Tomato: టమోటా @ 200
ABN , First Publish Date - 2023-08-01T09:00:10+05:30 IST
టమోటా ‘అమ్మో’ అనిపిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న ధరతో బరువెక్కిపోతోంది. సామాన్యుడు కనీస స్థాయిలోనూ కొనుగోలు చేసేందుకు అవకాశం లేకుండా కొం
- బెంబేలెత్తుతున్న నగరవాసులు
ప్యారీస్(చెన్నై): టమోటా ‘అమ్మో’ అనిపిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న ధరతో బరువెక్కిపోతోంది. సామాన్యుడు కనీస స్థాయిలోనూ కొనుగోలు చేసేందుకు అవకాశం లేకుండా కొండెక్కి కూర్చుంటోంది. పెరిగిన డిమాండ్, తగ్గిన దిగుబడి, పాలకుల అసమర్థత వెరసి కిలో రూ.200 పలుకుతోంది. దీంతో మధ్యతరగతి ప్రజలు, పేదలు టమోటా(Tomato) పేరు చెబితేనే హడలెత్తిపోయే పరిస్థితి. టమోటా లేకుండా ఏ కూరా వండలేం. కూరలకు-టమోటాకు మధ్య విడదీయరాని అనుబంధం. కానీ పెరిగిన ధరల పుణ్యమా అని ఇటీవల వంటగదిలో టమోటాలు అరుదుగా కనిపిస్తున్నాయి. గత నెల వరకు నగరానికి దిగుమతులు గణనీయంగా తగ్గిపోవడంతో కిలో టమోటా ధర ఒక్కసారిగా రూ.150కి పెరిగింది. స్థానిక కోయంబేడులో ప్రధాన హోల్‌సేల్ మార్కెట్‌కు రోజుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 60 నుంచి 80 లారీల్లో టమోటాలు వచ్చేవి. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 35కు పడిపోయింది. గతంలో మార్కెట్‌కు రోజుకు 1,200 టన్నులు దిగుమతి అయ్యేవి. ప్రస్తుతం 400 టన్నులకు పరిమితం కావడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం కోయంబేడు మార్కెట్‌లో టమోటాలు కిలో రూ.200 పలుకుతుండగా, చెన్నై(Chennai)లోని చిన్న దుకాణాల్లో రూ.250 వరకు విక్రయిస్తున్నారు. కాగా టమోటా ఇంతస్థాయిలో ధర పలకడం ఇదే తొలిసారి. అదే విధంగా రాష్ట్రంలోని తిరునల్వేలి, పుదుకోట, కోయంబత్తూర్, తిరుచ్చి, మదురై, తిరువళ్లూర్(Trichy, Madurai, Tiruvallur), విల్లుపురం, చెంగల్పట్టు తదితర జిల్లాల్లో కూడా కిలో టమోటా ధర రూ.200 దాటింది. టమోటాతో పాటు బీన్స్ కిలో రూ.120గా పెరిగింది. అల్లం, వెల్లుల్లి కూడా కిలో రూ.250 నుంచి రూ.320 వరకు పలుకుతుండడంతో సామాన్యులు కొనలేక సతమతమవుతున్నారు.
రేషన్ దుకాణాల్లో ...
రాష్ట్రవ్యాప్తంగా 500 రేషన్ దుకాణాల్లో ఈనెల 1వ తేది మంగళవారం నుంచి టమోటాలను మళ్లీ విక్రయించనున్నట్టు రాష్ట్ర సహకారశాఖ మంత్రి పెరియకరుప్పన్(Minister Periyakaruppan) ప్రకటించారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం సహకార శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అమాంతంగా పెరిగిన టమోటా ధర తగ్గించడం, కూరగాయలు విక్రయించే రేషన్ దుకాణాల సంఖ్య పెంచడం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి పెరియకరుప్పన్ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 10 నుంచి 15 రేషన్ దుకాణాల్లో తక్కువ ధరకు టమోటాలను మంగళవారం నుంచి విక్రయించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.