని ద్వారా మహిళల్లో చైతన్యం కలిగించడమే లక్ష్యమని పేర్కొన్నారు.