Building Collapse: ఎమ్మెల్యే కుమారుడి అరెస్టు
ABN , First Publish Date - 2023-01-25T14:35:14+05:30 IST
లక్నోలోని హజ్రత్‌గంజ్‌లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే షాహిద్ మన్జూర్ కుమారుడు నవాజిష్ సాహిద్‌ను పోలీసులు బుధవారంనాడు...
లక్నో: లక్నోలోని హజ్రత్‌గంజ్‌లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో సమాజ్‌వాదీ పార్టీ (SP) ఎమ్మెల్యే షాహిద్ మన్జూర్ కుమారుడు నవాజిష్ సాహిద్‌ను పోలీసులు బుధవారంనాడు అరెస్టు చేశారు. మంగళవారం భవంతి కుప్పకూలిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
షాహిద్ మన్జూర్ కుమారుడు నవాజిష్ సాహిద్, మేనల్లుడు మొహమ్మద్ తారిఖి ఈ భవంతిని కొన్నారు. నవాజిష్ కుమార్తె అలయ పేరు ఈ భవనానికి పెట్టారు. కాగా, నవాజ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు సుమారు గంటసేపు ప్రశ్నించిన అనంతరం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో లక్నో తీసుకువెళ్లారు.
ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యుల కమిటీ
భవంతి కుప్పకూలిన ఘటనపై దర్యాప్తునకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటైంది. లక్నో కమిషనర్ రోషన్ జాకోబ్, లక్నో జాయింట్ పోలీస్ కమిషనర్ పీయూష్ మోర్డియా, లక్నో పీడబ్ల్యూడీ చీఫ్ ఇంజనీర్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. వారంలోగా కమిటీ నివేదిక అందించనుంది. కాగా, తగిన అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా భవనం నిర్మించినట్టు యూపీ డీజీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. భవంతి కూలిపోవడానికి కారణాలను ఇంకా నిర్ధారించాల్సి ఉందన్నారు. శాస్త్రీయ పద్ధతిలో సహాయక చర్యలు సాగుతున్నాయని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తెస్తామని చెప్పారు. ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్టు జిల్లా మెజిస్ట్రేట్ సూర్యపాల్ గంగ్వార్ తెలిపారు. ఆర్మీ టీమ్ సైతం ఘటనా స్థలికి చేరుకుంది.