Rahul Gandhi : భారత్‌లో ఫాసిజం : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2023-02-21T15:12:56+05:30 IST

భారత దేశంలో ఫాసిజం రాజ్యమేలుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress Leader Rahul Gandhi) అన్నారు. దేశంలో ప్రజాస్వామిక

Rahul Gandhi : భారత్‌లో ఫాసిజం : రాహుల్ గాంధీ
Rahul Gandhi

న్యూఢిల్లీ : భారత దేశంలో ఫాసిజం రాజ్యమేలుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress Leader Rahul Gandhi) అన్నారు. దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థలన్నీ కుప్పకులిపోయాయని ఆరోపించారు. పార్లమెంటు పని చేయడం లేదని, రెండేళ్ళ నుంచి తాను మాట్లాడలేకపోతున్నానని తెలిపారు. ‘‘నేను మాట్లాడిన వెంటనే వాళ్ళు నా మైక్రోఫోన్‌ను ఆఫ్ చేసేస్తారు’’ అని చెప్పారు. అధికారాల సమతుల్యత లేదన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా లేదన్నారు. కేంద్రీకృత విధానాలే సంపూర్ణంగా అమలవుతున్నాయన్నారు. పత్రికా స్వేచ్ఛ లేదని ఆరోపించారు. ఇటాలియన్ వార్తా పత్రిక కొరియర్ డెల్లా సెరా (Corriere della Sera)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఫాసిజం అంటే, అత్యంత సంప్రదాయ, తీవ్ర జాతీయవాద, వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా అధిష్ఠాన వర్గానికి విధేయంగా వ్యవహరించే రాజకీయ భావజాలం, ఉద్యమం. దీనిలో ఓ నియంత నాయకుడిగా ఉంటారు. ప్రతిపక్షాలను అణచివేస్తూ ఉంటారు. బలప్రయోగం చేస్తారు. దేశం, జాతి ప్రయోజనాలకు లోబడి వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయి.

రాహుల్ గాంధీ ఇటాలియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల తాను నిర్వహించిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) విశేషాలు, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)ని ఏ విధంగా ఓడించవచ్చు, ఇందిరా గాంధీ (Indira Gandhi), రాజీవ్ గాంధీ (Rajiv Gandhi)లతో తన అనుబంధం, 52 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడం వంటి అంశాల గురించి మాట్లాడారు.

భారత దేశంలో ఫాసిజం గురించి ప్రశ్నించినపుడు ఆయన స్పందిస్తూ, దేశంలో ఫాసిజం రాజ్యమేలుతోందన్నారు. దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థలన్నీ కుప్పకులిపోయాయని ఆరోపించారు. పార్లమెంటు పని చేయడం లేదని, రెండేళ్ళ నుంచి తాను మాట్లాడలేకపోతున్నానని తెలిపారు. ‘‘నేను మాట్లాడిన వెంటనే వాళ్ళు నా మైక్రోఫోన్‌ను ఆఫ్ చేసేస్తారు’’ అని చెప్పారు. అధికారాల సమతుల్యత లేదన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా లేదన్నారు. కేంద్రీకృత విధానాలే సంపూర్ణంగా అమలవుతున్నాయన్నారు. పత్రికా స్వేచ్ఛ లేదని ఆరోపించారు.

ఓ తపస్సు

భారత్ జోడో యాత్ర గురించి అడిగినపుడు గాంధీ స్పందిస్తూ, ఈ యాత్ర ఓ తపస్సు వంటిదన్నారు. తనతో సహా ప్రతి ఒక్కరి పరిమితులు మనం అనుకున్నదాని కన్నా చాలా ఎక్కువ అని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన భాష అయిన సంస్కృతంలో తపస్య అని ఉందన్నారు. ఈ పదాన్ని పాశ్చాత్య మేధావులు అర్థం చేసుకోవడం కష్టమని చెప్పారు. కొందరు దీనిని ‘త్యాగం’, ‘సహనం’ అని అనువాదం చేస్తారన్నారు. కానీ దీని అర్థం అది కాదని చెప్పారు. తాపాన్ని సృష్టించడమని వివరించారు. తాను నిర్వహించిన యాత్ర తాపాన్ని సృష్టించేదని తెలిపారు. ‘‘ఇది మీ లోపలికి మీరు చూసుకునేలా చేస్తుంది’’ అని చెప్పారు. భారతీయుల అసాధారణమైన నిలదొక్కుకునే తత్వాన్ని అర్థం చేసుకునేలా చేస్తుందన్నారు.

పోలరైజేషన్

హిందూ, ముస్లింల పోలరైజేషన్ ఉందా? అని ప్రశ్నించినపుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఈ పోలరైజేషన్ ఉందని, అయితే ప్రభుత్వ మద్దతుగల మీడియా ప్రచారం చేస్తున్నంత తీవ్రంగా లేదని చెప్పారు. పేదరికం, నిరక్షరాస్యత, ద్రవ్యోల్బణం, కోవిడ్ మహమ్మారి తర్వాత చిన్న తరహా, రుణగ్రస్థులైన వ్యాపారులు, భూమిలేని రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు వంటి నిజమైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి దీనిని ఓ సాధనంగా వాడుకుంటున్నారని తెలిపారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని గద్దె దించడం సాధ్యమేనా? అని ప్రశ్నించినపుడు ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షాలన్నీ ఏకమైతే, బీజేపీని ఓడించడం నూటికి నూరు శాతం సాధ్యమేనని చెప్పారు. రైట్ లేదా లెఫ్ట్ కానటువంటి విజన్‌ను వ్యతిరేకిస్తే ఇది సాధ్యమవుతుందన్నారు. శాంతి, సమైక్యతల కోసం మోదీని ఓడించవచ్చునని చెప్పారు. ఓ ప్రత్యామ్నాయాన్ని చూపిస్తే ఫాసిజం ఓడిపోతుందని తెలిపారు. భారత దేశపు రెండు దార్శనికతలు ఒకదానితో మరొకటి పోటీ పడితే, తమదే ఆధిపత్యమని చెప్పారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడటానికి నిరాకరించారు. ఇది విదేశాంగ విధానానికి సంబందించినదని, అయితే శాంతియుత పరిష్కారాలు అవసరమని తెలిపారు. శాంతియుతంగా పోటీ పడే పరిస్థితులు ఉంటే, పారిశ్రామిక రంగంలో, మరీ ముఖ్యంగా, తక్కువ ధరగల వస్తువులను ఉత్పత్తి చేయడంలో చైనాతో పాశ్చాత్య దేశాలు పోటీ పడటం సాధ్యంకాదన్నారు. అయితే భారతీయులు నిలదొక్కుకునే సామర్థ్యం కలవారు కాబట్టి భారత దేశం పోటీపడగలుగుతుందన్నారు.

నెహ్రూ గురించి...

దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో అనుబంధం గురించి అడిగినపుడు రాహుల్ స్పందిస్తూ, ఆయనను తనకు తెలియదని, అయితే ఆయనను తన మార్గదర్శకుడిగా భావిస్తానని చెప్పారు. తనను మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఎంతో ఆత్మీయంగా చూసేవారని చెప్పారు. తనకు బచ్చలి కూర, బఠాణీలు అంటే ఇష్టం ఉండదని, తన తండ్రి రాజీవ్ గాంధీ చాలా కట్టుదిట్టంగా వ్యవహరించేవారని, అన్నిటినీ తినేయాలని చెప్పేవారని తెలిపారు. ఆ సమయంలో ఇందిరా గాంధీ ఓ వార్తాపత్రికను చూపించి, చదవమనేవారని, ఆ పత్రిక మాటున తాను తన పళ్లెంలోని బచ్చలి కూర, బఠాణీలను ఆమె పళ్లెంలో పెట్టేసేవాడినని తెలిపారు.

ఇందిరకు ఆమె మరణం గురించి ఆమెకు తెలుసునని చెప్పారు. ఓసారి తనను ఆమె హెచ్చరించారని, ‘‘నేను మరణించిన రోజు నువ్వు ఏడవకు. కనీసం బహిరంగంగా ఏడవకు’’ అని చెప్పారని తెలిపారు.

రాజీవ్ గాంధీకి కూడా ఆయన మరణం గురించి ఆయనకు తెలుసునన్నారు. ‘‘ఆయనను చంపేది తమిళ టైగర్స్ అని ఆయనకు తెలుసో, లేదో నాకు తెలియదు. కానీ తన ప్రాణాలకు ముప్పు కలిగించే శక్తులు, ప్రయోజనాలు, బలగాలు ఏకమవుతున్నాయని ఆయన భావించారు’’ అని తెలిపారు.

‘‘మీ ప్రాణం గురించి మీరు భయపడుతున్నారనే వాదనపై మీరేమంటారు?’’ అని ప్రశ్నించినపుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ‘‘అది భయపడే విషయం కాదు. నేనేం చేయాలో అది చేస్తాను’’ అని చెప్పారు.

తనకు పిల్లలుండటాన్ని ఇష్టపడతానని, అయితే 52 ఏళ్ళు వచ్చినా ఇంకా ఎందుకు అవివాహితుడిగా ఉన్నానో కచ్చితంగా చెప్పలేనని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Coconut Water Lemon Juice: కొబ్బరి బోండం నీళ్లలో నిమ్మ కాయ పిండుకుని తాగితే ఏం జరుగుతుందంటే..

Stubborn Diseases: ఆ వ్యాధులను కూడా ఆట కట్టించొచ్చు!

Updated Date - 2023-02-21T15:13:01+05:30 IST