Metro station: మెట్రో రైల్ పార్కింగ్‌కు వెళ్తున్నారా?... ఒక్కక్షణం!
ABN , First Publish Date - 2023-06-14T10:14:29+05:30 IST
మెట్రోరైల్(Metrorail) పార్కింగ్ బావుంది కదా అని అక్కడ మీ వాహనాన్ని పార్కు చేయడానికి వెళ్తున్నారా?.. అయితే ఒక్కక్షణం ఆగండి.
- నేటినుంచి పార్కింగ్ ధరల పెంపు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): మెట్రోరైల్(Metrorail) పార్కింగ్ బావుంది కదా అని అక్కడ మీ వాహనాన్ని పార్కు చేయడానికి వెళ్తున్నారా?.. అయితే ఒక్కక్షణం ఆగండి. మీరు మెట్రో రైల్‌లో ప్రయాణించకుండా అక్కడ మీ వాహనాన్ని పార్కు చేయాలనుకుంటే మాత్రం మీ జేబుకు చిల్లు పడ్డట్టే. ఎందుకంటే ప్రయాణికులు కాకుండా అక్కడ పార్కు చేయాలనుకునే వారి వద్ద బుధవారం నుంచి భారీగా వసూలు చేయాలని చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్(Chennai Metrorail Limited) అధికారులు నిర్ణయించారు. చెన్నైలో పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. వాహనం పార్కు చేద్దామంటే ఎక్కడా తగిన స్థలమే కనిపించదు. ఒకవేళ స్థలం ఉన్నా ఎండకు, వర్షాలకు వాహనాలు పాడైపోతున్నాయి. దీంతో వాహనదారులు కొత్తగా వచ్చిన మెట్రోరైల్వే స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. మంచి నీడపట్టున వాహనాన్ని పార్కు చేసుకునే వెసులుబాటుతో పాటు సీసీ కెమెరాల భద్రత ఉండడంతో వాహనదారులు తమ సమీపంలో వున్న మెట్రో రైల్ పార్కింగ్(Metro Rail Parking) స్థలాల్లో వాహనాలను నిలిపి ఉంచేందుకు మొగ్గు చూపుతున్నారు. తమ ఇళ్లముందు పార్కు చేసుకునే వెసులుబాటు లేని కొంతమంది నెలవారీ పాస్‌లు తీసుకుని మరీ స్టేషన్లలోనే పార్కింగ్ చేస్తున్నారు. దీంతో అక్కడ వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ కారణంగా మెట్రో రైళ్లలో ప్రయాణించాలనుకునే వారి వాహనాలు పార్కు చేసుకునేందుకు వీలు లేకుండాపోతోంది. దాంతో వారు మెట్రోరైళ్లలో ప్రయాణించేందుకు విముఖత చూపుతున్నట్లు సీఎంఆర్‌ఎల్ అధికారుల దృష్టికి వచ్చింది. దాంతో ఈ పార్కింగ్‌కు అడ్డుకట్ట వేయడంతో పాటు తమ ఆదాయం పెంచుకునే దిశగా వారు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా తమ పార్కింగ్ స్థలాల్లో పార్కు చేసుకునే వారినుంచి భారీగా వసూలు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ఈ ధరలు బుధవారం నుంచే అమల్లోకి రానున్నాయి. ప్రయాణికులు కాని వారి ద్విచక్రవాహనాలకు రూ.20 నుంచి రూ.40కు పెంచారు. కార్లకు రూ.30 నుంచి రూ.60కు పెంచారు. అయితే సాధారణ ప్రయాణికులు మాత్రం ఇందులో 50 శాతమే చెల్లిస్తే చాలు. ఇక నెలవారీ పాస్‌లను ద్విచక్రవాహనాలకు 300 శాతం, కార్లకు 100 శాతం పెంచారు. అయితే ఈ ధరలు ఆయా ప్రాంతాలను బట్టి ఒక్కో కేంద్రంలో ఒక్కో విధంగా ఉంటాయని అధికారులు తెలిపారు.