Nazar: సినీనటుడు నాజర్ ఇంట విషాదం.. ఏం జరిగిందంటే...
ABN , First Publish Date - 2023-10-11T08:34:18+05:30 IST
ప్రముఖ సినీ నటుడు, నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి మామూబ్ బాషా(94) మృతి చెందారు.
అడయార్(చెన్నై): ప్రముఖ సినీ నటుడు, నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి మామూబ్ బాషా(94) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో పాటు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన చెంగల్పట్టులోని తట్టాన్‌మలై వీధిలో ఉన్న స్వగృహంలో మంగళవారం కన్నుమూశారు. ఆయన మృతిపట్ల తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కాగా, నటుడిగా నాజర్ రాణించడానికి ఆయన తండ్రి కారణం. తండ్రి కోరిక మేరకు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరిన నాజర్... ఇపుడు దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో గొప్పనటుడిగా గుర్తింపు పొందారు. నటనలో శిక్షణ పూర్తి చేసిన నాజర్‌కు ఆరంభంలో సరైన అవకాశాలు రాకపోవడంతో నగరంలోని ఒక స్టార్ హోటల్‌లో సప్లయర్‌గా చేరారు. ఆ తర్వాత తండ్రి ఒత్తిడి మేరకు నాజర్ సినీ అవకాశాల కోసం ప్రయత్నించి విజయం సాధించారు. ఇపుడు తండ్రి మృతితో నాజర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. మంగళవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరిగాయి. సీఎం స్టాలిన్(CM Stalin) కూడా తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.